పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని శనివారం గవర్నర్‌కు సమర్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇకపోతే.. పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం ఏర్పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం నాడు కీలక నిర్ణయం ఉంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చండీగఢ్‌లో జరగబోయే పార్టీ సమావేశానికి అందరూ హాజరు కావాలంటూ పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.
పెను మార్పులు ఉంటాయంటూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ సమస్యకు రాహుల్ గాంధీ సీరియస్ పరిష్కారం చూపబోతున్నారని, ఈ నిర్ణయం వల్ల పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తాయని జాఖడ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ ఇంతలో అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.