దక్షిణ ముంబైలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 61 అంతస్తుల రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని 19వ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఓ వైపు ఎగిసిపడుతున్న అగ్నికీలలు.. మరో వైపు దట్టమైన పొగలు.. అగ్నికీలల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన సాహసం ప్రాణాలను బలి తీసుకున్నది.
ముంబైలో అవిఘ్న పార్కులోని 61 అంతస్తుల భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, 19వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో అక్కడున్న ఓ 30 ఏళ్ల యువకుడు అరుణ్ తివారీ తన ప్రాణాలను కాపాడుకునేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో ఆ అంతస్తులోని బాల్కనీలోకి తివారీ వచ్చాడు. అక్కడ్నుంచి కింది అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో పట్టు కోల్పోయి.. కింద జారిపడ్డాడు. దీంతో అతను చనిపోయాడని బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు.
దీనిపై బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చవాల్ స్పందిస్తూ, దక్షిణ ముంబైలోని అవిఘ్న పార్కులోని 64 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు ఉదయం 11:55 గంటలకు తమకు సమాచారం అందడంతో తక్షణమే అక్కడికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమైందని చెప్పారు.
ఆ అంతస్తులో ఉన్న అందరూ ప్రాణాలతో తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని బీఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు.