Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లాలో 120 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

Advertiesment
చిత్తూరు జిల్లాలో 120 మంది టీచర్లకు కరోనా పాజిటివ్
, గురువారం, 5 నవంబరు 2020 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 2 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో, వారందరినీ వెంటనే పాఠశాల నుంచి ఇంటికి పంపించేశారు.
 
అలాగే, చిత్తూరు జిల్లాలో ఏకంగా 120 మంది టీచర్లకు కరోనా సోకింది. ఓ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం గంగలకుర్రు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 50,209 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 55,331 మంది కోలుకున్నారు.
 
అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 704 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,24,315కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 77,11,809 మంది కోలుకున్నారు. 5,27,962 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో బుధవారం వరకు మొత్తం 11,42,08,384 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 12,09,425 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,539 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 978 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,45,682 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,25,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1362కి చేరింది. ప్రస్తుతం 18,656 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 15,864 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 285 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 123 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కార్యాలయ ఉద్యోగి పెళ్లికి వచ్చిన వైఎస్. జగన్ దంపతులు..