కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సోమవారం నుంచి దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. సోమవారం ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తాము నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లోనే రైతులు దీక్ష చేయనున్నారు. మిగతా రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష రద్దు చేసినట్టు రైతు సంఘాలు వెల్లడించాయి.
అటు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, కొత్త వ్యవసాయ చట్టాలకు కొన్ని రైతు సంఘాలు మద్దతిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాఖండ్ రైతులు తనను కలిసి కొత్త చట్టాలకు మద్దతు తెలిపారని వివరించారు.
కొత్త చట్టాలను అర్థం చేసుకున్న ఉత్తరాఖండ్ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సాగు చట్టాలకు మద్దతిచ్చే సంఘాలకు, నేతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తోమర్ చెప్పారు.
ఇదిలావుంటే, రైతుల ఆందోళనలకు ఢిల్లీలోని అధికార ఆప్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమవారం నుంచి జరిగే ఆందోళనల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని ఆప్ ప్రకటించింది.
ఇదిలావుంటే, ఉద్యోగానికి ఐపీఎస్ రాజీనామా
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు.
పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ అయిన లక్మీందర్ సింగ్ జఖర్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హోం శాఖ కార్యదర్శికి పంపించారు. రాజీనామా చేసిన విషయాన్ని ఏడీజీపీ (జైలు) పీకే సిన్హా ధ్రువీకరించారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో దేశంలోని రైతులు కలత చెందుతున్నారని, వారికి బాసటగా నిలిచేందుకు డీఐజీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో లక్మీందర్ తెలిపారు.
'నేను ఒక రైతు కొడుకును, రైతుల ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. అందుకే డీఐజీ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఢిల్లీ వెళ్లి రైతు సోదరులతో హక్కుల కోసం పోరాడటానికి వీలుగా వెంటనే విధుల నుంచి విడుదల చేయండి' అని తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.