Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (22:06 IST)
చంద్రుడిపై అన్వేషణకు భారత్ పంపిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక కీలక మైలురాయిని చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ అంతరిక్ష నౌక నుంచి విడిపోయి చంద్రుని కక్ష్యలో తిరగడం ప్రారంభించింది. అది అలా తిరుగుతూ, క్రమంగా దగ్గరకు వెళ్లి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇస్రో ప్రణాళిక ప్రకారం విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడి ఉపరితలాన్ని తాకనుంది.. చంద్రుడిని అధ్యయనం చేయడంలో చంద్రయాన్-3 ఒక కీలకమైన ప్రాజెక్ట్. అయితే, ఇప్పటి చంద్రుడి గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అలాంటి కొన్నిటికి సమాధానాలు చెప్పే ప్రయత్నమే ఈ కథనం
 
చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు
ఇది చాలామందిలో ఉండే సందేహం. అయితే, దీనికి స్పష్టమైన సమాధానం లేదు. చంద్రుడు ఎలా ఆవిర్భవించాడన్న అంశంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ ఎక్కువమంది ఆమోదించిన సిద్ధాంతం ఒకటుంది. సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట కుజుడి పరిమాణంలో ఉండే వస్తువు ఒకటి భూమిని బలంగా ఢీకొట్టింది. దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం ఏర్పడి, అందులోని శిలలు, ఆవిరి, ఇతర పదార్ధాలన్నీ ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతారు.
 
చంద్రుడు లేకపోతే భూమి ఏమవుతుంది?
చంద్రుని ఆకర్షణ శక్తి భూమి దాని అక్షం మీద ఉండేందుకు కారణమవుతోంది. ఒకవేళ చంద్రుడు లేకపోయినట్లయితే, భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి భూమి కదిలికలలో తేడా ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో రుతువులలో అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా వైవిధ్యం ఉంటుంది. రోజు నిడివి కూడా మారవచ్చు. చంద్రుడు లేకపోతే భూవాతావరణం, గ్లోబల్ వార్మింగ్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
 
భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత ?
ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 3,84,400 కి.మీ దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 2,70,000 కి.మీ దూరంలో ఉన్నట్లు ఇటీవలి అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంటే చంద్రుడు ఇప్పుడున్న దూరం కంటే 70% మేర చేరువగా ఉండేవాడని ఈ అధ్యయనం చెబుతోంది. అప్పట్లో భూమి వేగంగా తిరుగుతున్నందున రోజు నిడివి కూడా తక్కువగా ఉండేది.
 
చంద్రుని లోపల ఏముంది?
చంద్రుడి లోపలి భాగం రాళ్లు, ఖనిజాలతో నిండి ఉంటుందని చెన్నైలోని బిర్లా ప్లానిటోరియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.కె. లెనిన్ తమిళ్‌కోవన్ చెప్పారు. “చంద్రుడి లోపలి భాగం ప్రధానంగా సిలికేట్‌లతో కూడి ఉంటుంది. ఉపరితలంపై వాతావరణం లేదు. పై భాగంలో పెద్ద గుంతలు (క్రేటర్స్), పర్వతాలు, లోయలు, మారియా అని పిలిచే పెద్ద, చదునైన సముద్రాలు ఉన్నాయి. అయితే వాటిలో నీరు ఉండదు" అని ఆయన పేర్కొన్నారు.
 
చంద్రుడు ప్రకాశవంతంగా ఎలా కనిపిస్తాడు?
పౌర్ణమి రోజులలో చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. అయితే అది చంద్రుడి కాంతి కాదు. సూర్యకాంతి. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. వెలుతురును సృష్టించలేడు. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రతిబింబిస్తుంది.
 
చంద్రుని రంగు ఏంటి?
చంద్రుడు భూమి నుండి చూస్తే కాంతివంతంగా కనిపిస్తాడు. అలా చూసినప్పుడు చంద్రుడు తెల్లగా ఉన్నాడని అనిపిస్తుంది. వాస్తవానికి చంద్రుడు తెలుపు రంగులో ఉండడు. చంద్రుడిని దగ్గరగా చూసినప్పుడు, అది ముదురు బూడిద రంగులో ఉంటుంది.
 
చంద్రునిపై ఇప్పటి వరకు ఏమేం కనుగొన్నారు?
చంద్రుడి కోసం పని చేసే అనేక మిషన్లు చంద్రుడి భౌగోళిక స్వరూపం, ఉపరితల నిర్మాణం, దానికి పుట్టుక, చరిత్ర గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి. ‘‘చంద్రయాన్-1 ప్రోబ్ చంద్రుడి మీద నీరు ఉన్నట్లు నిర్ధరించింది. నాసా పంపిన అపోలో మిషన్లు భూమికి తీసుకువచ్చిన శాంపిల్స్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి’’ అని తమిళ్‌కోవన్ అన్నారు. గతేడాది శాస్త్రవేత్తలు చంద్రుడి నుంచి తీసిన మట్టిలో మొక్కలను పెంచే ప్రయత్నం చేశారు.
 
చంద్రుని మీదకు వెళ్తే ఎందుకు బరువు తగ్గుతాం?
‘‘భూమి మీదకన్నా చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ’’ అని తమిళ్‌కోవన్ వివరించారు. ‘‘ఒక వ్యక్తి బరువు భూమి మీద 80 కిలోలు అయితే, అదే చంద్రునిపై బరువు 13.3 కిలోలు మాత్రమే ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికన్నా భూమి శక్తి ఆరు రెట్లు ఎక్కువ. అందుకే చంద్రుడిపై బరువు తగ్గుతాం” అని ఆయన వివరించాడు.
 
చంద్రునిపై మనుషులు ఎన్నిసార్లు దిగారు?
1969, 1972 మధ్య అమెరికా పంపిన అపోలో మిషన్ల ద్వారా మొత్తం ఆరుసార్లు చంద్రునిపై మనుషులు దిగారు. అపోలో 17 మిషన్ ద్వారా మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్‌లో చంద్రునిపైకి వెళ్లారు. ఆర్థిక పరిమితులు, చంద్రుడి మీదకు మనుషులను పంపడం వల్ల ఏం ప్రయోజనం అనే రాజకీయ విమర్శల కారణంగా చంద్రుడి మీదికి ప్రయాణాలను నిలిపేశారు.
 
చంద్రుడిపై కనిపించే ఆకారాలు ఏమిటి?
చంద్రుడిని తీక్షణంగా గమనించినప్పుడు అక్కడ మనిషి, జంతువుల మాదిరిగా కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. అసలు ఏమై ఉంటాయన్నది చాలామంది సందేహం. బసాల్ట్ శిలల రూపంలో చంద్రుడిపై పురాతనమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు కాంతిని తక్కువ స్థాయిలో ప్రతిబింబిస్తాయి. అందువల్ల అలాంటి ప్రదేశాలున్న ప్రాంతం నీడలాగా, వివిధ ఆకారాలుగా కనిపిస్తుందని నాసా చెబుతోంది.
 
చంద్రునిపై మనుషులు నివసించొచ్చా?
దీనిపై తమిళ గోవన్ మాట్లాడారు. "చంద్రునిపై మనుషులు నివసించడానికి వీలవుతుందా లేదా అన్న అంశంపై ఇంకా అన్వేషణ, పరిశోధన సాగుతూనే ఉంది. శ్వాసించడానిక వీలుగా భూమి మీద ఉన్న వాతావరణం లేకపోవడం, అక్కడి పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలో తేడాలు (పగలు అధిక వేడి, రాత్రి అధిక చలి) వంటి వాటివల్ల అక్కడ మానవ నివాసానికి పరిస్థితులు అనువుగా లేవని అన్నారు. ‘‘మనకు అక్కడ తక్షణమే నీరు లభించే అవకాశం లేకపోవడం పెద్ద సమస్య. అందువల్ల, స్వల్పకాలంలో అక్కడ నివాసంతోపాటు, శాస్త్రీయ పరిశోధనల కోసం స్థావరాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు’’ అని తమిళ్ కోవన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments