కరోనా పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. విద్యార్థుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన ఇక తొలిగిపోవాలన్నారు. ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలను రద్దు చేయడంతో 12వ తరగతి విద్యార్థుల ఫలితాల ప్రకటనకు నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాలని సీబీఎస్‌ఈకి సూచించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విస్తృతమైన సంప్రదింపుల అనంతరం విద్యార్థులకు అనుకూలమైన, వారి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడే నిర్ణయం తీసుకున్నాం అని సమావేశం తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
ఇప్పటికే సీబీఎస్‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది సీబీఎస్‌ఈ ఏ పరీక్షలనూ నిర్వహించనట్టయింది. సీబీఎస్‌ఈ బాటలోనే సీఐఎస్‌సీఈ కూడా 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది.