దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మహారాష్ట్రలో జరిగింది. మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ తాజా రోడ్డు ప్రమాదంలో 22 మంది మృత్యువాతపడ్డారు.
సిధి జిల్లా పట్నా మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కాల్వలో పడింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 54 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాల్వలో పడిన అనంతరం ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మిగతా వారంతా కాల్వలోనే ఉండిపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాల్వలో బస్సు పడిపోయిందన్న ఘటన తెలుసుకున్న స్థానికులు వందలాది మంది అక్కడకు తరలివచ్చారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.