ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు తెల్లారిపోయాయి.
చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోగా, ఆ దిశగా వస్తున్న ఓ లారీ టెంపోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.