Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భారత్‌లో పన్నులు చెల్లించే భార్య కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటారా?

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:18 IST)
బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులలో ఒకరిగా చాన్స్‌లర్ రిషి సునక్ గుర్తింపు పొందారు. రిషి సునక్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీలోని వారితో పాటు బయట కూడా చాలామంది.... కాలం కలిసి వస్తే భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఆయన మారతారని అంచనా వేశారు. కానీ, గత కొన్ని రోజులు, వారాలుగా రిషి సునక్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

 
అయితే, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఏదీ ఎక్కువ కాలం కొనసాగదని 41 ఏళ్ల రిషి సునక్ త్వరగానే గ్రహిస్తున్నారు. బ్రిటన్‌లో అత్యంత చిన్న వయస్సుడైన చాన్స్‌లర్‌గా 2020 ఫిబ్రవరిలో నియమితుడైన తర్వాత రిషి సునక్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాత్రికి రాత్రే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆయనను ప్రజలు ముద్దుగా 'డిషీ రిషి' అని పిలుచుకునేవారు. కరోనా మహమ్మారి సమయంలో రిషి సునక్ రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా ఆయనకు మరింత ప్రజాదరణ దక్కింది.

 
రిషి సునక్ ఎవరు?
రిషి సునక్ పూర్వీకులు భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980లో రిషి జన్మించారు. అక్కడే ఆయన నాన్న వైద్యుడిగా పని చేశారు. తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు. 2005లో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఐ చదువుతోన్న సమయంలో ఆయన అక్షతా మూర్తిని కలిశారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి, గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత 'ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్, థెలెమ్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామిగా పనిచేశారు.

 
స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ, సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సునక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు.

 
అక్షతా మూర్తి ఎవరు?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కర్ణాటకు చెందిన ఎన్‌ఆర్ నారాయణ, సుధా మూర్తి దంపతులకు 1980 ఏప్రిల్‌లో అక్షతా మూర్తి జన్మించారు. ఆమె సోదరుడు రోహన్. నారాయణమూర్తి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లినప్పుడు అక్షత, రోహన్‌లను కూడా ముంబైకి తీసుకెళ్లారు. తర్వాత వారిని కర్ణాటకలోని నాన్నమ్మ, తాతయ్యల ఇంటికి పంపించారు. 1981లో నారాయణ మూర్తి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. ఈ ఐటీ కంపెనీ ఏర్పాటు తర్వాత దేశంలోని ధనిక వ్యక్తుల్లో నారాయణ మూర్తి చేరిపోయారు. ఆయన ఆస్తుల నికర విలువను 3.45 బిలియన్ పౌండ్లు (రూ. 34,344 కోట్లు)గా ఫోర్బ్స్ పేర్కొంది.

 
అక్షత తల్లి సుధామూర్తి కంప్యూటర్ సైంటిస్టు, ఇంజినీర్. అప్పట్లో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)'లో పనిచేసిన తొలి మహిళ సుధామూర్తి. ఆమె ఇన్ఫోసిస్‌లో కూడా పనిచేశారు. ప్రస్తుతం సామాజిక సేవ చేస్తున్నారు. అక్షత, భారత్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. ఎకనామిక్స్, ఫ్రెంచ్ చదవడం కోసం అమెరికా వెళ్లారు. తర్వాత డెలాయిట్, యూనీలివర్ వంటి సంస్థలలో పనిచేసి, ఎంబీఏ కోసం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు. అక్కడే తనకు కాబోయే భర్త రిషి సునక్‌ను తొలిసారి కలిశారు. నాలుగేళ్ల తర్వాత బెంగళూరులో వేడుకగా వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకలో అగ్రశ్రేణి క్రికెటర్లతో సహా పలువురు ఉన్నతస్థాయి వ్యక్తులు, ప్రముఖులు హాజరయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

 
అక్షత వ్యాపార సామ్రాజ్యం, సంపద
2009లో అక్షత మూర్తి సొంతంగా 'అక్షతా డిజైన్స్' పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను స్థాపించారు. సొంత వ్యాపారాలే కాకుండా ఇన్ఫోసిస్‌లో ఆమెకు 0.9శాతం వాటా ఉంది. ఆమె సంపదలో అధిక భాగం ఈ వాటా ద్వారానే లభిస్తుంది. దీని ద్వారా లభించిన సంపద 400 మిలియన్ పౌండ్ల (రూ. 3,981 కోట్లు)కంటే ఎక్కువే అని అంచనా. అంటే క్వీన్ ఎలిజబెత్ (365 మిలియన్ పౌండ్లు- రూ. 3,633 కోట్లు) వ్యక్తిగత సంపద కంటే కూడా అక్షతా మూర్తి సంపదే ఎక్కువ. 2010లో నారాయణమూర్తి బ్రిటన్‌లో ప్రారంభించిన వెంచర్ క్యాపిటల్ బిజినెస్ క్యాటమరాన్ వెంచర్స్‌కు ఆమె డైరెక్టర్ కూడా. దీంతో పాటు ఆమెకు కనీసం ఆరు ఇతర యూకే కంపెనీలలో షేర్లు ఉన్నాయి.

 
రిషి-అక్షత దంపతులకు అమెరికా, బ్రిటన్‌లో కనీసం నాలుగు ఇళ్లు ఉన్నాయని చెబుతారు. లండన్‌లోని కెన్సింగ్టన్‌లో 7 మిలియన్ పౌండ్ల విలువ చేసే ఐదు బెడ్‌రూమ్‌ల ప్రాపర్టీతో పాటు, రిషీ ప్రాతినిధ్యం వహించే ఉత్తర యార్క్‌షైర్ నియోజకవర్గంలో 1.5 మిలియన్ పౌండ్ల విలువైన జార్జియన్ భవనం ఉంది. శాంటా మోనికా, కాలిఫోర్నియా ప్రాంతాల్లో 5.5 మిలియన్ పౌండ్ల విలువ చేసే బీచ్ పెంట్‌హౌస్‌లు కూడా ఉన్నాయి.

 
రిషి సునక్ విషయంలో ఏం జరిగింది?
ఒకప్పుడు ప్రజలు ఎంతో ఇష్టపడే రిషి సునక్ పాపులారిటీ ఇప్పుడు పడిపోయింది. ఇటీవలి పబ్లిక్ పోల్ ప్రకారం, బ్రిటన్‌లో సగానికి పైగా (57 శాతం) ప్రజలు ఆయనపై వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు. కేవలం 28 శాతం మాత్రమే సానుకూలంగా ఉన్నారు. రిషి ప్రజాదరణ కోల్పోవడానికి చాలా అంశాలు కారణమై ఉండొచ్చు. కానీ, ఆయనతో పాటు అక్షతా మూర్తి సంపదపై అందరి దృష్టి నిలిచింది. మీడియాలో ఇది చర్చనీయాంశం అయింది. 'రాణి కంటే ధనవంతులు: యూకే ఆర్థిక మంత్రి సంపద కేంద్రం అక్షతా మూర్తిని కలవండి', 'రష్యాలో పనిచేస్తోన్న కంపెనీ ద్వారా భార్య సంపాదిస్తోన్న 'నెత్తుటి డబ్బు'తో ఒత్తిడికి గురైన రిషి సునక్' ఇలా అనేక వ్యతిరేక హెడ్‌లైన్ల వార్తలతో ఆయన ఇమేజ్ దెబ్బతింది.

 
ఇటీవలి బీబీసీ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో తన భార్యకు రిషి సునక్ మద్దతు ఇచ్చారు. ఇన్ఫోసిస్‌లో షేర్లు ఉన్నందుకుగానూ తన భార్యపై వస్తోన్న విమర్శలతో తాను విసిగిపోయానని ఆయన వ్యాఖ్యానించారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, మాస్కోలో ఇప్పటికీ ఆ కంపెనీ కార్యాలయం ఉన్నట్లు తేలింది. అయితే, ఆయన భార్య 'నాన్-డొమిసిల్' కేటగిరీలో ఉన్నట్లు బయటపడటంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. యూకేలో నివసిస్తూ, తమ శాశ్వత నివాసం యూకే బయట ఉందని ధ్రువీకరించేవారిని 'నాన్-డొమిసిల్' కేటగిరీగా పేర్కొంటారు.

