రష్యా-యుక్రెయిన్‌ల మధ్య 50 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలు రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాలు యుక్రెయిన్ (అమెరికా) పక్షాన నిలిస్తే, మరికొన్ని దేశాలు రష్యా వైపు నిలబడుతున్నాయి.
అయితే, భారత్ మాత్రం ఇప్పటికీ తటస్థంగానే ఉంది. ఇక్కడ తటస్థం అంటే ఇటు అమెరికా, అటు రష్యా ఒత్తిడికి తలొగ్గకపోవడంగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పేరును ప్రస్తావించకుండానే యుక్రెయిన్‌లోని బుచాలో పౌరుల హత్యల గురించి మాట్లాడటం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
జైశంకర్ ఏమన్నారు?
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా చేస్తున్న విమర్శల దాడికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చారు. భారత్ నెల రోజుల్లో కొనుగోలు చేసేంత చమురును యూరప్ ఒక రోజులోనే కొనుగోలు చేస్తుంది అని ఆయన అన్నారు. మరోవైపు అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి జైశంకర్ మాట్లాడారు. మా గురించి ఎవరికైనా ఏదైనా అభిప్రాయాలు ఉండొచ్చు. అలానే వారి గురించి కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. మా గురించి మాట్లాడేటప్పుడు మేం మౌనంగా ఉంటామని అనుకోకూడదు. ఇతర దేశాల్లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాకు కూడా అభిప్రాయాలు ఉంటాయి అని జైశంకర్ అన్నారు.
యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత, అమెరికాకు చెందిన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దులీప్ సింగ్ భారత్‌లో పర్యటించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ కూడా భారత్‌లో పర్యటించారు. సెర్జీ.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. అయితే, భారత్ తటస్థ వైఖరిని ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు తప్పుపడుతున్నాయి.
ఈ ఏడాది జూన్‌లో జరగబోతున్న జీ-7 దేశాల సదస్సుకు భారత్‌ను జర్మనీ ఆహ్వానించబోవడంలేదని మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఈ సదస్సుకు భారత్‌కు జర్మనీ ఆహ్వానం పంపే అవకాశముందని ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై జర్మనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మరోవైపు భారత్ వైఖరిపై మొదట్లో ఆస్ట్రేలియా కాస్త అసంతృప్తి వ్యక్తంచేసింది. అయితే, ఇటీవల భారత్-ఆస్ట్రేలియా చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం గురించి పదేళ్ల నుంచి చర్చలు జరుగుతూ వచ్చాయి.
అందుకే నేటి ప్రపంచాన్ని మల్టీ పోలార్ ప్రపంచంగా నేను భావించను. నిజానికి దీన్ని ఒక బైపోలార్ ప్రపంచంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బైపోలార్ అంటే ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా ఉన్నాయి. భారత్ ఎప్పటికీ చైనా వైపు ఉండదు. ఇదివరకు భారత్ అలీన విధానాన్ని అనుసరించేటప్పుడు.. అటు అమెరికా, ఇటు రష్యా.. రెండు భారత్‌కు ప్రత్యర్థి దేశాలు కావు. కాబట్టి అప్పుడు తటస్థ వైఖరిని అనుసరించడం తేలికైంది.
కానీ, నేడు భారత్ ప్రయోజనాలు అమెరికాకు కాస్త దగ్గరగా ఉన్నాయి. మరోవైపు రష్యాతో బంధాలు కూడా తప్పనిసరి. ఒకవేళ రష్యా పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్తే, భారత్‌కు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. యుక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రస్తుతానికి భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. కానీ, రష్యా నుంచి చమురు కొనుగోలును యూరప్ పూర్తిగా నిలిపివేస్తే, లేదా రష్యాపై ఆంక్షలు విధించాలని మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడితెస్తే.. భారత్ ఈ తటస్థ విధానాన్ని కొనసాగించగలదా? మోదీ విదేశాంగ విధానం నెహ్రూ కంటే భిన్నమైనది. నెహ్రూ సమయంలో విదేశాల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేవారు. ఇప్పుడు భారత్ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారుఅని సుశాంత్ అన్నారు.
విమర్శలు కూడా వస్తున్నాయి..
అయితే, రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని కొందరు విమర్శిస్తున్నారు కూడా. అలా విమర్శిస్తున్న వారిలో విదేశాంగ నిపుణుడు కేసీ సింగ్ ఒకరు. బుచా హత్యల గురించి ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. బుచాలో హత్యలపై సమగ్ర దర్యాప్తు జరపాలని భారత్ డిమాండ్ చేయకపోవడం విచారకరం. ఈ హత్యల వెనుక ఉన్నది రష్యా అని మనకు స్పష్టంగా తెలుసు. అయినా, నోరు మెదపకపోవడం అనైతికం అని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అవకాశవాద రాజకీయాలుగా కేసీ సింగ్ అభివర్ణించారు. యూరప్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు.
జైశంకర్ వ్యాఖ్యలను విదేశాంగ విధానంతో ముడిపెట్టడం సరికాదు. అయితే, అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రస్తావించడం మాత్రం భిన్నమైన విధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మానవ హక్కుల ఉల్లంఘనల పేరుతో పశ్చిమ దేశాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకునేవి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి గురించి మాట్లాడుకుంటే, అంతర్జాతీయ వేదికలపై రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ వేయడం నుంచి భారత్ గైర్హాజరు అవుతోంది. దీనికి భారత్ ఇస్తున్న వివరణను కూడా మనం గమనించాలి.
మొదట్లో చర్చలు, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారం కావాలని భారత్ ఆకాంక్షించింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థలో ఓటింగ్ సమయంలో యుక్రెయిన్ సార్వభౌమత్వం గురించి మాట్లాడింది. తక్షణమే హింసను నిలిపివేయాలని కోరింది. అమాయకుల ప్రాణాలు బలితీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
రష్యా చెప్పినా గైర్హాజరు
అయితే ఓటింగ్‌కు గైర్హాజరు కావడాన్ని కూడా తమకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లే భావిస్తున్నట్లు రష్యా స్పష్టంచేసింది. అయినప్పటికీ, ఈ ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా విదేశాంగ విధానంలో భారత్ నిర్ణయం తీసుకుంటోందని విదేశాంగ విధానాలపై అధ్యయనం చేపట్టే అనంత్ సెంటర్ సీఈవో ఇంద్రాణీ బాగ్చీ అన్నారు.
ప్రస్తుతం రష్యా మన ద్వైపాక్షిక సంబంధాలను ఇబ్బందుల్లో పడేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలూ అమలులో లేవు. దీంతో భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. భారత్‌ది అలీన విధానంగా పరిగణించకూడదు. ఎందుకంటే ఇక్కడ రెండు కూటములు లేవు. రష్యాను కూటమిగా భావించకూడదు అని ఆమె అన్నారు. ఆస్ట్రేలియాతో తాజా వాణిజ్య ఒప్పందం కావొచ్చు. లేదా బుచా హత్యల గురించి కావొచ్చు. లేదా అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై జైశంకర్ వ్యాఖ్యలు కావొచ్చు.. ఇవన్నీ భారత విదేశాంగ విధానానికి ఉదాహరణలు. అయితే, వీటిని భారత్ విజయాలుగా చెప్పుకోకూడదు.
అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొనే స్థాయి నుంచి భారత్ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తమ ప్రయోజనాలు, విధానాలు ఏమిటో భారత్ స్పష్టంగా చెప్పగలుగుతోంది అని ఆమె వివరించారు.