నగదు రహితం హంబగ్.. నగదు డిమాండ్ శాశ్వతం అంటున్న స్విట్జర్లండ్
ఓవైపు భారత ప్రభుత్వం నగదు చలామణిని తగ్గించేసి క్యాష్‌లెస్ లావాదేవీలు చేయాలంటూ ఊదరగొడుతుంటే .. మరోవైపు అపర కుబేరులకు స్వర్గధామం స్విట్జర్లాండ్ మాత్రం నగదుకే పెద్ద పీట వేస్తోంది. క్యాష్‌లెస్ పేమెంట్
ఓ వైపు భారత ప్రభుత్వం నగదు చలామణిని తగ్గించేసి క్యాష్‌లెస్ లావాదేవీలు చేయాలంటూ ఊదరగొడుతుంటే .. మరోవైపు అపర కుబేరులకు స్వర్గధామం స్విట్జర్లాండ్ మాత్రం నగదుకే పెద్ద పీట వేస్తోంది. క్యాష్‌లెస్ పేమెంట్స్‌తో పోలిస్తే నగదుకే విశ్వసనీయత ఎక్కువని.. లావాదేవీల ఖర్చూ తక్కువగా ఉంటుందని చెబుతోంది. బాసెల్‌లో జరిగిన వరల్డ్‌బ్యాంక్ నోట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ సీఈవో ఫ్రిట్జ్ జర్‌బ్రెగ్ ఈ విషయాలు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు కాబట్టి క్యాష్ వాడకమే సులువని, నగదు లావాదేవీలతో బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నగదుతో వ్యక్తిగతంగా ఆర్థిక విషయాలను గోప్యంగా కూడా ఉంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘గడిచిన కొన్నాళ్లుగా నగదు భవిష్యత్తుపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. విమర్శకులు నగదును పూర్తిగా నిషేధించాలని.. లేదా నగదురహిత ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తే క్రమంగా క్యాష్ పూర్తిగా నిరుపయోగం అవుతుందని చెబుతున్నారు. అయితే ఇదంతా అతిశయోక్తే. సామాన్యులకు సంబంధించి నగదుకు డిమాండ్ ఎక్కువే. గడిచిన కొన్నేళ్లలో చాలా మటుకు దేశాల్లో జీడీపీతో పోలిస్తే చెలామణీలో ఉన్న నగదు పరిమాణం విలువ గణనీయంగా పెరిగింది’ అని ఆయన వివరించారు.
భారత్ సహా పలు దేశాల నల్ల కుబేరులు బ్లాక్ మనీ దాచుకునేందుకు స్వర్గధామమని స్విట్జర్లాండ్ అపప్రథ మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్నుంచి బైటపడేందుకు అంతర్జాతీయ క్లయింట్ల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచే స్విస్ బ్యాంకింగ్ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో పన్ను ఎగవేతదారులు, ఇతరత్రా ఆర్థిక నేరాల కేసులు ఉన్న వారి వివరాలను స్విట్జర్లాండ్ నుంచి సేకరించేందుకు భారత్ సహా వివిధ దేశాలకు వీలవుతుంది. ఇదే క్రమంలో ఆర్థికవ్యవస్థను మరింత ప్రక్షాళన చేసేందుకు స్విట్జర్లాండ్ కూడా పెద్ద నోట్లను రద్దు చేయొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రిట్జ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
క్యాష్ లావాదేవీల పెరుగుదలకు ఆర్థిక సంక్షోభం అనంతరం బ్యాంకుల స్థిరత్వంపై అనిశ్చితి నెలకొనడం ఒక కారణం కాగా.. వ్యయాలు తక్కువగా ఉండటం మరో కారణమని ఫ్రిట్జ్ పేర్కొన్నారు. సర్వేలు, ఇతరత్రా ఆధారాలను బట్టి చూస్తే ఇప్పటికీ చెల్లింపులకు నగదే అత్యధికంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ‘నగదుకు ప్రత్యామ్నాయంగా అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఇది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు.
కొందరు వ్యక్తిగత కారణాలతో నగదు వాడకం వైపు మొగ్గు చూపుతుండొచ్చు. ఎందుకంటే దీనివల్ల బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది. అలాగే నగదు వాడకానికి సాంకేతికత అక్కర్లేదు’ అని ఫ్రిట్జ్ చెప్పారు. ‘క్యాష్‌లెస్‌కు లేని గుణాలెన్నో నగదుకు ఉన్నాయి. టెక్నికల్ ఇన్‌ఫ్రా అవసరం లేదు కాబట్టి.. నగదు చాలా విశ్వసనీయమైన మాధ్యమం. ఆర్థికవిషయాల్లో గోప్యత కూడా ఉంటుంది. ఎవరికి ఎంత మాత్రం సమాచారం ఇవ్వొచ్చన్న అధికారం నగదు యజమాని దగ్గరే ఉంటుంది‘ అన్నారు.