అమెరికాలో హాట్ఎయిర్ బెలున్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. న్యూ మెక్సికో నగరంలో హాట్ఎయిర్ బెలూన్ విద్యుత్ తీగలకు తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. హాట్ఎయిర్ బెలున్ అదుపుతప్పి ఒక్కసారిగా అక్కడున్న విద్యుత్ తీగలవైపు దూసుకెళ్లి విద్యుత్ తీగలకు తాకడంతో మంటలు చెలరేగాయి.
బెలూన్ మంటలలో చిక్కుకోవడంతో 100 అడుగల ఎత్తులో నుంచి ముందు బెలూన్‌కు ఉన్న గోండోలా నేలకొరిగింది. ప్రమాదం జరిగిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.