Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajinikanth: సినిమాల్లో సూప‌ర్‌స్టారే... రాజ‌కీయాల్లో మాత్రం పేలని తుపాకీ

బిబిసి
గురువారం, 12 డిశెంబరు 2024 (13:22 IST)
దాదాపు 52 ఏళ్ల కిందట...ఒక మెడికో అమ్మాయి బ‌స్ కండ‌క్ట‌ర్‌తో గొడ‌వ‌ప‌డ్డారు. బ్యాక్ డోర్ నుంచి ఎక్కి, ఫ్రంట్ డోర్ నుంచి దిగాలి. అప్ప‌ట్లో బెంగ‌ళూరులో సిటీ బ‌స్ రూల్ ఇది. దీన్ని ఆమె పాటించ‌లేదు. తీవ్ర‌మైన మాట‌ల యుద్ధం. కొద్ది రోజుల త‌రువాత వాళ్లు స్నేహితులయ్యారు. అత‌ని క‌ళ్ల‌లోని తీక్ష‌ణ‌త, మాట‌లోని ప‌దును, క‌ద‌లిక‌ల్లోని స్ట‌యిల్ మొద‌ట గుర్తించింది ఆవిడే. ఆయన వుండాల్సింది బ‌స్సులో కాద‌ని, ఒక స్టార్‌గా ఆకాశంలోనని న‌మ్మారు. ఆయన ఉద్యోగం మాని మ‌ద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేరారు. అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆమె కోసం వచ్చారు. కానీ, లేరు. బెంగ‌ళూరు వ‌దిలి వెళ్లిపోయారు. ఎక్క‌డికో తెలియ‌దు, ఇప్ప‌టికీ. ఆమె పేరు నిర్మ‌ల‌. అత‌ని పేరు ర‌జినీకాంత్‌. ఇంటిపేరు సూప‌ర్ స్టార్‌.
 
ర‌జినీ గురించి వినిపించే క‌థ‌ల్లో ఇదొక‌టి. నిర్మ‌ల క‌థ కావ‌చ్చు, క‌ల్ప‌న కూడా కావ‌చ్చు. ఆయ‌న‌కి జీవితం చాలా ఇచ్చింది. తీసుకుంది. తొమ్మిదేళ్ల‌కే త‌ల్లిలేని బిడ్డ‌. డిసెంబ‌ర్ 12, ర‌జినీ పుట్టిన రోజు. 74 దాటుతాయి. సినిమా వ‌య‌సు 50 ఏళ్లు. హీరోగా 46 ఏళ్లు, ఇంత సుదీర్ఘ కాలం నెంబ‌ర్ వ‌న్ హీరోగా వుండ‌డం ఒక ప్ర‌పంచ రికార్డ్‌. రికార్డులు బ‌ద్ద‌లు చేయ‌డ‌మే ప‌ని. ఆయ‌న ఒక తుపాన్‌. క‌నిపిస్తే ప్రేక్ష‌కులు ఊగిపోతారు. కండ‌క్ట‌ర్ కాక ముందు కూలిప‌నులు చేశారు. మనిషిలో విప‌రీత‌మైన కోపం, లెక్క‌లేనిత‌నం. ఎదిరించే ల‌క్ష‌ణం. త‌ల్లిలేనిత‌నం నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్రేష‌న్‌. ఇంట్లో వాళ్లు భ‌యంతో రామ‌కృష్ణ ఆశ్ర‌మానికి పంపారు. నెమ్మ‌ది అల‌వ‌డింది.
 
