ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు తమ వశం చేసుకున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. దీనిపై విమర్శలు చెలరేగాయి. దీంతో తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్ జక్రుల్లా హషీమీ స్పందించారు.
మహిళలపై తమ ఛాందసవాదంలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో మహిళలు ఎప్పటికీ స్థానం దక్కించుకోలేరని, మంత్రి పదవులు వారికి పెనుభారం అవుతాయని అభిప్రాయపడ్డారు.
ఆ భారాన్ని మోసే బదులు వారు పిల్లలకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. బిడ్డలనుకని వారిని ఇస్లామిక్ విలువలకు అనుగుణంగా పెంచడం వారి విధి అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో నిరసనలు తెలుపుతున్న మహిళలు ఆఫ్ఘన్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆఫ్ఘన్ మహిళలైతే ఆ విధంగా వీధులకెక్కి ప్రదర్శనలు చేపట్టబోరని వ్యాఖ్యానించారు.