యుక్రెయిన్ రాజధాని కీయెవ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా సైనికులు వెళ్లిపోయారు. కానీ, వారు చేసిన గాయాల నుంచి అక్కడి ప్రజలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చు. కొందరు రష్యా సైనికులు తమపై అత్యాచారం చేశారని యుక్రెయిన్ మహిళలు స్వయంగా బీబీసీకి చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా బీబీసీ గుర్తించింది.
హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక హింసకు సంబంధించిన కొన్ని వివరాలు ఉంటాయి.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామానికి చెందిన అనాతో మేం మాట్లాడాం. ఆమె వయసు 50 సంవత్సరాలు. ఆమె ఎవరో తెలియకుండా ఉండేందుకు ఆమె పేరు మార్చాం.
'చెప్పినట్టు వినకపోతే చంపేస్తానని బెదిరించాడు'
మార్చి 7న తన భర్తతో కలిసి ఉంట్లో ఉన్నప్పుడు ఒక విదేశీ సైనికుడు ఇంటి లోపలికి చొరబడ్డాడని ఆమె మాకు చెప్పారు. 'తలకు గన్ను పెట్టి, నన్ను పక్కనే ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడు. దుస్తులు విప్పేసేయ్.. లేదంటే కాల్చేస్తానని అతను నన్ను బెదిరించాడు. చెప్పినట్టు వినకపోతే నన్ను చంపేస్తానని అతను పదే పదే బెదిరించాడు. ఆ తర్వాత అతడు నన్ను రేప్ చేశాడు' అని అనా చెప్పింది. 'అతను యువకుడు. బక్కగా ఉన్నాడు. రష్యాతో పనిచేస్తున్న చెచెన్ ఫైటర్' అని తనపై అత్యాచారం చేసిన వ్యక్తి గురించి ఆమె వివరించారు.
'అతను నన్ను రేప్ చేస్తుండగానే మరో నలుగురు సైనికులు లోపలికి వచ్చారు. ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. కానీ వాళ్లు అతన్ని బయటకు తీసుకెళ్లారు. నేను అతన్ని మళ్లీ చూడలేదు' అని ఆనాటి ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. మరో యూనిట్‌కు చెందిన కొందరు రష్యా సైనికులే తనను కాపాడారని ఆమె భావిస్తున్నారు.
'కాపాడేందుకు ప్రయత్నించిన నా భర్తను కాల్చేశారు'
అనా తిరిగి ఇంటికి వెళ్లేసరికి ఆమె భర్త రక్తపు మడుగులో కనిపించారు. ఆయన కడుపులో కాల్చారు. 'నా వెనుకే వచ్చి, నన్ను కాపాడేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ వాళ్లు ఆయన శరీరంలో తుపాకీ తూటాలు దింపారు' అని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ పొరుగింట్లో ఆశ్రయం పొందారు. కాల్పులు కొనసాగుతుండటం వల్ల వాళ్లు ఆమె భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. రెండు రోజుల తర్వాత బుల్లెట్ గాయాలతో ఆయన మరణించారు.
తన కథ చెప్తున్నప్పుడు అనా కంటి నుంచి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. తన భర్తను ఇంటి వెనుక పెరట్లో ఎక్కడ ఖననం చేశారో కూడా ఆమె మాకు చూపించారు. ఆమెను కాపాడిన సైనికులు ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు.
'తలకు తుపాకీ గురిపెట్టి, తన భర్తకు సంబంధించిన వస్తువులు ఇవ్వాలని వాళ్లు బెదిరించార'ని ఆమె చెప్పారు. 'వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నాకు డ్రగ్స్, వయాగ్రా దొరికాయి. వాళ్లు వీటిని ఎక్కువగా తీసుకున్నారు. తరచుగా మద్యం తాగేవాళ్లు. వాళ్లలో చాలా మంది హంతకులు. రేపిస్టులు. దోపిడీదారులు. వారిలో కొందరు మాత్రమే మంచోళ్లు ఉన్నారు' అని ఆమె అన్నారు.
'అత్యాచారం చేసి, గొంతు కోసి చంపేశారు'
అనా ఇంటికి కాస్త దూరంలో మాకు మరో విషాద ఘటన గురించి తెలిసింది. ఒక మహిళపై అత్యాచారం చేసి, చంపేశారని చెప్పారు. అనాపై అత్యాచారం చేసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. ఆ మహిళ వయసు 40 సంవత్సరాలు. ఆమెను ఆమె ఇంటి నుంచి పక్కనే ఖాళీగా ఉన్న మరో ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు తెలిపారు. ఎంతో అందంగా అలంకరించి ఉన్న ఆ బెడ్‌రూంలో ఇప్పుడు రక్తపు మరకలు ఉన్నాయి.
గదిలో ఒక మూలలో ఉన్న అద్దంపై లిప్‌స్టిక్‌తో రాసిన వివరాలు ఆమె శవం ఎక్కడ పాతిపెట్టారో సూచిస్తున్నాయి. ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె గొంతు కోసేయడమో లేదా గొంతులో పొడవడమో చేశారు. ఆ గదిలో చాలా రక్తం ఉందని కొందరు రష్యా సైనికులు తనకు చెప్పినట్లు ఆమె ఇంటి పక్కనే ఉండే ఒక్సానా చెప్పారు. ఆ ఇంటి గార్డెన్‌లోనే ఆమెను ఖననం చేశారు. మేము అక్కడికి వెళ్లిన మరుసటి రోజు ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు ఆమె శరీరాన్ని వెలికితీశారు. ఆమె శరీరంపై బట్టలు లేవు. మెడ చుట్టూ లోతైన గాయం ఉంది.
'భర్తను చంపేసి భార్యపై అత్యాచారం'
కీయెవ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో జరిగిన మరొక కేసు గురించి కీయెవ్ ప్రాంత పోలీస్ చీఫ్ ఆండ్రీ నిబేటొవ్ మాకు వివరించారు. ఆ గ్రామ శివారులోని ఇంట్లో ఒక కుటుంబం ఉంది. మార్చి 9న రష్యా సైనికులు వాళ్ల ఇంట్లోకి ప్రవేశించారు. తన భార్యను, బిడ్డను కాపాడుకునేందుకు భర్త ప్రయత్నించారు. దాంతో వాళ్లు ఆయన్ను కాల్చేశారని పోలీస్ చీఫ్ ఆండ్రీ చెప్పారు. 'ఆ తర్వాత ఇద్దరు సైనికులు ఆయన భార్యపై పదే పదే అత్యాచారం చేశారు. వాళ్లు మూడుసార్లు వచ్చి రేప్ చేశారు. చెప్పినట్టు వినకపోతే ఆమె పసిబిడ్డను చంపేస్తామని బెదిరించారు. తన కొడుకును కాపాడుకునేందుకు ఆమె బాధను మౌనంగా భరించాల్సి వచ్చింది' అని ఆయన వివరించారు.
సైనికులు వెళ్తూ ఆ ఇంటిని కాల్చేశారు. పెంపుడు కుక్కలను కాల్చి చంపారు. ఆమె తన కొడుకుతో పాటు ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లోని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. కానీ అక్కడేం మిగల్లేదు. గతంలో ఉన్న ప్రశాంతమైన, సాధారణ జీవితానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు మాత్రమే లభించాయి. ఆమె భర్తను పొరుగింటివాళ్లు గార్డెన్‌లో ఖననం చేశారు. పరీక్షించేందుకు అతని బాడీని పోలీసులు వెలికితీశారు. ఈ కేసును అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లాలని వాళ్లు భావిస్తున్నారు.
'నా కళ్ల ముందే నడి రోడ్డులో నా సోదరిని రేప్ చేశారు'
ఇలాంటి కేసులను రికార్డు చేస్తున్నామని యుక్రెయిన్ మానవ హక్కుల అంబుడ్స్‌మెన్ డెనిసోవా చెప్పారు. 'బుచా నగరంలోని ఒక ఇంటి బేస్‌మెంట్‌లో 14 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న సుమారు 25 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. వారిలో తొమ్మిది మంది గర్భవతులు. భవిష్యత్తులో పిల్లలు కనకుండా, సెక్స్‌పై విరక్తి వచ్చేలా అత్యాచారం చేస్తామని రష్యా సైనికులు వారితో చెప్పారు' అని ఆమె తెలిపారు. సహాయం కోసం తమకు ఎన్నో ఫోన్‌కాల్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు.
తన కళ్ల ముందే నడి వీధిలో 16 సంవత్సరాల వయసున్న తన సోదరిని రేప్ చేశారని ఒక మహిళ మాకు ఫోన్ చేసి చెప్పారని డెనిసోవా తెలిపారు. రష్యా సైనికులు ఎన్ని లైంగిక నేరాలకు పాల్పడ్డారో తెలుసా అని మేము ఆమెను అడిగాము. 'ప్రస్తుతం అది అసాధ్యం. ఎందుకంటే తమ జీవితంలో జరిగిన విషాదం గురించి చెప్పడానికి అందరూ సిద్ధంగా లేరు. వారిలో చాలామంది మానసిక నిపుణుల సాయం కోసం ఫోన్ చేస్తున్నారు. వాళ్లు చెప్పకుండా మేము వాటిని నేరాలుగా నమోదు చేయలేం' అని డెనిసోవా వివరించారు.
ఈ కేసుల విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేయాలని, యుద్ధ నేరాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విచారించాలని యుక్రెయిన్ కోరుకుంటోందని ఆమె చెప్పారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని నేను పుతిన్‌ను అడగాలనుకుంటున్నానని అనా అన్నారు. 'మనం రాతియుగంలో లేము. ఆయన చర్చలకు ఎందుకు ఒప్పుకోరు. ఆయన ఎందుకు దండెత్తి వచ్చారు. ఎందుకు చంపుతున్నారు. ఇవేవీ నాకు అర్థంకావడం లేదు' అని ఆమె బాధతో చెప్పారు.