Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధితురాలి ప్రవర్తన మంచిది కాకపోతే అత్యాచారం జరగనట్టా? ఆమె ప్రవర్తనకు కేసుతో లంకె ఎందుకు?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (16:07 IST)
మన వస్తువును ఎవరైనా దొంగిలిస్తే.. "నువ్వే ఏదో చేసి ఉంటావు" అని ఎవరూ అనరు. కానీ అత్యాచారం జరిగితే మాత్రం బాధితులపై ప్రశ్నలు సంధిస్తుంటారు. ఇలా ప్రశ్నలు అడగడాన్ని చట్టం నిషేధించినప్పటికీ ఇది కొనసాగుతోంది. తన జూనియర్‌పై అత్యాచారం చేశారంటూ ఆరోపణలు వచ్చిన కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవాలోని ఓ న్యాయస్థానం ఇటీవల తీర్పు చెప్పింది. ఆ కేసులోనూ బాధితురాలిని ఇలాగే ప్రశ్నించారు.

 
నవంబరు 2013లో తెహల్కా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు, తరుణ్ తేజ్‌పాల్ తన జూనియర్‌ను వరుసగా రెండు రాత్రులు లిఫ్ట్‌లో అత్యాచారం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును కోర్టు విచారించింది. ఈ ఆరోపణలపై స్పందనలను తెలుసుకోవడానికి బాధితురాలిని కోర్టులో కొన్ని ప్రశ్నలు అడిగారు. ''గతంలో ఎవరితోనైనా ఆమెకు శారీరక సంబంధాలున్నాయా? మెసేజుల్లో ఎవరితోనైనా చిలిపిగా ప్రవర్తించారా? ఒకవేళ ఆమెకు సెక్స్ అలవాటు అయితే, ఆమె ఆ రెండు రాత్రులూ తరుణ్ తేజ్‌పాల్‌తో సెక్స్‌లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే ఉంటారు''

 
''ఆ అత్యాచారం తర్వాత ఆమె నవ్వుతూ ఉన్నారు. మంచి మూడ్‌లోనే కనిపిస్తున్నారు. ఆమె ఆఫీస్ నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అంత ఆనందంగా కనిపిస్తుంటే, అసలు ఆమెపై అత్యాచారం జరిగిందా? అనే అనుమానం వస్తోంది''. ''అత్యాచారం జరిగిన సమయంలో తరుణ్ తేజ్‌పాల్ కాళ్లు నేలకు ఏవైపు ఉన్నాయి? బాధితురాలి డ్రెస్ లోపలి లైనింగ్ ఆమె మోకాళ్ళ పైకి ఉందా? లేదా కిందకి ఉందా?''

 
''తేజ్‌పాల్ కేవలం ఆమెను పైపైనే ముట్టుకున్నారా? లేదా ఇంకా ఏమైనా చేశారా? ఈ విషయాలను ఆమె సరిగ్గా గుర్తు పెట్టుకోకపోతే ఆమె నిజం చెబుతున్నట్లు అనుకోవచ్చా?''. 527 పేజీల ఆ తీర్పులో ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో కనిపిస్తాయి. చివరకు నిందితుడిపై చేసిన ఆరోపణలు అబద్ధమని చెబుతూ ఆయన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇదేదో అనుకోకుండా జరిగిన విషయం కాదు.

 
అత్యాచార బాధితురాలు సామాజిక నియమాలను పాటించకపోతే, నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం లేదా శిక్షను తగ్గించడం లాంటివి కోర్టులు చేస్తున్నాయి. గత 35ఏళ్లలో భారత్‌లో జరిగిన వివిధ అధ్యయనాలు ఈ విషయాలను స్పష్టంచేస్తున్నాయి. అత్యాచార కేసుల విచారణలో బాధితురాలి ప్రవర్తనకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని చట్టం కూడా నిషేధించింది. అయినప్పటికీ చాలా మంది న్యాయమూర్తులు, ఇలాంటి ధోరణులకు ప్రాముఖ్యం ఇస్తూ తీర్పులను వెలువరిస్తున్నారు.

 
ఇవి ఉదాహరణలు...
ముందే లైంగిక సంబంధాలు ఉంటే..
 
భారత్‌లో 1984 నుంచి 2009 మధ్యలో సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మృణాల్ సతీశ్ అధ్యయనం చేశారు. ఈ 25 ఏళ్లలో అత్యాచారానికి గురైన మహిళలకు అంతకుముందు లైంగిక సంబంధాలు లేని పక్షంలో నిందితులకు దీర్ఘకాలిక శిక్షలు పడ్డాయి. మహిళకు వివాహానికి ముందు శారీరక సంబంధాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఉన్నట్లు తెలిస్తే బాధితులకు శిక్షాకాలాన్ని తగ్గించారు.

 
వివాహానికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసే సామాజిక నియమాల నుంచే అలాంటి మహిళల పట్ల సానుభూతి లేకపోవడం పుట్టుకొస్తోంది. సెక్స్‌ అలవాటున్న మహిళ అత్యాచారం వల్ల కోల్పోయేదేమీ లేదని, లైంగిక హింస జరిగిన సమయంలో అంతగా గాయపడి ఉండరనే నమ్మకాన్ని ''కన్యత్వానికి ఇచ్చే విలువ'' ప్రోత్సహిస్తోంది. అలాంటి మహిళలు అత్యాచారం జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తారని, పరస్పర అంగీకారంతోనే శారీరక కలయిక జరిగి ఉండవచ్చనే ధోరణులకు ఇలాంటి విలువలు మరింత మద్దతు పలుకుతున్నాయి.

 
దీనికి ప్రేమ్ చంద్ వెర్సస్ స్టేట్ ఆఫ్ హరియాణా-1984 కేసు ఒక ఉదాహరణ. ఈ కేసులో రవి శంకర్‌పై ఒక మహిళను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారనే అభియోగం ఉంది. ఈ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు, ఇద్దరు పోలీసులు తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పారు. ఆ ముగ్గురు వ్యక్తులను దోషులుగా చెబుతూ కింది స్థాయి కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, రవి శంకర్ పంజాబ్, హరియాణా హైకోర్టులో అప్పీలు చేసుకున్నప్పుడు, ఆయనను నిర్దోషిగా ప్రకటించారు.

 
ఈ కేసులో బాధితురాలికి 18 ఏళ్లలోపు వయసున్నట్లు విచారణలో నిరూపితం అవ్వలేదని, ఆమె రవిశంకర్‌తో కలిసి ఇష్టపూర్వకంగానే కలిసి తిరిగారని, సెక్స్‌లో పాల్గొన్నారని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ కేసులో నిందితులైన పోలీసులకు హైకోర్టులో ఎలాంటి సాంత్వన దొరకకపోవడంతో, వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. వారి శిక్షను సుప్రీంకోర్టు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గించింది.

 
ఈ తీర్పును వెల్లడిస్తూ, ''సదరు యువతి వ్యక్తిత్వం ప్రశ్నార్థకంగా ఉంది. ఆమె ప్రవర్తన విచ్చలవిడిగా, అసభ్యకరంగా ఉంది. పోలీస్ స్టేషన్‌లో ఆమెపై అత్యాచారం జరిగిందని 1984, మార్చి 28 నాటికి అంటే కేసు విచారించే వరకూ కూడా ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఆమె చెప్పిన విషయం ఆమోదయోగ్యంగా లేదు''అని కోర్టు పేర్కొంది. అయితే, మహిళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించడం తప్పని ఆ తర్వాతి కాలంలో కోర్టులు అభిప్రాయపడ్డాయి.
 

"బాధితురాలు అంగీకారం తెలపలేదని చెప్పినప్పటికీ కూడా ఆమె ఇదివరకటి లైంగిక ప్రవర్తనను డిఫెన్స్ న్యాయవాదులు తమ వాదనల్లోకి తీసుకువస్తారు. ఆమె మర్యాదను, గౌరవాన్ని నాశనం చేసి ఆధారాలను చూపించేందుకు ప్రయత్నిస్తారు'' అని లా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ 2003లో పేర్కొన్నాయి. కమిషన్ చేసిన సూచనలను అనుసరించి, ఆ ఏడాది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ను సవరించారు. ఈ సవరణ ప్రకారం.. అత్యాచారం జరిగినప్పుడు ఆమె అంగీకారం తెలిపారా? లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె పూర్వ లైంగిక చరిత్రను పరిగణనలోకి తీసుకోకూడదు. అయినప్పటికీ, ఇలాంటి ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. 2015లో స్టేట్ వర్సెస్ హవాల్‌దార్ కేసులోనూ ఇలానే తీర్పును ప్రకటించారు. 
 

అప్పుడు ఏమైంది?
"అత్యాచారం జరిగిన తర్వాత అంతర్గత అవయవాలు బాగా దురద పెట్టడంతో ఆ భాగాలను శుభ్రపరుచుకోవాల్సి వచ్చిందని బాధితురాలు చెప్పారు. ఆమె వివాహిత. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఆమెకు లైంగిక కలయికలు కొత్తేమీ కాదు. అయినప్పటికీ, అత్యాచారం జరిగిన తర్వాత ఆమెకు వ్యక్తిగత భాగాల్లో దురద రావడం ఏమిటో అర్థం కావడం లేదు. ఆమె నిందితులతో ఇష్టపూర్వకంగానే లైంగిక చర్యలో పాల్గొన్నారు. దాని గురించి ఆధారాలు లేకుండా చేయడానికే ఆమె వ్యక్తిగత భాగాలను శుభ్రపరుచుకున్నారని అర్ధమవుతోంది. దీని గురించి, ఆమె సోదరుడికి తెలియకూడదనే ఆమె ఇలా చేశారు" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితులను దిల్లీలోని ద్వారక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

 
విచారణలో భాగంగా ప్రశ్నలు వేయడం మాత్రమే కాకుండా, మహిళ లైంగిక చరిత్రను తెలుసుకునేందుకు ''టు ఫింగర్ టెస్ట్''ను కూడా చేస్తారు. ఈ పరీక్షలో భాగంగా డాక్టర్లు ఒకటి లేదా రెండు వేళ్ళను యోనిలోకి చొప్పించి యోని సాగే తీరును పరిశీలిస్తారు. అత్యాచారం జరిగినప్పుడు, నిజంగానే శారీరక కలయిక జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్షను చేస్తారు. రెండు వేళ్లను సులభంగా చొప్పించగలిగితే, ఆ మహిళకు సెక్స్‌ కొత్త కాదని భావిస్తారు.

 
అయితే, నిర్భయ సామూహిక అత్యాచారం తర్వాత ఈ పరీక్షను 2013లో నిషేధించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని హెల్త్ రీసెర్చ్ విభాగం.. లైంగిక దాడి బాధితుల ఫోరెన్సిక్ వైద్య పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమావళిని విడుదల చేసింది. "ఈ టు ఫింగర్ టెస్ట్‌కు కాలం చెల్లింది. ఈ పరీక్ష చేసేందుకు శాస్త్రీయత లేదు. అందుకే దీన్ని చేయడం ఆపాలి. ఈ ప్రక్రియ చాలా అవమానకరంగా, అశాస్త్రీయంగా ఉంది" అని ఆ నియమావళిలో పేర్కొన్నారు.

 
లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన వర్మ కమిటీ కూడా.. "అత్యాచారం జరిగిందా, జరగలేదా అని తేల్చడానికి చట్టపరమైన విచారణ చేయాలి కానీ, వైద్యపరమైన పరిశీలన కాదు" అని పేర్కొంది. అదే సంవత్సరంలో, కర్ణాటకలో మహిళలపై చోటుచేసుకున్న లైంగిక హింస కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వెలువరించిన తీర్పులను సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ అధ్యయనం చేసింది.

 
అందులో 20 శాతానికి పైగా తీర్పుల్లో, టు ఫింగర్ టెస్ట్‌ను ప్రస్తావిస్తూ, బాధితురాలి పూర్వ లైంగిక చరిత్ర గురించి చేసిన పరిశీలనలను జత చేశాయి. 2013లో రమేశ్ భాయ్ చన్నా భాయ్ సోలంకి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో.. ఓ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిందితుడిని కింది స్థాయి కోర్టు 2005లో దోషిగా పేర్కొంది. కానీ, హైకోర్టులో ఈ కేసుపై అప్పీలు వేశారు. "ఈ కేసులో బాధితురాలి శరీర వ్యక్తిగత భాగాల్లో గాయాలైన గుర్తులేవీ లేవని, ఆమె శారీరక కలయికకు అలవాటు పడి ఉందని ఇద్దరు డాక్టర్లు సాక్ష్యాలు ఇచ్చారు. అందులో ఒక గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు" అని హై కోర్టు చెప్పింది.

 
గాయాలు లేకపోతే..
శారీరక సంబంధానికి, అత్యాచారానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా సెక్స్‌కు అంగీకారం లేకపోవడమే. మహిళల వ్యక్తిగత భాగాల్లో గాయాలు, దాడి చేసిన వారిని అడ్డుకునే సమయంలో శరీరంపై ఏర్పడిన గీతలు, చిరిగిన దుస్తులు లాంటి వాటిని మహిళల అంగీకారం తెలపలేదనడానికి సాక్ష్యాలుగా చూస్తారు. కానీ, ఇలా లేకపోయినా కూడా అత్యాచారం జరిగి ఉండవచ్చు. గాయాలు లేకపోవడం లేదా, అత్యాచారాన్ని ప్రతిఘటిస్తున్నట్లు మహిళ శరీరంపై ఎలాంటి చిహ్నాలు లేకపోవడాన్ని ఆమె అంగీకారం తెలిపినట్లుగా పరిగణిస్తారు.

 
మహిళ శరీరంపై గాయాలు లేకపోవడాన్ని అంగీకారంగా పరిగణిస్తూ కోర్టులు రాతపూర్వకంగా చెప్పనప్పటికీ, అలాంటి కేసుల్లో నిందితులకు శిక్ష పరిమితిని తగ్గించారు అని ప్రొఫెసర్ మృణాల్ సతీశ్ పేర్కొన్నారు. అయితే, కొన్ని కోర్టులు మాత్రం గాయాలు లేకపోవడం అంగీకారం తెలపడమే అని నిరూపిస్తోందని చెప్పడానికి సిగ్గు పడలేదు. ఉదాహరణకు 2014లో, కర్ణాటక వర్సెస్ శివానంద మహాదేవప్ప ముర్గీ కేసులో, బెలగావి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

 
"దుస్తులు చిరగకపోవడం, బాధితురాలి శరీరంపై గాయాలు లేకపోవడంతో.. సంఘటన అంగీకార పూర్వకంగానే జరిగిందని అర్థమవుతోంది. అలాగే, అత్యాచారం జరగలేదని చెప్పడాన్ని వైద్య, ఫోర్సెనిక్ ఆధారాలు కూడా సమర్థిస్తున్నాయి" అని కోర్టు పేర్కొంది. అదే సంవత్సరంలో అత్యాచారానికి గురైన బాధితురాలి శరీరంపై ఉన్న గాయాలను అత్యాచారం జరిగిందనడానికి ప్రధాన ఆధారంగా పరిగణించకూడదని క్రిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణా కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

 
లైంగిక దాడికి గురైన మహిళ కోర్టు ముందు అంగీకారం తెలపలేదని చెప్పిన పక్షంలో దానిని అంగీకారం లేనట్లే పరిగణించాలని 1984లోనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ను సవరించారు. ఈ మార్పును తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు తర్వాత తీసుకుని వచ్చారు. దీనినే మథుర రేప్ కేస్ అని అంటారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు ఒక మైనర్ గిరిజన తెగకు చెందిన అమ్మాయిని అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

 
కింది స్థాయి కోర్టులో వారికి శిక్ష పడింది. బొంబాయి హై కోర్టులోని నాగ్‌పుర్ బెంచ్, సుప్రీం కోర్టు కూడా వారిని 1978లో దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో, ఆ అమ్మాయి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, దాంతో, ఆ శారీరక కలయిక ''శాంతియుత వ్యవహారం'' అని కోర్టు పేర్కొంది. అత్యాచారం జరిగినప్పుడు ఆ అమ్మాయి ప్రతిఘటించడం అబద్ధమని తేల్చింది. ఆమె నిందితులను సంతృప్తి పరిచేందుకు, వారిని అనుమతించిన విధానం చూస్తుంటే, ఆమె తప్పక లొంగిపోయినట్లు అనిపించటం లేదని కోర్టు చెప్పింది. ఈ సుప్రీం కోర్టు తీర్పు అనేక విమర్శలను ఎదుర్కొంది. ఈ తీర్పుపై నలుగురు ప్రొఫెసర్లు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. దాంతో, 1983-84లో లైంగిక హింస వ్యతిరేక చట్టాలలో మార్పులు తీసుకొచ్చారు.

 
బాధితురాలిలా ప్రవర్తించకపోతే
ఇప్పటివరకు జరిగిన చర్చను పరిశీలిస్తే, లైంగిక హింసను అరికట్టే చట్టాలు పురోగమన స్థాయిలోనే ఉన్నాయని తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు, మహిళా ఉద్యమకారులు చేసిన ప్రయత్నాల మూలంగా చాలా వరకు చట్టాలను బాధితులకు స్నేహ పూర్వకంగానే ఉండేటట్లు చేస్తున్నారు. అత్యాచార కేసుల్లో శిక్షలు కేవలం 27.8 శాతం మాత్రమే ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019 సమాచారం చెబుతోంది.

 
ఇది ఐపీసీ నేరాలలో పడే జాతీయ సగటు శిక్షల రేటు (50.4 %)తో పోలిస్తే చాలా తక్కువ. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఈ తీర్పులను చట్టంలో ఉన్న నిబంధనల కంటే కూడా సామాజిక అభిప్రాయాలు ఎక్కువగా నిర్దేశిస్తున్నాయి. దిల్లీలో కింది స్థాయి కోర్టులు 2013-2018 వరకు వెలువరించిన 1635 తీర్పులను ఇండియన్ లా రివ్యూ కోసం లీగల్ అధ్యయనకారులు ప్రీతి ప్రతిశ్రుతి దాస్ అధ్యయనం చేశారు. అందులో పావు వంతు కేసుల్లో, బాధితులు ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవిగా లేని కారణంతో నిందితులకు శిక్ష పడలేదు. దానికి ముఖ్యంగా, అత్యాచారానికి ముందు బాధితురాలి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

 
ఉదాహరణకు 2009లో స్టేట్ వర్సెస్ నరేశ్ దహియా కేసులో కూడా దిల్లీ తీస్ హజారీ కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ''అత్యాచారం జరిగిన తర్వాత బాధితురాలు ఎటువంటి అల్లరి చేయకుండా నిందితునితో కలిసి సబ్‌లోక్ క్లినిక్ దగ్గర గోల్ గప్పాలు తింది. అలాంటి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది''అని కోర్టు పేర్కొంది. బాధితురాలు సంఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియచేయకుండా, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయడానికి జరిగిన జాప్యాన్ని కూడా బాధితురాలిచ్చిన సాక్ష్యాలను పనికిరానివని చెప్పినట్లు ఈ అధ్యయనం తెలిపింది.

 
అత్యాచారానికి గురైన బాధితురాలు ఫిర్యాదును నమోదు చేయడానికి భారతీయ చట్టం కాల పరిమితిని నిర్దేశించలేదు. నేరం జరిగిన తర్వాత ఆమె ఎప్పుడైనా ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అయితే, ఫిర్యాదును నమోదు చేయడంలో కలిగే జాప్యం వల్ల వైద్యపరమైన, ఫోరెన్సిక్ ఆధారాలను సంపాదించడానికి, ప్రత్యక్ష సాక్షులను సంపాదించడానికి సవాళ్ళను తెస్తుంది. కానీ, ఈ విషయంలో బాధితురాలిచ్చే సాక్ష్యం నమ్మశక్యం కాదనడానికి ఇది కారణం కాదు.

 
కానీ, 2017లో స్టేట్ వర్సెస్ రాధే శ్యాం మిశ్ర కేసులో దిల్లీ తీస్ హజారీ కోర్టు నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. దిల్లీ హై కోర్టులో 2019లో అప్పీలు ఫైల్ చేసినపుడు ఆ తీర్పును కోర్టు సమర్థించింది. ఫిర్యాదును నమోదు చేయడంలో జరిగిన జాప్యం పట్ల కోర్టు ఈ విధంగా స్పందించింది. "భార్య పై అత్యాచారం జరిగినట్లు భర్తకు సాయంత్రానికే తెలిసింది. కానీ, ఇద్దరిలో ఎవరూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడం గాని, 100కి కాల్ చేయడం గాని, లేదా ఇరుగు పొరుగుకు తెలియచేయడం కానీ చేయలేదు. ఈ జాప్యం ఎందుకు జరిగిందో వివరణ దొరకలేదు".

 
లైంగిక హింస తప్ప మరో నేరం ఏమి జరిగి ఉండదు అంటూ బాధితురాలిని చాలా ప్రశ్నలు వేశారు. ఆమె ప్రవర్తనను వేలెత్తి చూపారు. ఆమె ఇచ్చిన సాక్ష్యాల నిజాయితీపై అనుమానాలు వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పులు తేవడానికి చేసిన పోరాటంలో కొంత విజయం సాధించినప్పటికీ, సామాజిక ఆలోచనల్లో మార్పులు తేవడం మాత్రం పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. న్యాయాన్ని సాధించడంలో ఇదే పెద్ద ఆటంకంగా పరిణమిస్తోంది.

 
స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమాన సంబంధాలు, సామాజిక వ్యవస్థలో వారికున్న అసమానతలు, మహిళ భుజాలపై పరువు పేరుతో వేసిన బరువు.. వీటన్నిటిలో మార్పులు తెచ్చి సమానత్వం సాధించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసేవరకు న్యాయం కోసం చేసే పోరాటం కష్టంగానే ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

ధూం ధాం సినిమాతో మేం నిలబడ్డాం: చేతన్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

తర్వాతి కథనం