రక్షించాల్సిన రక్షక భటుడే కామాంధుడయ్యాడు. తన సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషనుకు వచ్చిన యువతిని వలలో వేసుకుని కోర్కె తీర్చుకున్నాడు. అతడి కారణంగా గర్భవతి అయిన ఆమెను అడ్డు తొలగించే ప్రయత్నం చేసి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మేడ్చల్ ఇందిరా నగర్ కాలనీలో 31 ఏళ్ల యువతికి కొంతమందితో డబ్బు విషయమై సమస్య ఏర్పడింది. ఈ సమస్యను తీర్చమని ఫిర్యాదు చేసేందుకు గత ఏడాది మార్చి 21వ తేదీన పోలీసు స్టేషనుకి వెళ్లింది. అక్కడ క్రైమ్ విభాగంలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ ఆమె సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. రేపు తనకు ఫోన్ చేయమంటూ అతడి నెంబర్ ఆమెకి ఇచ్చాడు.
మరుసటి రోజు ఉదయం బాధితురాలు ఫోన్ చేయగానే... ఇంటికి రా, లాయర్‌తో మాట్లాడి ముగించేద్దాం అంటూ చెప్పాడు. ఆమె అక్కడికి వెళ్లగానే ఆమెను మాటల్లో పెట్టాడు. తనకు పెళ్లి కాలేదంటూ మరికాస్త సన్నిహితంగా మెలిగి ఆమెపై లైంగిక దాడి చేసాడు. ఆ తర్వాత మరికొన్నిరోజులు గడిచాక కూడా ఆమెను రప్పించుకుని ఇలాగే లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భవతి అయ్యింది. ఇది తెలుసుకున్న కానిస్టేబుల్ ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి అబార్షన్ చేయించాడు. బాధిత మహిళ తన సమస్య గురించి చెప్పుకునేందుకు ఫోన్ చేయగా అతడి భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది.
దీనితో తను మోసపోయానని గ్రహించిన బాధితురాలు అతడిని నిలదీసింది. ఇక ఆమెను అలాగే వదిలేస్తే సమస్యలు ఎక్కువవుతాయని భావించి ఆమె ఇంటికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ ఆమెతో బలవంతంగా ఫినాయిల్ తాగించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి పట్ల తను చేసిన లైంగిక దాడిని భార్యకు వివరించి తనకు సాయం చేయాలని ఆమెను వేడుకున్నాడు. దీనితో భర్త కోసం బాధితురాలిని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించింది.
అంతటితో ఆగని పోలీసు కానిస్టేబుల్ గత ఏడాది డిసెంబరు 16న బాధితురాలిని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వేగంగా వెళుతూ ఆమెను కిందకి తోసేసాడు. దీనితో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. తనను చంపేందుకు పోలీసు కానిస్టేబుల్ చేస్తున్న ప్రయత్నాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లింది బాధితురాలు. పోలీసు కానిస్టేబుల్ అరాచకాలను తెలుసుకున్న అధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.