భారతీయ జనతా పార్టీకి ఉన్న బలమైన మిత్రపక్షాల్లో శివసేన ఒకటి. అలాంటి శివసేన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టింది. పిచ్చివాళ్ళ స్వర్గంలో బీజేపీ నేతలు అంటూ వ్యంగ్యాస్
భారతీయ జనతా పార్టీకి ఉన్న బలమైన మిత్రపక్షాల్లో శివసేన ఒకటి. అలాంటి శివసేన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టింది. పిచ్చివాళ్ళ స్వర్గంలో బీజేపీ నేతలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గత పది వేల సంవత్సరాల్లో ఎన్నడూ ఇంత ఘోరమైన పాలన చూడలేదని ఘాటైన విమర్శలు చేసింది.
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. దేశ బ్యాంకింగ్ రంగం భారీ కుదుపునకు లోనైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరెన్సీ కష్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు సాగుతున్నాయి. దీనికంతటికి ప్రధాని మోడీ తీసుకున్న అనాలోచిత, ముందుచూపులేని నిర్ణయాలే కారణమంటూ పలువురు ఆర్థికవేత్తలు ఆరోపిస్తున్నారు.
వీటిని అస్త్రంగా చేసుకుని బీజేపీ పాలనపై శివసేన నిప్పులు చెరిగింది. పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారని పేర్కొంది. మోడీ తన నిర్ణయంతో మహిళలను అష్టకష్టాల పాలు చేశారని శివసేన పార్టీ నేతలు ధ్వజమెత్తారు.
పాతనోట్ల మార్పిడికి అనుమతించలేదని ఓ తల్లి అర్థనగ్నంగా మారడం ప్రభుత్వ తీరుకు ప్రత్యక్ష ఉదాహరణ అని శివసేన విమర్శలు గుప్పించింది. మిత్రపక్షమే ఇలా దాడికి దిగడంతో ఎలా కౌంటరివ్వాలో తెలియక బీజేపీ నేతల్లో మథనం మొదలైంది.