శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య.. దీపావళి దీపాల కాంతులతో కొంగొత్త శోభను సంతరించుకుంది. రామ భక్తులు చేస్తున్న ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోతోంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య.. దీపావళి దీపాల కాంతులతో కొంగొత్త శోభను సంతరించుకుంది. రామ భక్తులు చేస్తున్న ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోతోంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన మెగా దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది.
ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రామ్ నాయక్, కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ తదితరులు హాజరయ్యారు. దీపోత్సవంలో భాగంగా నదీ తీరంలో 1.71 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. రామాయణంలోని వివిధ పాత్రలను కళాకారులు ధరించారు.
రామాయణంలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక సౌండ్ ఎఫెక్ట్స్‌తో నిర్వహించిన 22 నిమిషాల లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాదాపు ప్రభుత్వ యంత్రాంగమంతా అయోధ్యలోనే మకాం వేయడం గమనార్హం.
అయోధ్యను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేయడానికే 'త్రేతా యుగం నాటి దీపావళి'ని ప్రజల కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేశామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అయోధ్య నగర్ నిగమ్‌లో ఉన్న జనాభా 1.71 లక్షలని దానికి సమాన సంఖ్యలోనే దీపాలు వెలిగించినట్లు ఆయన తెలిపారు.