తన పాదయాత్రకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్న ఓ ఎస్‌ఐ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏయ్ ఎస్ఐ.. నీవు వెళ్లి బడా చోర్‌కు కాపలా కాసుకో అని హెచ్చరించారు. దీనికి ఎస్ఐ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఎక్కువ మాట్లాడకు.. ఎవరితో మాట్లాడుతున్నావ్... ఎస్ఐవి అయివుండి నీవే శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నావ్... రేపు నువ్వు ఏపీలో ఉద్యోగం ఎలా చేస్తావో నేనూ చూస్తా.. తమషా చేస్తున్నావా.. బీ కేర్‌ఫుల్ ఎస్ఐ. నీవు ఎస్ఐ అయితే నాపై కేసు పెట్టుకో ఇక్కడ ఆటంకాలు గలిగించవద్దు అంటూ హెచ్చరించారు. ఎస్ఐ గట్టిగా నారా లోకేశ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు సైతం కేరింతలు కొడుతూ కరతాళ ధ్వనులు చేశారు.
పైగా, తన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగించడంపై ఆయన మండిపడ్డారు. జీవో నెంబర్ వన్‌లో మైక్‌లో మాట్లాడొద్దని ఉందని... తాను మైక్ వాడటం లేదని, మైక్ లేకుండానే మాట్లాడుతున్నానని చెప్పారు. తాను మాట్లాడేందుకు ఎవరయ్యా పర్మిషన్ ఇవ్వాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ కావాలని ఏ రాజ్యాంగంలో ఉందని ఎస్ఐను నిలదీశారు.
టీడీపీ కార్యాలయంపైనా, తనపైన దాడిచేసేందుకు వచ్చే వైకాపా కార్యకర్తలపై మాత్రం కేసులు ఉండవు. కానీ, తాను పాదయాత్రలో స్టూలు వేసుకుని మాట్లాడితే మాత్రం కేసులు పెడతారు అంటూ హెచ్చరించారు. పాదయాత్రలో భాగంగా, స్టూలు ఎక్కి మాట్లాడేందుకు నారా లోకేశ్ ప్రయత్నించగా, పర్మిషన్ లేదంటూ ఎస్ఐ ఆవేశంతో అన్నారు. దీంతో ఆయనపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.