Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైసీపీ జోరు కొనసాగుతుందా? టీడీపీ, బీజేపీ పైచేయి సాధిస్తాయా? చరిత్ర ఏం చెబుతోంది

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (13:22 IST)
తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంపై పార్టీలన్నీ తీవ్రంగా దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం తమ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. బీజేపీ మాత్రం ఇంకా తగిన అభ్యర్థి వేటలో ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఈ స్థానం గెలుచుకున్న వైసీపీకి సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడం సవాల్‌గా మారుతోంది. ఈసారి తమదే విజయమనే ధీమాలో టీడీపీ, బీజేపీ ఉన్నాయి. టీడీపీ, వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుండగా బీజేపీకి జనసేన మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.

 
ఏడుకు ఏడూ వైసీపీవే
వైసీపీ 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఆ పార్టీ తరపున బరిలో దిగిన బల్లి దుర్గా ప్రసాద్ భారీ విజయం నమోదు చేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం వైసీపీదే. ఆ ఎన్నికల్లో వరప్రసాద్ గెలిచారు. కానీ, ఆయన 2019లో ఏపీ అసెంబ్లీ కి పోటీ చేయడంతో ఆయన స్థానంలో బల్లి దుర్గా ప్రసాద్ బరిలో దిగి గెలిచారు.

 
మొన్నటి ఎన్నికల్లో మొత్తం 16,50,453 ఓట్లకు గానూ దాదాపు 80 శాతం పోలింగ్ అయ్యింది. పోలైన 13 లక్షల పైచిలుకు ఓట్లలో వైసీపీ 55 శాతం దక్కించుకుంది. ఆపార్టీ అభ్యర్థికి 7,22,877 ఓట్లు దక్కాయి. తెలుగుదేశం అభ్యర్థి 4,94,501 ఓట్లు అంటే 37 శాతం సాధించారు. 2,28,376 ఓట్ల మెజారిటీని వైసీపీ సాధించింది. తర్వాతి స్థానంలో నోటాకి 25,781 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థికి 24,039 ఓట్లతో నాలుగో స్థానం దక్కింది. ఇక జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీకి 20,971, బీజేపీకి 16,125 ఓట్లు రావడంతో డిపాజిట్లు దక్కలేదు.

 
ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీకే దక్కాయి. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు స్థానాలను ఆపార్టీ తన ఖాతాలో వేసుకుంది.

 
టీడీపీ ఆవిర్భావం తరువాత ఒక్కసారే...
తిరుపతి పార్లమెంట్ స్థానంలో తొలి నుంచి టీడీపీయేతర పార్టీలకే మొగ్గు కనిపిస్తోంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి 1984లో టీడీపీ విజయం సాధించగలిగింది. అప్పట్లో టీడీపీ తరుపున చింతామోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ గెలిచింది. కానీ, తొలిసారిగా 1999లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి విజయం దక్కింది. కానీ, ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ గెలిచారు. ఈ కాలంలో ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుపతి నుంచి ఆయన ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

 
తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రయత్నం చేస్తూ పలువురు అభ్యర్థులను మారుస్తూ రంగంలో దిగినా ఇక్కడ పట్టు సాధించలేకపోయింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె టీడీపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో కూడా బరిలో దిగుతున్నారు. తాజాగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

 
స్థానిక ఎన్నికల విజయోత్సాహంతో వైసీపీ
సిట్టింగ్ సీటు కావడం, అన్ని చోట్లా ఎమ్మెల్యేలుండడంతో పాటుగా ఇటీవలి స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు వైసీపీని ఉత్సాహంలోకి నెట్టాయి. పంచాయితీ ఎన్నికలతో పాటుగా మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆపార్టీ ఘనవిజయం సాధించింది. ఉప ఎన్నికల్లోనూ తమదే విజయం అని, అత్యధిక మెజార్టీ సాధించి దేశమంతటినీ ఆకర్షించే రీతిలో ఫలితం ఉండాలని ఇటీవల సీఎం నిర్దేశించారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మంత్రులు, ఇతర నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రతీ అసెంబ్లీ స్థానానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు.

 
"తిరుపతిలో మాకు తిరుగులేదు. ఇటీవల ఎన్నికల ఫలితాలు దానికో ఉదాహరణ. సునాయాసంగా విజయం దక్కుతుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలో మాపార్టీ మరింత బలోపేతం అయ్యింది. టీడీపీ, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేరు. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తాం. సీఎం జగన్ ఆశీస్సులున్నాయి. సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి ప్రజలు ఆదరిస్తారని బలంగా విశ్వసిస్తున్నాం" అంటున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి. తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన వైఎస్ జగన్ కి సన్నిహితుడు. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్ కి ఫిజియోథెరపిస్ట్ గా సేవలు అందించారు.

 
స్థానిక ఎన్నికలతో పోల్చలేం...
స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో సాధించిన విజయాలతో పొంగిపోతున్న వైసీపీకి ప్రజలు బ్రేకులు వేస్తారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. టీడీపీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు. స్థానిక ఎన్నికలను, పార్లమెంట్ ఉప ఎన్నికలతో పోల్చలేమని ఆయన బీబీసీతో చెప్పారు.

 
"మాకు తిరుపతిలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. స్థానిక ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈసారి అలా కుదురదు. ప్రజలకు అవకాశం రాగానే బుద్ధి చెబుతారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పులుపాలుజేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. టీడీపీ అభ్యర్థికి సుదీర్ఘ అనుభవం ఉంది. కాబట్టి ఆమెను గెలిపిస్తే తిరుపతి అభివృద్ధికి తోడ్పడతారు. ప్రచారంలో ప్రజాస్పందన అనుకూలంగా ఉంది" అంటూ ఆయన అన్నారు.

 
పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు
ఏపీలో తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ అంటోంది. దానికి తగ్గట్టుగా తిరుపతి ఉప ఎన్నికల్లో తడాఖా చూపాలని ఆశిస్తోంది. తద్వారా తమ బలం పెరుగుతుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని ఆశిస్తోంది. ఇటీవల తెలంగాణా ఉప ఎన్నికల్లో సాధించిన ఫలితాలు తమకు ఆశాజనకంగా ఉన్నాయని , తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతం అవుతుందనడానికి సంకేతాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు.

 
బీజేపీ టికెట్ కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. "ఏపీ అభివృద్ధికి కేంద్రం అనేక నిధులు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి తమ ఫోటోలతో ప్రచారం చేసుకుంటోంది. ప్రజలు వాటిని గ్రహిస్తున్నారు. బీజేపీ మీద దుష్ప్రచారం ఇక సాగదు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఏపీ రాజకీయాల్లో పలుమార్పులు వస్తాయి. గతంలో మేము ఇక్కడి నుంచి గెలిచిన అనుభవం ఉంది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. తిరుపతి క్షేత్ర ప్రతిష్టను కాపాడుతాం. అందుకే ప్రజలు మాకు అవకాశం ఇవ్వబోతున్నారు " అంటూ వివరించారు. బీజేపీ టికెట్ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్, కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

 
ప్రత్యేక హోదా ప్రభావం చూపిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీని తాము అధికారంలోకి వస్తే అమలుచేస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పింది. 2014 ఏప్రిల్ నెలలో జరిగిన తిరుపతి సభలో నేటి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను పలుపార్టీలు పదే పదే ప్రస్తావిస్తున్నాయి. తాజాగా పార్లమెంటులో ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించిన ఏపీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తూ ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చేసింది. తిరుపతిలోని ప్రస్తుతం ఉపఎన్నికలు జరుగుతున్న తరుణంలోమరోసారి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటుగా సీపీఎం కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఇంకా మరికొందరు కూడా పోటీ చేసే అవకాశం ఉంది.

 
ప్రధాన సమస్యలన్నీ అలానే ఉన్నాయి...
ఆధ్యాత్మిక క్షేత్రంగా, దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఉన్న నగరానికి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు రాబట్టడంలో ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన వారి ప్రయత్నాలు ఫలించలేదని స్థానికులు చెబుతున్నారు. కేవలం టీటీడీ తోడ్పాటుతో నగరంలో కొంత అభివృద్ధి కనిపిస్తున్నా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా ప్రభావం కనిపించడం లేదని తిరుపతికి చెందిన పి మురళి బీబీసీతో అన్నారు.
 
"ఎంపీలుగా పనిచేసి, కేంద్రంలో మంత్రులుగా ఉన్న సమయంలో కూడా తిరుపతి పార్లమెంట్ స్థానానికి పెద్దగా ప్రయోజనాలు కనిపించలేదు. పార్టీలు మారిన పెద్దగా ఫలితం రాలేదు. తాగునీటి సమస్య కొనసాగుతోంది. తిరుపతి, శ్రీకాళహస్తి మినహా మిగిలిన చోట్ల పారిశ్రామికాభివృద్ధి ఆనవాళ్లు కూడా లేవు. కొత్తగా ఎన్నికయ్యే పార్లమెంట్ సభ్యులైనా తిరుపతి ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేయాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రయత్నించాలి. దానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకురావాలి"అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments