సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 45 మంది ప్రాణాల కోల్పోయారు. వీరంతా హైదరాబాదీయులేనని హజ్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్ళిన వీరి ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉండటం మరింతగా కలిచివేస్తోంది. ఈ దుర్ఘటనతో హైదరాబాద్ నగరంలోని మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.
సోమవారం తెల్లవారుజామున మక్కాలో ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని మదీనా నగరానికి బస్సులో యాత్రికులంతా బయలుదేరారు. మదీనా నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండగా వీరు ప్రయాణస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జరగరాని ఘోరం జరిగిపోయింది.
ఈ భయానక ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 45 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారని హజ్ కమిటీ అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విషాద ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతదేహాలను వీలైనంత త్వరగా హైదరాబాద్ నగరానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.