భాగ్యనగరి అత్యద్భుతమైన రుచులకు పెట్టింది పేరు. దీంతో హైదరాబాద్ నగరం మరోమారు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచంలోని ఉత్తమ హార నగరాల జాబితాలో భాగ్యనగరికి స్థానం లభించింది. ప్రముఖ ఫుడ్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' తాజాగా విడుదల చేసిన 100 ఉత్తమ నగరాల ర్యాంకుల్లో హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచి సత్తా చాటింది.
హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్ వంటి వంటకాలు కేవలం నగరానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నిజాం కాలం నాటి పర్షియన్, టర్కిష్ ప్రభావాలతో పాటు స్థానిక తెలంగాణ, ఆంధ్ర రుచులు కలిసి ఇక్కడి వంటకాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ చారిత్రక, సాంస్కృతిక సమ్మేళనమే భాగ్యనగర ఆహార వైవిధ్యానికి కారణమని నిపుణులు చెబుతారు.
స్థానిక వంటకాలేకాకుండా ఉత్తరాది ఘుమఘుమలతో పాటు చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాలు కూడా నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోల్చినప్పుడు ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం మరో విశేషం. అయితే, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు ఆహార ప్రియులు అభిప్రాయపడుతున్నారు.