పవిత్ర తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కొండపై దారుణం జరిగింది. అరుణాచల దర్శనానికి వచ్చి తిరువణ్ణామలై కొండపై ధ్యానంలో నిమగ్నమైవున్న ఓ విదేశీ మహిళపై గైడ్ ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో భాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఫ్రాన్స్‌కు చెందిన 40 యేళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలై సందర్శన కోసం వచ్చారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలో ఓ ప్రైవేటు ఆశ్రమంలో ఆమె బస చేశారు. ఆలయం వెనుక ఉన్న మరో దారిలో కొండపైకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆమె స్థానికంగా ఉండే ఓ గైడ్ సాయం తీసుకునేవారు.
మూడు రోజుల క్రితం ఇలానే గైడ్ సాయంతో కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తుండగా గైడ్ ఆమెపై లైంగికదాడిగి తెగబడ్డాడు. ఆ తర్వాత ఆ కామాంధుడు నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టుచేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.