Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయావతి కల నెరవేరేనా? బెహన్‌జీ ప్రధాని కావాలన్న పవన్ మాట నిజమవుతుందా?

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (14:01 IST)
ఇటీవల దేవబంద్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్, అజిత్ సింగ్ కలిసి నిర్వహించిన ర్యాలీలో అజిత్ సింగ్ వేదికపైకి ఎక్కడానికి వస్తున్నప్పుడు ఒక బీఎస్పీ నేత ఆయన్ను చెప్పులు తీసి రావాలని చెప్పారు. మాయావతికి ఏ వేదికపై ఉన్నా, అక్కడ తనతోసహా ఎవరూ చెప్పులు వేసుకోవడం ఆమెకు నచ్చదు.
 
అజిత్ సింగ్ తన చెప్పులు తీయాల్సి వచ్చింది. తర్వాతే ఆయనకు ఆ వేదికపై మాయావతితో కలిసి నిలబడే అవకాశం లభించింది. ఇది శుభ్రత పట్ల ఒక మహిళ నిబద్ధతే కాదు, సంఖ్యాబలం కోసం దేశమంతా నిరంతరం మారుతున్న సామాజిక సమీకరణాలకు కూడా అధ్దం పడుతుంది.
 
ఆమె జీవిత చరిత్ర రాసిన అజయ్ బోస్ శుభ్రత విషయంలో మాయావతి కరకుగా ఉండడం వెనుక ఒక కథ ఉందని చెప్పారు. "బెహెన్‌ జీ ఎంపీ అయిన తర్వాత నూనె రాసుకున్న ఆమె జుత్తు, వేసుకున్న దుస్తులు చూసి అప్పట్లో ఆధునికంగా ఉండే ఎంపీలు ఆటపట్టించేవారు. మాయావతికి చాలా చెమట పడుతుందని వారు తరచూ ఫిర్యాదు చేసేవారు. వారిలో ఒక మహిళా ఎంపీ మంచి పెర్‌ఫ్యూమ్ కొట్టుకుని పార్లమెంటుకు రావాలని నేరుగా మాయావతితోనే అన్నారు. కొందరు మాటిమాటికీ ఆమె దగ్గర కులం ప్రస్తావన తెచ్చి, దళితులే ఇలా అపరిశుభ్రంగా ఉంటారని ఆమెకు అనిపించేలా ప్రయత్నించేవారు. అది ఆమెపై చాలా ప్రభావం చూపించింది. అందుకే "ఎంత పెద్దవారైనా తన గదిలోకి చెప్పులు వేసుకుని రాకుండా చూడాలని" ఆదేశించారు.
 
నేహా దీక్షిత్ కార్వాన్ పత్రికలో రాసిన "ద మిషన్-ఇన్ సైడ్ మాయావతీస్ బేటిల్ ఫర్ ఉత్తర్ ప్రదేశ్" అనే వ్యాసంలో శుభ్రత విషయంలో మాయావతి ఎంత కచ్చితంగా ఉండేవారంటే, ఆమె తన ఇంట్లో రోజుకు మూడుసార్లు తుడిపించేవారు" అని తెలిపారు.
 
క్షణ క్షణానికీ మారే మనస్తత్వం
మాయావతి మూడ్ గురించి ఊహించడం చాలా కష్టంగా ఉండేది. అది 1999 ఏప్రిల్ 17. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని లోక్‌సభలో బలపరీక్షకు సిద్ధం కావాలని చెప్పారు. ప్రభుత్వం మాత్రం ధీమాగా ఉంది. ఎందుకంటే చౌతాలా ఎన్డీయేలోకి తిరిగి వస్తానని ప్రకటించారు. మాయావతి పార్టీ నుంచి కూడా తాము ఓటింగ్‌లో పాల్గొనడం లేదనే సంకేతాలు వచ్చాయి. ఆ రోజు పార్లమెంటు పోర్టికోలో ఆయన కార్లో కూచుంటున్నప్పుడు వెనక నుంచి మాయావతి గట్టిగా "మీరేం దిగులు పడకండి" అన్నారు.
 
ఏప్రిల్ 16 రాత్రి లోక్‌సభలో మాయావతి ప్రసంగం ముగియగానే, అర్జున్ సింగ్ ఒక వ్యక్తిని వెతకడంలో మునిగిపోయారు. ఆయన మాట పార్టీకి శాసనం లాంటిది. ఆయనే కాన్షీరాం. కాన్షీరాం ఆ రాత్రి పట్నాలో ఉన్నారు. అర్జున్ సింగ్ ఆయన్ను తర్వాత రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో దిల్లీ రావడానికి ఒప్పించారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలిస్తే ఆ విమానాన్ని ఆలస్యం చేయించవచ్చని కాంగ్రెస్ కూటమి ఆందోళనతో ఉంది. అందుకే బిహార్ ముఖ్యమంత్రి రబ్డీ దేవి ప్రభుత్వ విమానాన్ని ఆయన కోసం స్టాండ్ బైలో ఉంచారు.
 
అర్థరాత్రి బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీలు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అక్బర్ అహ్మద్ డంపీ ఇద్దరూ మాయావతికి ఫోన్లో "మనం బలపరీక్షకు హాజరు కాకుండా ఉండడం మన ముస్లిం ఓటర్లకు నచ్చదు" అని చెప్పారు. మాయావతి వారికి రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి "మీ బాధ అర్థమైంది. ఉదయం 9 గంటలకు మా ఇంటికి రండి" అని చెప్పారు.
 
ఎర్ర బటన్ నొక్కగానే కుప్పకూలిన వాజ్‌పేయి ప్రభుత్వం
అప్పటికే ప్రభుత్వానికి ఏదో గందరగోళం జరగబోతోందని అనిపించింది. కానీ వారు ఏ అవకాశం వదులుకోకూడదని అనుకున్నారు. కాన్షీరాం విమానం దిల్లీలో లాండ్ అవగానే.. వాజ్‌పేయి ఆయనకు ఫోన్ చేశారు. ఆయన వాజ్‌పేయికి మా పార్టీ ఓటు వేయడం లేదని మరోసారి నమ్మకంగా చెప్పారు. ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు పార్లమెంటు వ్యవహారాల మంత్రి కుమారమంగళం బీఎస్పీ ఎంపీలతో మాట్లాడారు. మీరు సహకరిస్తే, సాయంత్రానికి మాయావతి యూపీ ముఖ్యమంత్రి కాగలరు అన్నారు.
 
ప్రభుత్వ కూటమిలో కలకలం చూసిన శరద్ పవార్ మాయావతి దగ్గరకెళ్లారు. ఆమె ఆయనతో "మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుందా" అన్నారు. దానికి పవార్ 'అవును' అన్నారు. చర్చ తర్వాత ఓటింగ్ సమయంలో సభలో నిశ్శబ్దం ఉంది. మాయావతి ఎంపీలు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, డంపీ వైపు చూసి "ఎర్రబటన్ నొక్కండి" అని గట్టిగా అరిచారు. అది అప్పట్లో చాలా పెద్ద రాజకీయ విన్యాసం. ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషిన్ ఫలితాలు ఫ్లాష్ అవగానే వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో ఓడినట్లు తేలింది. అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోడానికి మాయావతి ఎప్పుడూ వెనకాడేవారు కాదు.
 
కాన్షీరాం మాయావతి మొదటి కలయిక
అలాగే 1977 డిసెంబర్‌లో ఒక రాత్రి కూడా ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజు ముందే దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో 21 ఏళ్ల మాయావతి అప్పటి ఆరోగ్య మంత్రి రాజ్ నారాయణ్‌ని ఎదిరించి మాట్లాడారు. రాజ్ నారాయణ్ తన ప్రసంగంలో మాటిమాటికీ దళితులను 'హరిజన్' అంటున్నారు. దాంతో మాయావతి మీరు మమ్మల్ని హరిజన్ అంటూ అవమానిస్తున్నారు అని గట్టిగా చెప్పారు. ఒక రోజు అర్థరాత్రి 11 గంటలకు ఎవరో ఆమె ఇంటి తలుపు తట్టారు.
 
మాయవతి వాళ్ల నాన్న ప్రభుదయాళ్ తలుపు తెరవగానే ఆయనకు బయట ముడతలు పడ్డ బట్టలు, మెడలో మఫ్లర్ వేసుకున్న ఒక మధ్య వయసు వ్యక్తి కనిపించారు. ఆయన నా పేరు కాన్షీరాం, నేను బామ్‌సెఫ్ అధ్యక్షుడిని అన్నారు. పుణెలో ఒక సభలో ప్రసంగించేందుకు మాయావతిని ఆహ్వానించారు. అప్పుడు మాయావతి దిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో ఉండేవారు. ఆమె ఇంట్లో కరెంటు ఉండేది కాదు. ఆమె లాంతరు వెలుగులో చదువుకునేవారు. "కాన్షీరాం మాయావతిని మొదట నువ్వేం చేయాలని అనుకుంటున్నావ్’’ అని అడిగారని 'కాన్షీరాం ద లీడర్ ఆఫ్ దలిత్స్' పుస్తకంలో బద్రీ నారాయణ్ రాశారు.
 
కాన్షీరాం ఆమెను అలా అడగ్గానే.. ‘‘నేను నా వర్గానికి సేవ చేయడానికి ఐఏఎస్ కావాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. కాన్షీరాం ఆమెతో.. ‘‘నువ్వు ఐఏఎస్ అయి ఏం చేస్తావ్. ఒకరు కాదు పది మంది కలెక్టర్లు నీ వెనుక క్యూ కట్టేలా నేను నిన్ను ఒక పెద్ద నేతగా చేస్తా. అప్పుడే నువ్వు మీ ప్రజలకు సరైన సేవలు అందించగలవు’’ అన్నారు. ‘‘మాయావతికి వెంటనే తన భవిష్యత్తు ఎక్కడుందో అర్థమైంది. అయితే ఆమె తండ్రి దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవారు. ఆ తర్వాత మాయావతి కాన్షీరాం నిరసనల్లో భాగమయ్యారు" అని బద్రీనారాయణ్ ఆ పుస్తకంలో రాశారు.
 
మాయావతి తన ఆత్మకథ 'బహుజన్ ఆందోళన్ మార్గ్ మే మేరీ జీవన్ సంఘర్ష్ గాథ'లో "ఒక రోజు మా నాన్న కాన్షీరాంను కలవద్దని నాపైన అరిచారు. ఐఏఎస్ రాసేందుకు మళ్లీ చదువు, లేదంటే నా ఇంట్లో ఉండద్దు అని అరిచారని" చెప్పారు.
 
ఇల్లు వదిలి కాన్షీరాం దగ్గరకు మాయావతి
మాయావతి తండ్రి మాట వినలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. పార్టీ ఆఫీసులోనే ఉండేవారు. మాయావతి జీవితచరిత్ర రాసిన అజయ్ బోస్ తన పుస్తకం "బహుజని-ఎ పొలిటికల్ బయోగ్రఫీలో ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు పొదుపు చేసిన జీతం తీసుకున్నారు, కొన్ని బట్టలు సూట్‌కేస్‌లో నింపుకొన్నారు. తాను పెరిగిన ఇంటి నుంచే వచ్చేశారు. "ఆ సమయంలో ఒక అమ్మాయి ఇల్లు వదిలి రావడం అంటే చాలా పెద్ద విషయం. ఆమె నిజానికి ఒక గది అద్దెకు తీసుకుని ఉండాలనుకున్నారు. కానీ దానికి తగినంత డబ్బు లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో పార్టీ ఆఫీసులోనే ఉండాల్సి వచ్చింది. ఆమెకు, కాన్షీరాంకు మధ్య మంచి 'అనుబంధం' ఉండేది అని కాన్షీరాం జీవితచరిత్ర రాసిన బద్రీ నారాయణ్ చెప్పారు.
 
కాన్షీరాం కోపం
ఇద్దరిలో మొదట్నుంచీ చాలా స్నేహం ఉండేది. కానీ ఇద్దరి మధ్య గొడవలు కూడా వచ్చేవి. అజయ్ బోస్ తన పుస్తకంలో "కాన్షీరాంకు త్వరగా కోపం వచ్చేది. ఆయన నోరు కూడా మంచిది కాదు. కోపం వస్తే ఆయన చేయిచేసుకోడానికి కూడా వెనకాడేవారు కాదు. మాయావతి కూడా ఎవరికీ అణిగి ఉండేరకం కాదు. ఆమె కాన్షీరాం పట్ల 'పొసెసివ్‌'గా ఉండేది. ఎవరైనా వచ్చి ఆయన దగ్గర ఐదు నిమిషాలకంటే ఎక్కువ కూచుంటే ఏదో ఒక సాకుతో ఆమె ఆ గదిలోకి వచ్చేవారు" అని చెప్పారు.
 
మాయావతి-కాన్షీరాం మధ్య అప్పటి సంబంధాల గురించి నేహా దీక్షిత్ కూడా కార్వాన్ పత్రికలో రాశారు. "కాన్షీరాం హుమయూన్ రోడ్‌లో ఉన్న ఇంటికి వస్తే మాయావతికి అక్కడ ఉండడానికి గది ఇవ్వలేదు. అప్పుడు కాన్షీరాం భారత రాజకీయ దిగ్గజాలతో తన డ్రాయింగ్‌ రూంలో కూర్చుని చర్చలు జరిపేవారు. అప్పుడు మాయావతి ఇంటి వెనక పెరట్లో తిన్నెపై కూచుని గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలతో మాట్లాడుతుండేవారు" అని చెప్పారు.
 
