మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి సమాజం సిగ్గుపడే పని చేశాడు. ముగ్గురు కుమార్తెలను కలిగిన ఆ తండ్రి.. ఏకంగా పెద్ద కుమార్తెను నాలుగుసార్లు గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ముంబైలోని నలసోపారా వెస్ట్ ప్రాంతానికి చెందిన 56 యేళ్ల వ్యక్తి భార్య, 15, 17, 21 వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, ఆ వ్యక్తిపై 1980, 90లలో చేసిన అనేక దోపిడీ కేసులతో పాటు పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పైగా, అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆయనను చూస్తే భయపడేవారు.
దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ వ్యక్తి... గత 2018 నుంచి తన కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడసాగాడు. ఈ క్రమంలో నిందితుడు పెద్ద కుమార్తె ఏకంగా నాలుగుసార్లు గర్భందాల్చగా, ఎవరికీ తెలియకుండా గర్భస్రావం చేయించాడు.
అయితే, ఇటీవల కన్నతల్లికి పెద్ద కుమార్తెల ఆరోగ్యంపై అనుమానం వచ్చింది. దీంతో వారందరినీ ఓ గదిలో పెట్టి ఆరా తీయగా అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ మరుక్షణం అక్కడ నుంచి వారు తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. అయితే, పెద్ద కుమార్తె మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది.