Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వరూపానందేంద్ర సరస్వతి ఎవరు? శారదాపీఠానికి భూముల కేటాయింపును ఏపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది?

బిబిసి
సోమవారం, 28 అక్టోబరు 2024 (13:49 IST)
విశాఖపట్నంలోని శ్రీశారదాపీఠానికి భీమిలి మండలంలో ఇచ్చిన 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24: తిరుమల కొండపై శారదాపీఠం నిర్మిస్తున్న కట్టడాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.
అక్టోబర్ 25: శారదాపీఠంలో కూడా గెడ్డ స్థలం ఆక్రమణ జరిగిందనే ఫిర్యాదులపై పెందుర్తి తహశీల్దార్ విచారణ చేపట్టారు.
విశాఖ నగరంలోని చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదాపీఠం మళ్లీ ప్రధాన శీర్షికల్లో కనిపిస్తోంది.
 
2018లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ వెలుగు వెలిగిన శ్రీశారదా పీఠం ప్రస్తుతం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో శారదాపీఠానికి భూములు కేటాయించగా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది.
 
తాజా వివాదమేంటి?
2021లో శారదాపీఠానికి విశాఖ జిల్లా భీమిలి మండలంలో సంస్కృత పాఠశాల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం భూములను కేటాయించింది. చినముషిడివాడలోని శారదాపీఠంలో సంస్కృత పాఠశాల నిర్వహించేంత స్థలం అందుబాటులో లేనందున, పాఠశాల కోసం తమకు భూమి కావాలంటూ 2021లో శారదాపీఠం ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఏపీఎల్‌ఎమ్‌ఏ)కి దరఖాస్తు చేసుకుంది. దానికి మంత్రి వర్గం ఆమోదం లభించడంతో శారదాపీఠానికి భూ కేటాయిస్తూ 2021 నవంబరు 29న అప్పటి రెవెన్యూ శాఖ కార్యదర్శి జీఓ 343 జారీ చేశారు.
 
భీమిలి మండలం కొత్తవలసలో సర్వే నెంబర్ 102/2లో 7.7 ఎకరాలు, 103.2లో 7.3 ఎకరాల చొప్పన మొత్తం 15 ఎకరాల భూమి ఇచ్చారు. ధర ఎకరానికి లక్ష రూపాయలుగా నిర్ణయించారు. భూమిని ఇంత తక్కువ ధరకు ఇవ్వడమేంటంటూ అప్పట్లో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత శారదాపీఠం ఆ భూమిని కమర్షియల్ అవసరాలకు వాడుకునేలా అనుమతులు ఇవ్వాలంటూ కోరింది. దానికి అనుగుణంగా కూడా అప్పుడు జీవోలు విడుదలయ్యాయి. అయితే, తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం శారదాపీఠానికి భూమి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
తిరుమలలో ఏం జరిగింది?
తిరుమలలో కూడా విశాఖ శారదాపీఠం భవనాల నిర్మాణానికి అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో 5,000 చదరపు అడుగుల స్థలాన్ని శారదాపీఠం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, భోజన సేవలందించేందుకు 2005 ఫిబ్రవరిలో 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది. ఆ తర్వాత ఆ స్థలంలో ఐదు అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు 2007లో శారదాపీఠం అనుమతి పొందినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పుడు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఈ నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి.
 
అయితే, శారదాపీఠం నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతోందంటూ, వీటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఈ ఏడాది అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.
 
‘పాతదే, కొత్తదేమీ కాదు’: స్వాత్మనందేంద్ర సరస్వతి
చినముషిడివాడలోని శారదాపీఠంలో ఆక్రమించిన గెడ్డ స్థలం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించి ఆక్రమణ ఎంత జరిగిందో, వాస్తవంగా పీఠానికి ఉన్న భూమి ఎంతో తెలుసుకుంటామని పెందుర్తి తహశీల్దార్ ఆనంద్ కుమార్ చెప్పారు. అక్టోబర్ 25న కొందరు రెవెన్యూ అధికారులు తమ పీఠానికి వచ్చినట్లు ఆ పీఠం ప్రతినిధులు బీబీసీకి తెలిపారు. ఇదేమీ కొత్తది కాదని, గత 25 ఏళ్లుగా దీనిపై వివాదం నడుస్తోందని, ఈ విషయంపై పీఠానికి రెవెన్యూ సిబ్బంది వస్తుంటారని ప్రస్తుతం శారదాపీఠానికి ఉత్తరాధికారిగా ఉన్న స్వాత్మనందేంద్ర సరస్వతి అలియాస్ కిరణ్ కుమార్ శర్మ బీబీసీతో చెప్పారు.
 
అలాగే, ప్రస్తుతం భీమిలి కొత్తవలసలో శారదాపీఠానికి భూముల కేటాయింపులను, తిరుమలలో నిర్మాణాల అనుమతులను రద్దు చేయడం వంటివి తమ దృష్టికి వచ్చాయని, దీనిపై ఏం చేయాలో ఆలోచన చేస్తున్నామని ఆయన బీబీసీతో చెప్పారు. “నవంబర్ 8వ తేదీ వరకు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం స్వరూపానందేంద్ర సరస్వతి, నేను దేశవ్యాప్త పర్యటనల్లో ఉన్నాం. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తాం” అని శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి బీబీసీతో చెప్పారు. శారదాపీఠం వ్యవస్థాపక పీఠాధిపతి అయిన స్వరూపానందేంద్ర సరస్వతి, 2019 జూన్‌లో పీఠాధిపతి బాధ్యతల నుంచి తప్పుకుని ఆయన శిష్యుల్లో ఒకరైన స్వాత్మనందేంద్ర సరస్వతికి అప్పగించారు. ఇప్పుడు పీఠానికి ఉత్తరాధికారిగా స్వాత్మనందేంద్ర సరస్వతే వ్యవహారిస్తున్నారు.
 
సెలబ్రిటీ ఆశ్రమం: స్థానికులు
“1995లో ఎర్ర చొక్కా వేసుకుని ఒకాయన ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వాళ్లని ఆశ్వీరదిస్తూ కనిపించేవారు. ఆ సమయంలో ఎర్రచొక్కా వ్యక్తిని ఆశ్చర్యంగా చూసేవాళ్లం. ఆ ఎర్రచొక్కా వ్యక్తే ప్రస్తుతం శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి. ప్రస్తుతం పీఠానికి ఉత్తరాధికారిగా ఉన్న స్వాత్మనందేంద్ర సరస్వతి పీఠంలో ఆటలాడుకుంటూ కనిపించేవారు. ఇప్పుడు పెద్దపెద్ద నాయకులతో చూస్తుంటే వింతగా అనిపిస్తోంది” అని శారదాపీఠం సమీపంలోనే నివాసం ఉంటున్న శంకరరావు బీబీసీతో చెప్పారు. “శారదాపీఠం వచ్చిన తర్వాత సీఎంలు, మంత్రుల రాకపోకలతో మా ప్రాంతం చాలా డెవలప్ అయ్యింది. ఆశ్రమానికి ‘సెలబ్రిటీ’ స్థాయి వచ్చిన తర్వాత అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేయడం, వాటి వద్ద పోలీసుల పహారా పెరిగిపోవడంతో మేం అటు వైపుగా వెళ్లడమే మానేశాం” అని చినముషిడివాడకు చెందిన 60 ఏళ్ల విజయలక్ష్మీ అన్నారు.
 
‘పొలిటికల్ సెంటర్ శారదాపీఠం’
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో 2019 జూన్‌లో విశాఖ వచ్చి శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. అప్పుడు జగన్‌ను స్వరూపానందేంద్ర ఆలింగనం చేసుకున్నారు. శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారికి జగన్‌తో ప్రత్యేక పూజలు చేయించారు. 2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్‌ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులు పొందారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ శారదాపీఠాన్ని సందర్శించారు. 2023లో నవంబర్ 1న కేసీఆర్ తన ఎర్రవల్లి ఫౌంహౌస్‌లో స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మనందేంద్రలతో రాజశ్యామల యాగం చేయించుకున్నారు.
 
అనేక మంది రాజకీయ, సినీ, వ్యాపార, మీడియా ప్రముఖులతో పాటు ఐపీఎస్, ఐఏఎస్‌లు కూడా ఇక్కడికి రావడం స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందడం గత పదేళ్లలో నిత్యం కనిపించే దృశ్యం. మీడియా ప్రతినిధుల హడావిడి శారదాపీఠం వద్ద ఎప్పుడూ ఉండేదే. పొలిటికల్ పదవుల కేటాయింపు, నామినేటెడ్ పోస్టులకు వ్యక్తుల ఎంపిక, ఎలక్షన్లలో టికెట్ల పంపిణీ సమయాల్లో ప్రముఖ నేతల రాకపోకలతో శారదాపీఠం హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయింది. జర్నలిస్టుగా నా రిపోర్టింగ్ కెరియర్లో అనేక మార్లు అలాంటి సందర్భాలను చూశాను.
 
ఎవరీ స్వరూపానందేంద్ర సరస్వతి?
స్వరూపానందేంద్ర సరస్వతి ఎవరు? ఒక పీఠాధిపతిగా ఎలా మారారు? ఇటువంటి ప్రశ్నలకు వివిధ సందర్భాల్లో స్వరూపానందేంద్ర సరస్వతే స్వయంగా చెప్పిన వివరాల ప్రకారం.. స్వరూపానందేంద్ర సరస్వతి 1964లో శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు పొంగరు నరసింహామూర్తి శర్మ. ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యులు. చిన్నాన్నలకు విశాఖలో స్పోర్ట్స్ వ్యాపారం ఉంది. దాంతో నరసింహామూర్తి శర్మ కూడా విశాఖలో స్పోర్ట్స్ దుకాణం తెరిచారు. నాలుగేళ్లకే నష్టాలు రావడంతో దానిని మూసివేశారు.
 
తండ్రికి దైవచింతన ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజూ ఇంట్లో దేవుని పురాణాలు, దైవ చింతన కలిగించే కథలు చెప్తుండేవారు. దానితో పాటు ఇంటికి తరుచూ సాధువులు భోజనాల కోసం రావడంతో వారి జీవనశైలిపై ఆకర్షణ కలిగింది. అప్పటికే విశాఖలో వ్యాపారం మూసివేశారు. ఇంటర్ పూర్తైనా, తర్వాత చదువుపై ఆసక్తి కలగలేదు. దాంతో 19 ఏళ్ల వయసులో హరిద్వార్ వెళ్లారు. అక్కడ సంస్కృతం, వేదాంతం, తర్కం 9 ఏళ్లు నేర్చుకున్నారు.
 
హిమాలయాలకు వెళ్లినప్పుడు ఓ సాధువు సూచన మేరకు కర్ణాటకలోని ముత్తూరు వెళ్లి అక్కడ సచ్చీదానేంద్ర సరస్వతి స్వామిని కలిసి, ఆయననే గురువుగా స్వీకరించి సన్యాసం తీసుకున్నారు. అక్కడి నుంచి విశాఖ వచ్చి చినముషిడివాడలో ఒక పాక వేసుకుని, ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. “1995 సమయంలో ద్రోణంరాజు సత్యనారాయణ, టి. సుబ్బిరామిరెడ్డి నా ఆశ్రమానికి అనేక మంది ప్రముఖులను పంపించేవారు. వారి వలనే శారదాపీఠం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను ఆధ్యాత్మిక కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తిని. 1997లో విశాఖ శ్రీ శారదాపీఠం పేరుతో చినముషిడివాడలో పీఠాన్ని ప్రారంభించాను” అని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.
 
అప్పటి పండే.. ఇప్పుడు స్వరూపానంద..
“ఆయన్ని అప్పట్లో పండు అని పిలిచేవారు. 1980ల ప్రారంభంలో విశాఖలో స్పోర్ట్స్ దుకాణం నడిపేవారు. టెన్నిస్ బ్యాట్లకు నెట్లు అల్లడంలో ఆ దుకాణం పేరు పొందింది. ఇదే సమయంలో విశాఖలోని సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు అభిమాన సంఘాల నాయకుడిగా ఉండేవారు. అక్కినేని సినిమాలు విడుదలైనప్పుడు సినిమా టిక్కెట్లను అభిమానులకు పంచుతూ ఉండేవారు. ఆ పండే.. నేటి స్వరూపానందేంద్ర సరస్వతి” అని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు. 
 
“ఆయన ఖరీదైన స్వామిగా పేరు పొందారు. ఆయన పాదాలకు నమస్కరించాలన్నా ఒక ధర ఉంటుందనే వివాదాలున్నాయి” అని లీడర్ పత్రిక అధినేత, సీనియర్ జర్నలిస్ట్ వి. రమణమూర్తి బీబీసీతో చెప్పారు. “ఇప్పుడు కేసీఆర్, జగన్‌ ఇద్దరూ అధికారంలో లేరు. కేసీఆర్, జగన్‌ సీఎంలుగా ఉన్నప్పుడు స్వరూపానందేంద్రకు లభించిన గౌరవం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాల్లో లభించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడితో శారదాపీఠం ఇబ్బందులు ఎదుర్కొంటోంది” అని ఎం. యుగంధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 25, 26 తేదీలలో బీబీసీ శ్రీశారదాపీఠానికి వెళ్లింది. అప్పుడు అక్కడ గతంలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌ పోస్టు కనిపించలేదు. అలాగే పోలీసులు ఎవరూ లేరు. ఆశ్రమం వద్ద హడావిడి కూడా లేదు.
 
శుభాకాంక్షలు చెప్పిన స్వరూపానందేంద్ర..
ఏపీలో కొన్ని నెలల కిందట ప్రభుత్వం మారినప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. “త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దిక్కు చంద్రబాబు” అని స్వరూపానందేంద్ర చెప్పారు.
 
అందుకే భూముల కేటాయింపును రద్దు చేశాం: అనగాని సత్యప్రసాద్
శారదా పీఠానికి భూ కేటాయింపుల్లో చాలా అవకతవకలు జరిగాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. “సంస్కృత కళాశాల ఏర్పాటు పేరుతో భూములు తీసుకుని వాటిని శారదాపీఠానికి మళ్లించేందుకు చాలా అక్రమాలు చేశారు. అనేక నిబంధనలను ఉల్లంఘించారు. అవన్నీ గుర్తించాం. అందుకే శారదాపీఠానికి భూమి కేటాయింపును రద్దు చేశాం. ఈ కేటాయింపులకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం” అని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
 
“స్వరూపానందేంద్ర స్వామి అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేయాలి” అని జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. “పీఠాలను కమర్షియల్‌గా మార్చేసిన ఘనత స్వరూపానందేంద్ర సరస్వతికే చెందుతుంది” అని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి బీబీసీతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మురారి ఫీలింగ్ వచ్చింది : అశోక్ గల్లా

పెళ్లి చూపులు టైంలో ఈ స్థాయికి వస్తామనుకోలేదు : విజయ్ దేవరకొండ

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments