Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోశాలకు రెండు ఆవులు, దూడలు ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా చైర్మన్

Advertiesment
times of india
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 22 అక్టోబరు 2021 (14:16 IST)
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మన్ శివకుమార్ సుందరన్ కాంక్రీజ్ జాతికి చెందిన రెండు ఆవులు,  రెండు దూడలను శుక్రవారం దానంగా సమర్పించారు. ఆ పత్రిక ప్రతినిధి సందీప్ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవులు, దూడలను గోశాలకు అందించారు.
 
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి రెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకున్నారు. అనంతరం  సుబ్బారెడ్డి గోశాలను పరిశీలించారు. శ్రీవారి నవనీత సేవకు అవసరమయ్యే వెన్న తీయడానికి ఎన్ని లీటర్ల పాలు అవసరమవుతాయి,  ఎన్ని పాలిచ్చే ఆవులు ఉండాల్సిన అవసరం ఉందనే విష‌యాన్ని  అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ,   తిరుమలలో శ్రీవారికి దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడానికి తిరుమలలోని గోశాలను విస్తరిస్తామ‌న్నారు. ఇక్కడ సుమారు 150 పాలిచ్చే ఆవులను ఉంచడం కోసం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. 
 
గోశాల‌లో 60 దేశీయ జాతి ఆవులు ఉన్నాయని, మరో 70 నుంచి 80 ఆవులను దానంగా ఇచ్చేందుకు అనేక మంది దాతలు ముందుకొచ్చారని చైర్మన్ చెప్పారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టినందు వల్ల నవంబరు, డిసెంబరు మాసాలకు సంబంధించి రూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు,  సర్వ దర్శనం టికెట్ల సంఖ్య గత నెల కంటే పెంచామని చెప్పావు. శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసిన గంటన్నరలోనే  బుక్ చేసుకున్నారని చెప్పారు. జియో క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు సైతం మొబైల్ ఫోన్ ద్వారా కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాక  తిరుపతిలో కొంత మేరకు సర్వ దర్శనం టికెట్లు జారీ చేసే ఆలోచన చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు.  
 
ఈ ఏడాది మే నుంచి అమలు చేస్తున్న గో ఆధారిత నేవేద్యం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించడం లో భాగంగా  అక్టోబర్ 30 మరియు 31 వ తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రముఖులను ఆహ్వానించామన్నారు. టీటీడీ జేఈవో వీర బ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శివ కుమార్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యాయ పోరాటంలో గెలిచిన 39 మంది మహిళా ఆఫీసర్లు