Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్‌తో తగ్గిన హత్యలు, కిడ్నాప్‌లు, ఇతర నేరాలు

కరోనా వైరస్‌తో తగ్గిన హత్యలు, కిడ్నాప్‌లు, ఇతర నేరాలు
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:26 IST)
కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూఇటుగా 33 నుంచి 55 శాతం తగ్గుదల నమోదైంది. రోడ్లపై, వీధుల్లో జనసంచారం లేకపోవడం నేరాలు తగ్గడానికి ప్రాథమిక కారణమైతే.. ప్రతీ వీధిలోనూ పోలీసు గస్తీ, నిఘా పెరగడం రెండో కారణం. 
 
అదే సమయంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజలు ముఖ్యంగా యువత లాక్‌డౌన్‌ నిబంధనలను ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. మార్చి 22 నుంచి 31 వరకు 10 రోజుల పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో 4 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి.
 
2018 నేషనల్‌ క్రైం బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం.. ఈ నేరాలను పోల్చి చూసినపుడు ఐపీసీ సెక్షన్ల కింద రోజూ 383 నేరాలు నమోదు కాగా, 33 శాతం (254 నేరాలు మాత్రమే) తగ్గుదల నమోదైంది. ఇందులో సాధారణంగా పెట్టీ కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం నమోదైన ఐపీసీ కేసుల్లో అధికశాతం లాక్‌డౌన్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. ఇక కిడ్నాపుల పరంగా చూస్తే.. రోజుకు సగటున దాదాపు 5 కిడ్నాపు కేసులు నమోదు కాగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 2.5 కేసులే నమోదయ్యాయి. 
 
2018 ఎన్‌సీఆ ర్‌బీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రోజుకు 2.5 హత్యల చొప్పున నమోదవగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 1.4 హత్యల చొప్పున రికార్డయింది.
 
పదిరోజుల్లో 4,369 కేసులు.. 
డెకాయిటీ (1), రాబరీ (2), పగటి చోరీలు(2), రాత్రి చోరీలు (17), దొంగతనాలు (153), హత్యలు (14), అల్లర్లు (14), కిడ్నాప్‌లు (24), లైంగిక దాడులు (8), తీవ్రంగా గాయపర్చడం (4), స్వల్పదాడులు (260), మోసాలు (101), నమ్మకద్రోహం (12), మాద కద్రవ్యాల సరఫరా (0), హత్యాయత్నాలు (18), తీవ్ర రోడ్డు ప్రమాదాలు (48), సాధారణ రోడ్డు ప్రమాదాలు (92), ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు (2,546), ఇతర సెక్షన్ల కింద 1,053 కేసులు కలిపి మొత్తంగా పదిరోజుల్లో 4,369 కేసులు నమోదయ్యాయి.

అధిక రోడ్డు ప్రమాదాలు అందువల్లే.. 
రోడ్‌ సేఫ్టీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 60 మంది గాయపడగా, 18 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పది రోజుల్లో చిన్నాపెద్దా అన్నీ కలిపి 140 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 90 శాతం ప్రమాదాలు వాహనదారుల స్వయంకృతాపరాధం వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సోకిన రోగి విచ్చలవిడిగా తిరిగితే 406 మందికి సంక్రమిస్తుంది...