 
అక్షతా మూర్తి, గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్ల నుంచి 11.6 మిలియన్ పౌండ్ల డివిడెండ్ ఆదాయాన్నిపొందారు. ఆమె 'నాన్-డొమిసిల్డ్' యూకే నివాసి కేటగిరీలో ఉండటంతో బ్రిటన్ చట్ట ప్రకారం ఆమె ఈ ఆదాయానికి యూకేలో పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. బ్రిటన్‌లో చెల్లించాల్సిన మొత్తం పన్నును అక్షతామూర్తి చెల్లిస్తారని ఆమె అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే ఓవర్సీస్ పన్నును ఆమె ఎక్కడ చెల్లిస్తున్నారనే అంశంపై పూర్తి పారదర్శకత కావాలని లేబర్ పార్టీ పిలుపునిచ్చింది.

 
ప్రజలు ఏం అంటున్నారు?
లండన్‌కు చెందిన 39 ఏళ్ల ఐటీ మేనేజర్ అరవింద్ కుమార్ దీని గురించి మాట్లాడారు. ''అక్షతా మూర్తి ఏ తప్పూ చేయలేదు. ఆమె భారత పౌరురాలు. భారత పాస్‌పోర్ట్‌నే కలిగి ఉన్నారు. భారత్‌లో ఆమె సంపాదించే ఆస్తులకు సంబంధించిన పన్నులను ఆమె భారత ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ కారణంగా ఆమె యూకేలో పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు'' అని ఆయన అన్నారు. కానీ చాలామంది దీనితో ఏకీభవించడం లేదు.

 
యార్క్‌కు చెందిన 65 ఏళ్ల కింబర్లీ గ్రే, బీబీసీతో మాట్లాడుతూ... ''రిషి, ఆయన భార్య ఇద్దరూ యూకేలో నివసిస్తున్నప్పుడు, ఈ దేశ నివాసితులుగా ఉన్నప్పుడు పన్నులు కూడా ఇక్కడే కట్టాలి. ధనికులతో సహా నిబంధనలు అందరికీ వర్తిస్తాయి'' అని అన్నారు. ''తన భార్యకు చెందిన 'నాన్ డొమిసిల్' ట్యాక్స్ స్టేటస్ నుంచి రిషి సునక్ ఎలాంటి మచ్చ లేకుండా బయటకు రావాలి'' అని లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ అన్నారు. అక్షతా మూర్తి ఎందుకు నాన్ డొమిసిల్ స్టేటస్‌ను ఉపయోగించుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు.

 
తనను సాధించాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు తన భార్యను లక్ష్యంగా చేసుకుంటున్నారని రిషి సునక్ ఆరోపించారు. రిషి సునక్ గ్రీన్ కార్డ్, ఆయన భార్య పన్ను వివాదాల కారణంగా యూకే తదుపరి ప్రధానమంత్రిగా రిషి ఎన్నికయ్యే అవకాశాల్లేవని అబ్జర్వర్ వార్తా పత్రికతో మాట్లాడుతూ సీనియర్ కన్జర్వేటివ్ పార్టీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు అన్నారు. బోరిస్ జాన్సన్, తదుపరి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో రిషి సునక్‌ను చాన్స్‌లర్‌గా తొలిగించాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు.

 
విదేశీ ఆదాయంపై యూకే ట్యాక్స్‌లు చెల్లిస్తానన్న అక్షతా మూర్తి
పన్ను ఏర్పాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఏప్రిల్ 8న అక్షతామూర్తి చెప్పారు. తన వల్ల తన భర్తకు చీకాకు కలగకూడదని బీబీసీతో అన్నారు. తన పన్ను వ్యవహారాలన్నీ చట్టబద్ధమైనవని ఆమె చెప్పారు. 'నేను చెల్లించే పన్ను వ్యవహారాల ప్రభావం నా భర్తపై, కుటుంబంపై పడకూడదు'' అని ఆమె అన్నారు. నాన్-డొమిసిల్ స్థితి ద్వారా అక్షతా మూర్తి ప్రతీ ఏటా 2.1 మిలియన్ పౌండ్ల (రూ. 20 కోట్లు) పన్నును తప్పించుకునే వీలుందని బీబీసీ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments