Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరు?

ఐపీఎల్ 2020 అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరు?
, ఆదివారం, 8 నవంబరు 2020 (12:56 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే క్రీడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). కరోనా వైరస్ కారణంగా ఈ యేడాది స్వదేశీ గడ్డపై జరగాల్సిన టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించారు. గత 12 సీజన్లు స్వదేశంలో నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ 13వ సీజన్ మాత్రం గత 12 సీజన్లకు భిన్నంగా నిర్వహించారు. గతంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్‌లు జరిగేవి. కానీ ఈ దఫా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించారు. దీనికి కారణం కరోనా మహమ్మారి. అయినప్పటికీ.. ఈ టోర్నీ విజయవంతమైంది. ఈ సీజన్‌కు రో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన స్టార్ ఆటగాళ్ల వివరాలను ఓసారి పరిశీలిస్తే, 
 
దేవదత్ పడిక్కల్ : విదేశీ ఆటగాళ్ళతో నిండిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అందరికన్నా ఎక్కువగా మెరిసిన ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్. బెంగళూరు ఈసారి ప్లేఆఫ్స్ చేరుకోవడంలో పడిక్కల్ చాలా కీలకపాత్రే పోషించాడు. లీగ్ దశలో 125 స్ట్రేక్ రేట్‌తో 472 పరుగులు చేసి సత్తాచాటాడు. మొత్తమ్మీద 51 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
 
రాహుల్ తెవాటియా : గల్లీ క్రికెట్‌లో బాదినట్లు బంతిని బాదేస్తూ ఈ ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన యవ క్రికెటర్. తెవాటియా ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. అయినాసరే తెవాటియా మాత్రం అభిమానుల మనసు గెలుచుకున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఈ సీజన్‌లో 11 ఇన్నింగ్సులాడిన తెవాటియా 255 పరగుగులు చేయడంతోపాటు 10 వికెట్లు కూడా పడగొట్టి ఆల్‌-రౌండ్ ప్రతిభ చాటాడు.
 
రవి బిష్ణోయ్ : అండర్-19 వరల్డ్ కప్ స్టార్ రవిబిష్ణోయ్.. ఐపీఎల్‌లో కూడా సత్తాచాటాడు. పంజాబ్ జట్టులో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లలో బిష్ణోయ్ ఒకడు. ఈ సీజన్‌లో 12 వికెట్లే తీసినా.. డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, పంత్, ఫించ్, మోర్గాన్.. వంటి టాప్ ప్లేయర్ల వికెట్లు అతని ఖాతాలో ఉండటం గమనార్హం. పంజాబ్ జట్టు కష్టంలో ఉన్న ప్రతిసారీ బిష్ణోయ్ తన బంతితో మాయచేసే ప్రయత్నం చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్ శైలి భారత దిగ్గజ లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు దగ్గరగా ఉంటుంది. 
 
టి. నటరాజన్ : సన్‌రైజర్స్ జట్టు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసే బౌలర్‌ కోసం జట్టు గాలించగా వారికి లభించిన సమాధానమే నటరాజన్. ఈ 29 ఏళ్ల బౌలర్ 14 మ్యాచుల్లో 13 వికెట్లు కూల్చాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ కెప్టెన్ వార్నర్.. నటరాజన్‌వైపే చూశాడు. సీనియర్ బౌలర్ లేని లోటును శక్తిమేర పూడ్చిన నటరాజన్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
 
రుతురాజ్ గైక్వాడ్ : ఈ సీజన్‌లో అత్యంత పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌ నుంచి తప్పుకున్న తొలిజట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ జట్టు కూడా ఓ ఆణిముత్యాన్ని కనుగొంది. అతనే రుతురాజ్ గైక్వాడ్. సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రుతురాజ్.. ఆరు ఇన్నింగ్సుల్లోనే 204 పరుగులు చేశాడు. చెన్నై పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచే అవమానాన్ని త్రుటిలో తప్పించుకోవడం కూడా రుతురాజ్ చలవే. 
 
వరుణ్ చక్రవర్తి : ఐపీఎల్‌తో బయటపడిన మరో సత్తా ఉన్న ఆటగాడు వరుణ్ చక్రవర్తి. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన ఈ స్పిన్నర్ అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచుల్లో 17 వికెట్లు కూల్చి జట్టు స్టార్ ప్లేయర్‌గా మారాడు. ఇతని సత్తాను గమనించిన టీమిండియా సెలెక్టర్లు.. ఆసీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టులో వరుణ్‌కు స్థానం కల్పించారు. ఆర్కిటెక్ట్‌గా ఉద్యోగం వదిలేసి మరీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వరుణ్‌.. తాను భారత జట్టుకు ఎంపికవ్వడాన్ని నమ్మలేకపోతున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
అర్షదీప్ సింగ్ : పంజాబ్ జట్టులోనే వెలుగుచూసిన మరో యువకిరణం అర్ష‌దీప్ సింగ్. ఎనిమిది మ్యాచుల్లో తొమ్మిది వికెట్లే తీసినా కూడా.. మహమ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్ వంటి ఇంటర్నేషనల్ పేసర్ల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ ఆరడుగుల మీడియం పేసర్. రోహిత్ శర్మ, మనీష్ పాండే, ఆండ్రీ రసెల్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ల వికెట్లను కూల్చి తన ప్రతిభను చూపించాడీ 21 ఏళ్ల ప్లేయర్. తన వద్ద అంతర్జాతీయ మ్యాచులు ఆడే సత్తా ఉందని నిరూపించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్‌తో తలపడేది ఎవరు?