కాన్షీరాంకు తన చేతుల్తో తినిపించిన మాయావతి
కానీ, కాన్షీరాం చివరి రోజుల్లో మాయావతి ఆయనకు చాలా సేవలు చేశారు. అజయ్ బోస్ వాటి గురించి రాశారు. "చివరి రోజుల్లో కాన్షీరాంకు పక్షవాతం వచ్చింది. దాంతో దాదాపు కదల్లేకుండా అయిపోయారు. ఆయన పూర్తిగా మూడేళ్లు మాయావతి ఇంట్లో ఉన్నారు. మాయావతి స్వయంగా ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు తినిపించడం చేసేవారు. అప్పట్లో కాన్షీరాం ఆమెకు ఏదీ ఇచ్చే స్థితిలో లేరు. మాయావతి ఆయన కోసం ఎన్ని చేసినా అభిమానంతోనే చేశారు" అని తెలిపారు.
 
మాయావతి మొదటిసారి 1985లో బిజ్నోర్ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆమె జగ్జీవన్ రాం కుమార్తె మీరా కుమార్ చేతిలో ఓడిపోయారు. కానీ, 1989లో ఆమె బిజ్నోర్ నుంచే గెలిచి మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అప్పట్లో మాయావతి మాటిమాటికీ లోక్‌సభ 'వెల్‌'లోకి వెళ్లేవారు.
 
ములాయంతో సంకీర్ణ ప్రభుత్వం
1993లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీని ఓడించడానికి దిల్లీలోని అశోకా హోటల్‌లో కాన్షీరాం, ములాయం సింగ్ యాదవ్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఎన్నికల్లో ఎస్పీకి 109, బీఎస్పీకి 67 స్థానాలు లభించాయి. ఇద్దరూ కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ అది పొత్తు ఎక్కువ రోజులు నడవలేదు. రెండు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి.
 
దాని గురించి చెప్పిన అజయ్ బోస్.. "కాన్షీరాం ఎప్పుడు లక్నో వచ్చినా, ఆయన ములాయం సింగ్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లేవారు కాదు. ములాయమే ఆయన్ను కలవడానికి ప్రభుత్వ గెస్ట్ హౌస్ రావాల్సి వచ్చేది. అక్కడ కూడా కాన్షీరాం ఆయన్ను అరగంట వెయిట్ చేయించేవారు. చివరికి తన గది నుంచి బయటకు వచ్చినపుడు బనియన్, లుంగీలో ఉండేవారు. ములాయం ముఖ్యమంత్రిగా అధికారిక దుస్తుల్లో ఉండేవారు. ఆయన ములాంయను అవమానించడానికి ఏ అవకాశాన్నీ వదిలేవారు కాదు. అందుకే ఆ పొత్తు ఎక్కువ రోజులు నడవలేదు" అన్నారు.
 
గెస్ట్ హౌస్ ఘటనలో మాయావతికి అవమానం
మాయావతి ములాయం సింగ్ యాదవ్‌తో పొత్తు తెంచుకుని బీజేపీ అండతో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ దానికి ఒక రోజు ముందు 1995 జూన్ 2న మాయావతి తన జీవితంలోనే అత్యంత ఘోరమైన అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
సాయంత్రం 4 గంటలకు స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆమె సూట్‌పై సుమారు 200 మంది ములాయం మద్దతుదారులు దాడి చేశారు. గెస్ట్ హౌస్ ప్రధాన ద్వారం విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. మాయావతి మద్దతుదారులను తీవ్రంగా కొట్టారు. మాయావతిని అనరాని మాటలు అన్నారు. మాయావతి తన గదిలో రాత్రి 1 గంట వరకూ అలాగే ఉండిపోయారు. వాళ్లు ఆ గదికి కరెంటు, నీళ్లు కూడా కట్ చేసేశారు. మాయావతి ఆ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోయారు.
 
