వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని కోరుతూ గత కొన్నేళ్లుగా రాష్ట్ర డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ పరిణామాలవేళ స్టాలిన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు.
ఈ అంశంపై తమిళనాడు సర్కారు అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ, నీట్ నుంచి మన రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే. అయితే, కేంద్రం మన అభ్యర్థనను తిరస్కరించొచ్చు కానీ, మన పోరాటాన్ని ఆపలేదు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం" అని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు.
దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9వ తేదీన అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ బిల్లు తీసుకొచ్చింది.
దీని ప్రకారం 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కల్పించాలని నిర్ణయించారు. ఈ బిల్లును ఇప్పటికే 2021, 2022లో రెండుసార్లు తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం గవర్నర్‌గా పంపగా, పలుమార్లు తిరస్కరణకు గురైంది. దీంతో బిల్లులో కొన్ని మార్పులుచేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు.