Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్ర చేస్తే పెళ్లవుతుందా, ఈ యువరైతుల లక్ష్యమేంటి?

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (18:44 IST)
మీకు పెళ్లి కావడం లేదంటే మీరేం చేస్తారు? ఒకవేళ మీరు ఈ ప్రశ్నను ఈ యువతను అడిగితే, వారేం చెబుతున్నారో తెలుసా.. మేము పాదయాత్ర చేస్తాం అంటున్నారు. పాదయాత్ర చేయడమెందుకు అని అడిగితే, వారేం సమాధానం చెప్పారో ఈ కథనంలో చదవండి. ‘‘ప్రేమించే సమయంలో మేము వర్క్ చేయడం ప్రారంభించాం. కావాల్సినంత మనీ సంపాదించాం. ఈ రోజు నా దగ్గర అన్ని ఉన్నాయి. కానీ, పెళ్లి చేసుకోవడానికి మాత్రం అమ్మాయి దొరకడం లేదు’’ అని 33 ఏళ్ల డీపీ మలేషా ఎంతో బాధతో చెప్పారు. అసలేంటన్నది ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. మలేషా కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన వ్యవసాయదారుడు. ఆయన మాత్రమే కాదు, ఇలా పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న అబ్బాయిలు చాలా మందే ఉన్నారు ఆ జిల్లాలో.
 
30 నుంచి ముప్పై ఏళ్లు పైబడిన 60 మంది వ్యక్తులు ఈ గ్రూప్‌లో ఉన్నారు. వీరందరూ కలిసి మూడు రోజుల పాటు 120 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కేఎం దోఢీ నుంచి ప్రారంభమై, చామరాజనగరలోని మహదేశ్వర ఆలయం వద్ద ముగిసింది. ‘బ్రహ్మచారుల పాదయాత్ర’ పేరుతో దీన్ని చేపట్టారు. ఈ యాత్ర ఉద్దేశ్యం తమకు అమ్మాయిని ప్రసాదించమని దేవుణ్ని కోరడంతో పాటు, ఇదే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్న అబ్బాయిల పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకురావడం. పాదయాత్రలో పాల్గొన్న వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. రైతు కుటుంబాలకు చెందిన అబ్బాయిలను అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ప్రశ్నిస్తే, ప్రతి ఒక్కరి దగ్గర భిన్నమైన సమాధానాలున్నాయి.
 
‘‘పరిస్థితి ఎలా ఉందో కనీసం మీరు ఊహించలేరు. మా రైతు కుటుంబాలకు చెందిన వారు కూడా రైతులకు పిల్లను ఇచ్చేందుకు వెనుకాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మీరు’’ అని మాండ్యా జిల్లా మలవ్లి తాలుకాకు చెందిన నివాసి శ్యామ్‌ప్రీత్ కుమార్ తెలిపారు. వీరికి పెళ్లి కాకపోవడానికి కేవలం వ్యవసాయం మాత్రమే కారణం కాదు. నగరాలకు, గ్రామాలకు మధ్య పెరుగుతున్న అంతరం కూడా మరో కారణమే. ‘‘రైతు కుటుంబంలోని యువతకు డబ్బులు సంపాదించేందుకు ఎలాంటి మార్గం ఉండదని గ్రామాల్లోని, పట్టణాల్లోని ప్రజల మనసుల్లో నాటుకుపోయింది’’ అని మలవ్లి తాలుకాకు చెందిన 31 ఏళ్ల కృష్ణ చెప్పారు.
 
‘‘ప్రతి అమ్మాయి కుటుంబం వారి అల్లుడు నగరంలో పని చేయాలని కోరుకుంటోంది. ముఖ్యంగా బెంగళూరులో ఉండాలనుకుంటున్నారు. ఈ నగరంలో జీతం రెగ్యులర్‌గా వస్తుందని భావిస్తున్నారు. రైతు కుటుంబాలకు చెందిన వారి కంటే ఉద్యోగం చేసే అబ్బాయి అయితే వారి అమ్మాయి సుఖపడుతుందని భావిస్తున్నారు. రైతు కుటుంబాలు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మలేషా చెప్పారు. గత 4 ఏళ్లుగా పెళ్లి సంబంధం కోసం 25 నుంచి 30 మంది అమ్మాయిలతో మాట్లాడామని, కానీ ఒక్క సంబంధం కూడా కుదరలేదని చెప్పారు. ఎందుకంటే తాను నగరంలో పనిచేయడం లేదని, వారు కోరుకున్న మాదిరి తనకు రెగ్యులర్‌గా ఆదాయం రాదని అన్నారు.
 
కేఎం దోఢీలో పాదయాత్రలో బీబీసీతో మాట్లాడిన మలేషా, తన ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, తమ కుటుంబంలోకి వచ్చే అమ్మాయిలు పశువులను చూసుకోనవసరం లేదని, ఎక్కువ మందికి పనులు చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. గత కొన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. రెగ్యులర్ జీతం సంపాదించే వారికంటే తామేమీ తక్కువ సంపాదించడం లేదని శ్యామ్‌ప్రీత్ అన్నారు. ‘‘మా ఇళ్లు కూడా నగరంలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మేము మట్టి ఇళ్లలో ఉండటం లేదు. కార్లు, బైకులు మాకు కూడా ఉన్నాయి. నగరంలో ఉండేవాళ్లు ఎలా పని చేసుకుని బతుకుతున్నారో మేం కూడా అలానే బతుకుతున్నాం’’ అని శ్యామ్‌ప్రీత్ చెప్పారు.
 
నగరంలో పనిచేసే వారికంటే ఎక్కువగానే గ్రామాల్లో ఉండే రైతులు పొదుపు చేయగలరని శ్యామ్‌ప్రీత్ అన్నారు. ‘‘నగరంలో పనిచేసే వ్యక్తి రూ.50 వేలు సంపాదిస్తుంటే, అతను రూ.30 వేలు ఖర్చు చేసి, రూ.20 వేలు పొదుపు చేయగలుగుతారు. కానీ, గ్రామంలో రూ.20 వేలు సంపాదించినా కూడా రూ.15 వేలను పొదుపు చేయొచ్చు’’ అని తెలిపారు. ‘‘నాట్లు వేసే సమయంలో ప్రజలకు అయ్యే ఖర్చు, పంట పండించి అమ్మేటప్పుడు రాదన్నది వ్యవసాయంలో నిజం. అంతేకాక, ఇక్కడ ప్రజలకు తక్కువ భూమి ఉండొచ్చు. సంపాదన అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ, వ్యవసాయంతో వ్యాపారం చేసే వారు మాత్రం బాగానే సంపాదిస్తున్నారు’’ అని పాదయాత్రను నిర్వహించిన వారిలో ఒకరైన శివ ప్రసాద్ బీబీసీతో అన్నారు.
 
యువ రైతులకు పెళ్లి కాకపోవడం అనే సమస్య కేవలం మాండ్యా జిల్లాలోని మూడు తాలుకాలకు మాత్రమే పరిమితం కాలేదని శివ ప్రసాద్ చెప్పారు. ‘‘200 మందికి పైగా ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు వారి పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, స్థానిక మీడియా కథనాల్లో ఈ పాదయాత్ర ఉద్దేశ్యాన్ని తప్పుడుగా చూపించడంతో చాలా మంది వారి పేర్లను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ నేనేం బాధపడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది నాతో టచ్‌లో ఉన్నారు. పెళ్లి విషయంలో వారందరూ కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు’’ అని శివ ప్రసాద్ చెప్పారు.
 
పెళ్లి కాకపోవడానికి అసలు కారణం వ్యవసాయమా?
మాండ్యా జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైనప్పుడు, వందలాది మంది రైతులు జిల్లాలోని డిప్యూటీ కమిషనర్ ఎదుట నిల్చుని చెరకు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున రైతులు తమ ట్రాక్టర్లు వేసుకుని కమిషనర్ ఆఫీసుకి వచ్చారు. అయితే, వారిని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. చెరకు ధరలను పెంచాలని గత 109 రోజులుగా ఈ రైతులు ఆందోళన చేస్తున్నారు. ‘‘ఎంతో కాలంగా చెరకు ధరలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పదేళ్ల క్రితం చెరకు ఒక టన్ను ధరను రూ.2,800గా నిర్ణయించారు. అప్పటి నుంచి ఆ ధర అలానే ఉంది. ఇప్పటి వరకు పెంచలేదు. టన్ను రూ.4,500కి పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఇప్పటికీ మాకు తప్పుడు వాగ్దానాలే ఇస్తున్నారు తప్ప, ఎలాంటి ధరల పెంపు చర్యలు తీసుకోవడం లేదు’’ అని రైతుల సంఘ నేత దర్శన్ పట్నయ్య బీబీసీతో చెప్పారు.
 
‘‘చెరకు పంట పండించే అన్ని వస్తువుల ధరలు పెరగాయన్నది ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. చెరకు పండించే వారు ఇక్కడ 25 లక్షల మంది రైతులున్నారు. 100 చెరకు కర్మాగారాలున్నాయి. వీటిల్లో చాలా వరకు రాజకీయనేతలకు చెందినవే’’ అని దర్శన్ పట్నయ్య తెలిపారు. ‘‘యువ రైతులకు అందుకేనా పిల్ల ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అంటే పట్నయ్య అవుననే అంటున్నారు. ‘‘రైతు పిల్లలకు అంత ఎక్కువగా డబ్బులుండవు. ఈ మధ్య నేను ఒక 42 ఏళ్ల వ్యక్తిని కలిశాను. ఆయనకు 12 ఎకరాల పొలం ఉంది. అయినా ఆయనకు పెళ్లి కావడం లేదు. ఎందుకు కావడం లేదని నేను అడిగితే, ఎవరూ కూడా రైతుకి పిల్లను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు. రైతుల సంక్షోభం నిజంగా చాలా పెద్దది. వారి జీవితాలను ఎన్నో రకాలుగా దెబ్బకొడుతోంది’’ అని పట్నయ్య చెప్పారు.
 
లింగ నిష్పత్తి అతిపెద్ద సమస్యగా ఎలా మారింది?
పెళ్లి కాకపోవడానికి మరో ప్రధాన కారణాన్ని కూడా రైతు సంఘానికి చెందిన మహిళల వింగ్ అధ్యక్షురాలు నగరే వక్క వెలుగులోకి తీసుకొచ్చారు. ‘‘పాదయాత్రలో పాల్గొన్న వారిలో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిల లింగ నిష్పట్టి బాగా పడిపోయిన రోజుల్లో జన్మించారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి మేము ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. 1994లో ఈ ప్రాంతాల్లో లింగ నిర్ధారణ పరీక్షలను రద్దు చేసినప్పటికీ, భ్రూణ హత్యలు కొనసాగాయి. ఇప్పుడు మీరే చూడండి, మన సమాజంలో ఆడపిల్లల సంఖ్య ఎంత తక్కువగా ఉందో’’ అని ఆమె అన్నారు. ‘‘మీకు దగ్గర్లో ఉన్న ప్లే స్కూల్‌కి వెళ్తే, ఎంత మంది అమ్మాయిలున్నారో మీకే తెలుస్తుంది’’ అని నగరే వక్క అన్నారు. 2001 నుంచి 2011 మధ్య జనాభా గణాంకాల ప్రకారం ఈ లింగ నిష్పత్తిలో తేడాలను ఆమె ప్రస్తావించారు. మాండ్యా జిల్లాలో పరిస్థితిని వివరించారు.
 
2001లో కృష్ణ రాజేంద్ర ప్రాంతంలో 1000 మంది అబ్బాయిలకు 971 మంది అమ్మాయిలుంటే, ఈ సంఖ్య గ్రామాల్లో కేవలం 969గా మాత్రమే ఉన్నట్లు తెలిపారు. పదేళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత పడిపోయిందని, 2011లో 1000 మంది అబ్బాయిలకు 960 మంది మాత్రమే అమ్మాయిలున్నట్లు చెప్పారు. అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే, గ్రామాల్లో 1000 మంది అబ్బాయిలకు 962 మంది అమ్మాయిలున్నప్పుడు, నగరాల్లో కేవలం 948 మాత్రమే ఉన్నట్లు తెలిపారు. మలవ్లి తాలుకాలో ఈ పరిస్థితి మరింత దిగజారిందని, 2001లో 1000 మంది అబ్బాయిలకు కేవలం 944 మంది మాత్రమే అమ్మాయిలుండేవారని, ఈ సంఖ్య గ్రామాల్లో కేవలం 939 మాత్రంగానే ఉండేదని చెప్పారు. ఆ తర్వాత పదేళ్లకు ఈ సంఖ్య మరింత పడిపోయి, 1000 మంది అబ్బాయిలకు కేవలం 928 మంది అమ్మాయిలున్నారని అన్నారు.
 
ఇదే రకమైన పరిస్థితి నాగమంగళ తాలుకాలో కూడా ఉందని ఆమె చెప్పారు. 2001లో ఇక్కడ 1000 మంది అబ్బాయిలకు 954 మంది అమ్మాయిలుంటే, 2011 నాటికి ఈ సంఖ్య 945కి పడిపోయిందని తెలిపారు. గ్రామాల్లో అమ్మాయిల సంఖ్య 949కి, పట్టణాల్లో 912కి పడిపోయిందన్నారు. మాండ్యా జిల్లా పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడే మరో ఆశ్చర్యపోయే విషయం వెలుగులోకి వచ్చింది. 2001తో పోల్చుకుంటే 2011 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 922 నుంచి 942కి పెరిగింది. అయితే, ఇక్కడ గ్రామాల్లో ఈ సంఖ్య 901 నుంచి 942కి పెరగగా.. నగరాల్లో 967 నుంచి 942కి పడిపోయింది. అయితే, ఆర్థికంగా రైతులకు పరిస్థితులు అంత బాగోలేప్పటికీ, కొందరు అమ్మాయిలు నగరాల్లో కంటే గ్రామాల్లో వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
 
‘‘సమస్య ఏదైనా ఉండొచ్చు. గ్రామాల్లో అయితే సాయం చేసేందుకు వెంటనే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ నగరాల్లో అలా కాదు. నాకు గ్రామాల్లో నివసించడమంటేనే ఇష్టం. అక్కడి వాతావరణాన్నే ఎక్కువగా ప్రేమిస్తా’’ అని జయశీల అనే యువతి బీబీసీతో అన్నారు. జయశీల తన తల్లి, సోదరుడితో కలిసి బెంగళూరు శివారులో నివసిస్తున్నారు. ఆమె తండ్రి 2007లో చనిపోయారు. నగరంలో నివసించేందుకు చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారని, తాము కూడా ఏదో ఒక పనిచేసుకోవచ్చని భావిస్తారని జయశీల అన్నారు. ‘‘ఒకవేళ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తులతో పెళ్లి అయితే, అక్కడి నుంచి రావడానికి భర్త అనుమతి తీసుకోవాలి. మా జనరేషన్‌లో ఎవరూ కూడా ఒకరిపై ఆధారపడి బతకాలని అనుకోవడం లేదు’’ అని జయశీల చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments