ఎవడే సుబ్రమణ్యం, మహానటి చిత్రాలతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం 'జాతిరత్నాలు`. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూ.
దర్శకుడు అనుదీప్ కేవీ ఈ కథ మీకు చెప్పిన దగ్గరినుండి ఎలా ట్రావెల్ అయ్యారు?
ఈ సినిమా కథ డైరెక్డర్ వచ్చి నాకు చెప్పలేదు. అనుదీప్ చేసిన ఒక కామెడీ షార్ట్ ఫిలిం నచ్చి నేనే అతన్ని వెతుక్కుంటూ వెళ్లాను. నాకు జంధ్యాలగారి, ఎస్‌వి కృష్టారెడ్డిగారి సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే అలాంటి ఒక హిలేరియస్ సినిమా చేద్దాం అని డైరెక్టర్ని వెళ్లి కలిశాను. తను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేసి ఈ సినిమా చేశాం.
స్క్రిప్ట్ విషయంలో సూచన ఏమైనా ఇచ్చారా?
ఈ సినిమాలో కామెడీ, స్టోరీ డైరెక్టర్ ఐడియానే..కాకపోతే వారితో ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించిన కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను.
ఒక సీన్ అనుకున్నప్పుడు ఇలా తీద్దాం అని ప్రతి డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది. కాబట్టి ఒక నిర్మాతగా అనుదీప్ ఐడియా క్లాష్ అవకుండా, క్రియేటివ్‌గా, టెక్నికల్ గా అతని ఫ్లేవర్ తగ్గకుండా అన్ని సమకూర్చాను. ఎప్పుడైనా నాకు ఎమైనా అనిపిప్తే ఈ షాట్ ఇలా కూడా తీసుకోవచ్చేమో కదా అని అనుదీప్ వెనక నుండి చెప్పేవాన్ని. దానికి ఎప్పుడు వెళ్తారు సర్ ఇంటికి అనే వాడు..ఇలా షూటింగ్ అంతా చాలా సరదాగా జరిగింది.
నవీన్, రాహుల్, ప్రియదర్శి ఈ కాంబినేషన్ ఎవరి ఛాయిస్?
నవీన్, విజయ్ నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుండి పరిచయం. ఫస్ట్ ఎవడే సుబ్రమణ్యం సినిమాని విజయ్, నవీన్‌తో కలిసి తీద్దాం అనుకున్నాను కాని కుదరలేదు. అనుదీప్ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు నవీన్ అయితే బాగుంటుంది అనిపించింది. తను అప్పుడే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కి వెళ్తున్నాడు. తనకి ఈ స్టోరీ పంపాను. తనకి నచ్చింది. అలాగే మిగతా పాత్రలకి రాహుల్, ప్రియదర్శికి కూడా కథ నచ్చడంతో వారిని ఎంచుకోవడం జరిగింది.
వీళ్లే మన జాతిరత్నాలు అనిపించిందా?
(నవ్వుతూ) అవును. వారిని చూడగానే వీళ్లే మా జాతిరత్నాలు అనిపించింది. నవీన్ ఎలాంటి రోల్ అయినా చేయగలడు, కామెడీ అయితే డిఫరెంట్ లెవల్‌లో చేశాడు. అలాగే రాహుల్, ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. ఎలాంటి స్టోరీకైనా వీళ్ల కాంబినేషన్ అదనపు అడ్వాంటేజ్ అవుతుంది.
సినిమా ఎలా ఉండబోతుంది. స్టోరీ లైన్ ఏంటి?
ఈ సినిమా రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుకోవడమే..ఇంక స్టోరీ లైన్ అంటారా మా డైరెక్టర్ అనుదీప్ చెప్పినట్టు చెప్తాను. ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది?అనేదే ఈ సినిమా కథ. మనీ మనీ, అనగనగా తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్.
టైటిల్ ఆలోచన ఎవరిది?
అనుదీప్ నాకు రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఒకటి జాతి రత్నాలు. ఈ టైటిల్ అయితే మార్కెటింగ్ బిజినెస్ బాగుంటుంది అని ఫిక్స్ చేయడం జరిగింది.
హీరోయిన్ సెలక్షన్ ఎలా జరిగింది?
క్యాస్టింగ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఫరియా కనిపించింది. ఈ సినిమాకి అనే కాకుండా ఈ అమ్మాయి డేఫినెట్‌గా స్క్రీన్ మీద బాగుంటుంది అనిపించింది. తనతో మాట్లాడినప్పడు తనకి మంచి కామెడీ టైమింగ్ ఉంది అనిపించింది. ఈ విషయం అనుదీప్‌కి చెప్పగానే ఓకే అన్నాడు.
ఈ సినిమా ద్వారా ఏమైనా సందేశాన్ని ఇస్తున్నారా?
ఇంత మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కలిసి ఒక సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకి ఒక పర్పస్ ఉండాలి. ఒక పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమాలో నటించిన వాళ్లని గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటాను. అనుదీప్ ప్యూర్ కామెడీ తీద్దాం అన్నప్పుడు దాంతో పాటు మంచి సందేశం కూడా ఉండేలా చేద్దాం అని కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వడం జరిగింది.
మీ డైరెక్టర్ అనుదీప్ గురించి చెప్పండి?
ముందుగా అతని ప్యూర్ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది. ఒక స్క్రిప్ట్ రాయాలన్నా..సినిమా తీయాలన్నా బ్రెయిన్ కావాలి. కాని మంచి కామెడీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్‌కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్‌గా వచ్చింది.
మీకు కామెడీ సినిమాలు అంటే ఇష్టం అన్నారు కదా ఆ తరహా సినిమా చేసే అవకాశం ఉందా?
నా ప్రతి సినిమాలో హ్యూమర్ ఉంటుంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలు తీసుకుంటే అందులో హ్యూమర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారితో చేసే సినిమాలో కూడా మంచి హ్యూమర్ ఉంటుంది. నవీన్‌కి బాలీవుడ్‌లో కూడా మార్కెట్ ఉంది.ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేసే అవకాశం ఉందా. ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత హిందిలో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతారా?
నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశ్యం లేదు.. ఒక వేళ మంచి కంటెంట్ సినిమాలు వస్తే స్వప్న సినిమా ద్వారా వాటిని ప్రోత్సహిస్తాం.