మద్దతు వెనక్కు తీసుకున్న బీజేపీ
ముఖ్యమంత్రి అయ్యాక, మాయావతి నగరాలు, జిల్లాలు, యూనివర్సిటీల పేర్లు మార్చడం మొదలుపెట్టారు. ఆగ్రా విశ్వవిద్యాలయం పేరును భీంరావ్ అంబేడ్కర్, కాన్పూర్ యూనివర్సిటీ పేరును ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయంగా మార్చారు. లక్నోలో అంబేడ్కర్ పార్క్, పరివర్తన్ పార్క్ ఏర్పాటు చేసి అందులో దళిత మహా నేతల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. దాంతో తమ అజెండా నడవదని బీజేపీకి త్వరగానే అర్థమైంది. అందుకే కొన్ని నెలలకే వారు తమ మద్దతు వెనక్కు తీసుకున్నారు.
 
రాజా భయ్యాను జైలుకు పంపారు
కొన్నేళ్ల తర్వాత ఆమె మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. కానీ ఇది కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. కానీ ఆమె ఈలోపు మంచి పాలన అందించారనే ఘనత సంపాదించారు. ప్రతాప్‌గఢ్‌ ప్రముఖ నేత, రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యాను జాతీయ భద్రతా చట్టం ప్రకారం మాయావతి జైల్లో పెట్టించారు. రాజా భయ్యా ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో గత 20 ఏళ్ల నుంచీ తన ఉనికిని చాటేవారు. ఆయనకు ములాయం, రాజ్‌నాథ్ సింగ్ లాంటి నేతల అండ ఉండేది. మాయావతి వల్ల రాజా భయ్యా పూర్తిగా ఒక ఏడాది జైల్లో ఉన్నారు. ములాయం మళ్లీ ఆధికారంలోకి వచ్చాక విడుదలయ్యారు.
 
అధికారుల బదిలీలు
మాయావతి దగ్గర పనిచేసిన ఒక అధికారి 2008లో ఒక ఘటన చెప్పారు. మాయావతి హఠాత్తుగా హెలికాప్టర్‌లో మధుర వెళ్లి, అక్కడ రెండు నెలలు క్రితం నిర్మించిన ఒక కాలువను ప్రారంభించాలని అనుకున్నారు. అయితే అది మాయావతి సర్‌ప్రైజ్ విజిట్. కానీ కలెక్టర్‌కు ఆ విషయం ముందే తెలిసింది. ఆయన వెంటనే కాలువకు మళ్లీ మరమ్మతులు చేయించారు. అది తెలుసుకున్న మాయావతి హెలికాప్టర్ ఎక్కే ముందు మాయావతి కలెక్టరుతో 'నీ పని ఫినిష్' అన్నారు. అదే రోజు సాయంత్రం ఆ కలెక్టరును బదిలీ చేశారు.
 
2007లో సత్తా చూపిన మాయావతి
2007లో మాయావతి ఏ పొత్తూ లేకుండా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి మెజార్టీ అందించారు. అదే ఏడాది న్యూస్‌వీక్ 'ప్రపంచ 100 విమెన్ అచీవర్స్‌'లో ఆమెకు స్థానం లభించింది. దాని కవర్ పేజీపై మాయావతి ఫొటో కూడా వచ్చింది. కానీ ఆమె సాధించిన ఆ ఘనతను చూడడానికి కాన్షీరాం అప్పటికే లేరు. కానీ కాన్షీరాం మరణం తర్వాత ఆమెకు రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పిన చాలా మంది రాజకీయ పండితుల అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి.
 
వరుస అవినీతి ఆరోపణలు
కానీ మంచి పాలన అందించిన మాయావతి స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. తాజ్ కారిడార్ కేసు నుంచి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులను తారుమారు చేశారనే కేసు వరకూ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. 2012లో రాజ్యసభకు నామినేషన్ వేసినపుడు ఆమె 112 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చారు. దిల్లీలోని ప్రముఖ సర్దార్ పటేల్ మార్గ్‌లో కోట్ల రూపాయలు చెల్లించి విల్లాలు కొన్నారు. తన పూర్వీకుల గ్రామం బాదల్‌పూర్‌లో అత్యంత విలాసంగా ఉండే ఒక పెద్ద భవనం నిర్మించారు. 2012 అఫిడవిట్‌లో కూడా ఆమె తన దగ్గర దాదాపు కోటి రూపాయల ఆభరణాలు ఉన్నట్టు అంగీకరించారు. మాయావతికి దగ్గరి బంధువులు కూడా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఎదుర్కున్నారు.
 
వీటన్నిటికీ సమాధానంగా ఈ డబ్బు, నగలు తనకు బహుమతుల రూపంలో వచ్చాయని మాయావతి చెప్పుకొన్నారు. ఆమె సహచరులు కొందరు మాత్రం మాయావతి డబ్బులు తీసుకుని పార్టీ టికెట్ ఇస్తారని ఆరోపించారు. మాయావతి పార్కుల్లో తన విగ్రహాలు, కాన్షీరాం విగ్రహాలు పెట్టించడానికి ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులను ఆమె నుంచి వసూలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది.
 
వరుస ఓటమిలు
కానీ మాయావతిపై ఈ విశ్వాసం ఎక్కవ రోజులు ఉండలేదు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మొదట ఎస్పీ ఆమెను ఓడించింది. 2014లో మోదీ పవనాలు వీయడంతో మాయావతి ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బౌన్స్ బ్యాక్ కావాలన్న ఆమె ఆశలు నీరుగారిపోయాయి. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటివరకూ అతిపెద్ద బద్ధ శత్రువు అయిన సమాజ్ వాదీ పార్టీతోనే పొత్తు కుదుర్చుకుంది. కాగితాలపై, ఎన్నికల లెక్కల ప్రకారం ఈ కూటమి చాలా బలంగా కనిపిస్తున్నా, పాత లెక్కల ప్రకారం చూస్తే యూపీలో దాదాపు ప్రతి స్థానంలో బీజేపీపై గెలవాలంటే ఈ కూటమి చెమటోడ్చాల్సి ఉంటుంది.
 
బీఎస్పీ పొత్తుల గత చరిత్ర కూడా అంత ఘనంగా లేదు. 1996లో మాయావతి పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అప్పుడు బీఎస్పీ 315 స్థానాల్లో కాంగ్రెస్ 110 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఫలితాలు వచ్చినపుడు ఈ కూటమి 100 స్థానాలు కూడా దాటలేకపోయింది. ఒకసారి కాన్షీరాం ఒక మాట చెప్పారు. "ఈ పార్టీతో మనం ఎప్పుడూ పొత్తు పెట్టుకోకూడదు. మన ఓట్లు వేరే పార్టీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి, కానీ వేరే పార్టీల ఓట్లు మనకు ఎప్పటికీ పడవు అన్నారు". అది తప్పని నిరూపించడానికి మాయావతి చాలా ప్రయత్నించారు.
 
మాయావతి ప్రధాన మంత్రి వాదనలో ఎంత బలముంది
ఏదో ఒక రోజు భారత ప్రధాని కావాలనేది మాయావతి మనసులోని బలమైన కోరిక. ఆమెతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ కూడా మాయావతి తన లక్ష్యం చేరుకోడానికి అడ్డు పడం అన్నారు. కానీ యూపీలో కేవలం 38 స్థానాల్లో పోటీ చేసి ఎవరైనా భారత ప్రధాని కావాలని కలగనరా? అనేదే ఇప్పుడు ప్రశ్న. కానీ మాయావతి ఎప్పడూ కష్టాలను తెగించి ఎదుర్కున్నారు. సవాళ్ల నోటి నుంచి విజయాలను లాక్కున్నారు. తన తండ్రిపై తిరుగుబాటు చేసి సొంత ఇంటి నుంచే బయటకు వచ్చారు.
 
ఆమె ఉన్న పార్టీలోనే కొందరు కాన్షీరాం ఎప్పుడు చనిపోతారా, మాయావతిని ఎప్పుడు తరిమికొడదామా అని ఎదురు చూశారు. కానీ ఆమె వారినే పార్టీ నుంచి బయటకు పంపారు. ములాయం సింగ్ యాదవ్ ఆమెను భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ ఏం చేయలేకపోయారు. రాజకీయ పండితులు 2007లో హంగ్ వస్తుందని అంచనా వేశారు. కానీ అది కూడా తప్పుగా నిరూపితమైంది. వరసగా మూడు ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రధాని కావాలనే కోరిక మాత్రం మాయావతిలో బలంగా ఉంది. కానీ అంతమాత్రాన మాయావతి రాజకీయ కెరియర్ మెరుగ్గా ఉందని మనం అనుకోవచ్చా?
 
ఒక రాజకీయ నాయకుడు ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయి ఉండచ్చు. అంతమాత్రాన ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని చెప్పడం చాలా ప్రమాదకరం. అలాంటి వారిలో చాలా మంది నేతలు, రాజకీయ పండితులు, ప్రజల అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని స్థాయికి చేరడంలో సఫలం అయ్యారు.
రేహాన్ ఫజల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments