అనుమానమే ఆ కుటుంబానికి సర్వనాశనం చేసింది. ఉన్నత విద్యను అభ్యసించిన భర్తను సైకోగా మార్చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్ళి చేస్తే తమ కుమార్తె జీవితం ఎంతో బాగుంటుందని భావించిన ఆ కుటుంబానికి చివరికి విషాదమే మిగిల్చింది. అతి దారుణంగా భార్యను చంపేసి పరారయ్యాడు భర్త.
కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు భర్త. కూకట్ పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో జరిగింది. తెలంగాణా రాష్ట్రం కామారెడ్డి జిల్లా దేవులపల్లికి చెందిన పుట్టెల గంగారాం చిన్న కూతురు సుధారాణికి అదే ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ ఆగష్టు 28వ తేదీన వివాహం జరిగింది. వీరు హైదరాబాద్ లోని ప్రశాంత్ నగర్ లోని అపార్టుమెంట్లో నివాసముంటున్నారు.
పెళ్ళయిన వారంరోజుల నుంచే భార్యపై కిరణ్‌కు అనుమానం మొదలైంది. ఆమె తను ఎవరితోను మాట్లాడడం లేదని.. ఎవరితోను కలవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా భర్త వినిపించుకోలేదు. పదేపదే ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతూ వచ్చాయి. అక్కడ జరుగుతున్న విషయాలను తల్లిదండ్రులకు చెప్పింది సుధారాణి.
అయితే భర్తతో సర్దుకుపోవాలని సూచించారు తల్లిదండ్రులు. ఇద్దరి మధ్య నిన్న రాత్రి గొడవ తారాస్థాయికి చేరడంతో కత్తితో అతి దారుణంగా సుధారాణిని చంపేశాడు భర్త. కుమార్తె ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కుమార్తె హత్యకు గురైందని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.