Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : ముగిసిన సన్‌రైజర్స్ కథ... ఫలించిన ఢిల్లీ 'ఫైనల్' నిరీక్షణ

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (08:10 IST)
ఐపీఎల్ 13వ సీజన్‌ ఆఖరి మ్యాచ్ (ఫైనల్)లో తలపడే జట్లు ఏవో తేలిపోయాయి. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాటం ముగిసింది. అదేసమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ సుధీర్ఘకాల ఫైనల్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన ఢిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్స్‌లోకి తొలిసారి అడుగుపెట్టింది. 
 
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై రెండు సార్లు ఛేజింగ్‌లో ఓడిన ఢిల్లీ.. కీలక మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడ్డ పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన స్టొయినిస్‌.. ధవన్‌తో కలిసి జట్టుకు మంచి శుభారంభం ఇచ్చారు. హైదరాబాద్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా క్యాపిటల్స్‌కు బాగా కలిసొచ్చాయి.
 
ఓపెనర్లు ఎడాపెడా బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. సందీప్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన స్టొయినిస్‌.. హోల్డర్‌ వేసిన నాలుగో ఓవర్‌లో 4,4,6,4 బాదాడు. మరో ఎండ్‌ ధవన్‌ వరుస ఓవర్లలో 4,4, 6,4 అందుకోవడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించాక స్టొయినిస్‌ను రషీద్‌ ఔట్‌ చేశాడు.
 
ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (21) వేగంగా ఆడలేకపోయినా.. కానీ, హెట్‌మైర్‌ దంచి కొట్టాడు. 26 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్న ధవన్ మ్యాచ్ చివర్లో కాస్త నెమ్మదించగా.. చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్‌ బౌలర్లు ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకుండా కట్టడి చేయడంతో ఢిల్లీ మరింత భారీ స్కోరు చేయలేకపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ (1/50), నదీమ్‌ (0/48) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 190 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రబాడ వేసిన రెండో ఓవర్‌లో కెప్టెన్‌ వార్నర్‌ (2) ఔట్‌ కాగా.. ఐదో ఓవర్‌లో స్టొయినిస్‌ డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన ప్రియమ్‌ గార్గ్‌ (17; 2 సిక్సర్లు), మనీశ్‌ పాండే (21; 3 ఫోర్లు) వెంటవెంటనే ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 
 
ఈ దశలో విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకోగా.. అతడికి హోల్డర్‌ (11) కాసేపు సహకరించాడు. అయితే ఒక ఎండ్‌లో కేన్‌ ధాటిగా ఆడుతున్నా.. హోల్డర్‌ మాత్రం భారీ షాట్లు ఆడలేకపోయాడు. అబ్దుల్‌ సమద్‌ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో లక్ష్యాన్ని కరిగించిన విలియమ్సన్‌ విజయానికి 43 పరుగులు అవసరమైన దశలో ఔట్‌కాగా.. రషీద్‌ ఖాన్‌ 6,4 బాదడంతో సమీకరణం 12 బంతుల్లో 30కి చేరింది. 
 
ఈ దశలో ఓ సిక్సర్‌తో ఆశలు రేపిన సమద్‌తో పాటు రషీద్‌ (11), గోస్వామి (0)ని రబాడ ఒకే ఓవర్లో ఔట్‌ చేయడంతో రైజర్స్‌ ఓటమి ఖాయమైంది. ఢిల్లీ జట్టులో బ్యాటింగ్‌లోనూ రాణించిన ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ బంతితోనూ విజృంభించాడు. స్టొయినిస్ 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రబాడా మొత్తమ్మీద నాలుగు వికెట్లు తీసి సన్ రైజర్స్‌కు కళ్లెం వేశాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. 
 
ఇక, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్... ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 10న దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments