కాంగోలో ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఓ ఆయిల్ ట్యాంకర్‌పై మరో వాహనం ఢీకొన్న ఘటనలో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో వంద మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కాంగో ఆర్టేరియల్ హైవేపై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొంది.
ఆయిల్ ట్యాంకర్ పేలి రెప్పపాటులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వాహనాల్లో ఉన్నవాళ్లు అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ సమాధి అయ్యారు. పలు వాహనాలకు మంటలు అంటుకోవడంతో బుగ్గిపాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులు ఆర్తనాదాలతో ఆర్టేరియల్ హైవే మార్మోగింది. ఆ ప్రదేశం భయానకంగా మారింది.
పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కాంగో తాత్కాలిక గవర్నర్ అటో మటుబువనా ధృవీకరించారు. హైవే పక్కన ఇళ్లకు మంటలు అంటుకోవడంతో, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.