ఓ తాత మనవరాలిని ఎత్తుకుని భవనం టెర్రస్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి చేతులోంచి జారిపడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ మారుతీ లేఅవుట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లైన ప్రియాంక, వినయ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి అన్వీ అనే ఆరు నెలల కూతురు ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండటంతో వినయ్ దంపతులు ఇంటిని శుభ్రం చేయాలనుకున్నారు.
ఈ నేపథ్యంలో పాపను టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆడించమని వినయ్ తన తండ్రికి సూచించాడు. దీంతో వినయ్ తండ్రి మనవరాలిన తీసుకుని పైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు పాప చేతుల్లోంచి జారిపడింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వారు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండా పాప మార్గమధ్యలోనే మృతిచెందింది.