నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిరత్నాలు'. కామెడీ క్యాపర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
గురువారం 'జాతిరత్నాలు' ట్రైలర్‌ను ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముంబైలో లాంచ్ చేశారు. హీరో హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ ప్రియదర్శి, డైరెక్టర్ అనుదీప్ తదితర యూనిట్ మెంబర్స్ ముంబైలో ప్రభాస్ నివాసానికి వెళ్లి మరీ ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడం విశేషం. నవీన్ పోలిశెట్టిది జోగిపేట. అందుకే "జోగిపేట - ముంబై" అంటూ ఓ వీడియోను రూపొందించి, తామెలా ప్రభాస్‌ను కలుసుకున్నామో వినోదాత్మకంగా చూపించింది చిత్ర బృందం.
ముంబైలో తన ఇంట్లో ఒక నవారు మంచంపై కూర్చొని 'జాతిరత్నాలు' ట్రైలర్‌ను ప్రభాస్ ఆవిష్కరించారు. హీరోయిన్‌ను చూసి, "ఈమేంటి ఇంత పొడవుంద"ని ఆశ్చర్యం ప్రకటించారు. ట్రైలర్‌ను చూసి, "సూపర్. చాలా బాగుంది" అని ప్రశంసించారు. "టీజర్ నాకు గుడ్ అనిపించింది. ట్రైలర్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సూపర్బ్. ట్రైలర్ చూసి పదిసార్లు నవ్వానంటే, సినిమా ఇంకెంతసేపు నవ్విస్తుందో ఊహించుకోవాల్సిందే.
సినిమా అంతా హిలేరియస్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. కోవిడ్ తర్వాత ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా నవ్వుకొంటూ ఎంజాయ్ చేసే సినిమా అనుకుంటున్నాను. డైరెక్టర్ అనుదీప్‌కు, యాక్టర్స్‌కు, ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్‌కు, ఎంటైర్ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్తున్నాను." అన్నారు ప్రభాస్. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయినందుకు యూనిట్ అమితానందాన్ని వ్యక్తం చేసింది.
Prabhas, jaatiratnalu team
ఇదివరకు టీజర్ చూసినప్పుడు ఈ సినిమా కథ రూ. 500 కోట్ల చుట్టూ నడుస్తుందని అర్థమైంది. ట్రైలర్ అయితే మొదలైన దగ్గర్నుంచీ ముగిసే దాకా నవ్విస్తూనే ఉంది. దీన్ని బట్టి ప్రభాస్ చెప్పినట్లు సినిమా చూస్తుంటే మనం పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం.
ఈ సినిమాలో శ్రీకాంత్ (నవీన్), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు ఫ్రెండ్స్ అని ఇదివరకు టీజర్ ద్వారానే మనం తెలుసుకున్నాం. శ్రీకాంత్‌కు ఓ లవ్ స్టోరీ కూడా ఉంది. హీరోయిన్‌ను పటాయించడానికి మనోడు ఎన్ని వేషాలు వేస్తాడో ట్రైలర్ చూపించింది. బీటెక్ చదివిన అతను 'శ్రింగార్ లేడీస్ ఎంపోరియం' నడుపుతుంటాడని మనం తెలుసుకుంటాం. ఎంతో జోవియల్‌గా ఉండే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చంచల్‌గూడ జైలుకు ఖైదీలుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా, ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా డైరెక్టర్ చిత్రీకరించి ఉంటారని మనం ఊహించవచ్చు. జైలులో ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌కి వెన్నెల కిశోర్ కూడా తోడవుతాడు. ఇంక నవ్వులకు కొదవ ఉంటుందా!
చివరలో జడ్జిగా కనిపించిన బ్రహ్మానందం "మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా?" అనడిగితే, బోనుమీద చేత్తో కొడ్తూ నవీన్ సీరియస్‌గా, "మా కేస్ మేమే వాదించుకుంటాం యువరానర్" అని చెప్తాడు. దాంతో బ్రహ్మానందం "తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా".. అని తన సహాయకుడితో, "రేయ్... మనమెందుకిక్కడ? వెళ్లిపోదాం రండి" అని చైర్‌లోంచి లేవడం ఎంతగా నవ్విస్తుందో.. ఇలా జాతిరత్నాలు ట్రైలర్. రధన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మనోహర్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. మార్చి 11న 'జాతిరత్నాలు' థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.