బ‌స్సులో ర‌జినీకాంత్ (అప్ప‌టికి అత‌ని పేరు శివాజి. సినిమాల్లోకి వ‌చ్చాక బాల‌చంద‌ర్ ఆ పేరును మార్చారు. ఆల్రెడీ శివాజీ గ‌ణేశ‌న్ వున్నందువ‌ల్ల శివాజి కాస్తా ర‌జినీకాంత్ అయ్యారు). టికెట్లు ఇస్తున్న ప‌ద్ధ‌తి, బ‌స్సు దిగ‌డం ఎక్క‌డంలోని స్ట‌యిల్ ఇవ‌న్నీ డ్రైవ‌ర్ రాజ‌బ‌హ‌దూర్‌ని ఆక‌ర్షించాయి. ర‌జినీని మ‌ద్రాస్‌కి త‌రిమిన వ్య‌క్తుల్లో ఈయ‌న ముఖ్యులు. ఇప్ప‌టికీ ఈయ‌న ఇంటికి మారువేషంలో వ‌చ్చి సూప‌ర్‌స్టార్ గంట‌లుగంటలు క‌బుర్లు చెబుతారని అంటారు. నువ్వు అగ్ని ప‌ర్వ‌తం కావ‌చ్చు. నీ లోప‌లి లావాని గుర్తించే గురువు కావాలి. బాల‌చంద‌ర్ దొరికారు. అన్నీ రాసిపెట్టి ఉంటాయంటారు. బాల‌చంద‌ర్ దిద్దించారు. ర‌జినీ రాసుకున్నారు. ఎంత ఎదిగినా గురువు ముందు చేతులు క‌ట్టుకునే ఉన్నారు. ఎంత వేగంగా ఎదిగారంటే 1978లో కృష్ణ‌తో న‌టించిన అన్న‌ద‌మ్ముల స‌వాల్ సినిమాతో తెలుగు నేల‌లో అభిమాన సంఘాలు ఏర్ప‌డ్డాయి.
 
79లో ఏకంగా న‌ట‌రత్న ఎన్టీఆర్‌తో స‌మానంగా టైగ‌ర్‌లో న‌టించారు. 1977లో 15 సినిమాల్లో న‌టిస్తే, ఎక్కువ‌గా నెగెటివ్ రోల్స్‌. 78లో సోలో హీరోగా భైర‌వి. త‌ర్వాత హీరోనే అని నియ‌మం పెట్టుకోకుండా నటించారు. చాలా హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. గొప్ప పేరేమీ రాలేదు. జ‌స్ట్ ఓకే. త‌మిళంలో ద‌ళ‌ప‌తి, అన్నామ‌లై, మ‌న్న‌న్ ఇవ‌న్నీ హిట్సే కానీ, ఒక యుద్ధ ట్యాంక్‌తో బాక్సాఫీస్ గోడ‌ల్ని బ‌ద్ద‌లు కొట్టే సినిమా 1995లో వ‌చ్చింది. దానిపేరు బాషా. త‌ర్వాత ఆయ‌న మాన‌వాతీత వ్య‌క్తిగా మారారు. ఒంటిచేత్తో కొడితే పాతిక మంది గాల్లోకి ఎగురుతారు. తంతే రైలు బోగి ఇనుప త‌లుపు కూడా బ‌ద్ద‌లై పోతుంది (లింగా). బుల్లెట్‌ని కూడా ఊదేయ‌గ‌ల‌రు. 73 ఏళ్ల వ‌య‌సులో జైల‌ర్‌లో ఫైట్స్ చేస్తే చ‌ప్ప‌ట్లు కొట్టారు. ర‌జినీకాంత్‌ది ఇండియ‌న్ స్క్రీన్ మీద ఏ స్థాయి అంటే , ఏం చేసినా లాజిక్ అడ‌గ‌రు. జ‌స్ట్ మ్యాజిక్ అంతే.
 
మ‌రి ఈ మాంత్రికుడు రాజ‌కీయాల్లో ఎందుకు ఫెయిల‌య్యారు?
చిరంజీవి, క‌మ‌ల్‌హాస‌న్ కూడా ఫెయిల‌య్యారు క‌దా. నిజ‌మే. కానీ వాళ్లు ఆడి ఓడారు. సూప‌ర్‌స్టార్ మైదానంలోకే రాలేదు. జీవితం, రాజ‌కీయం అన్నీ టైమింగ్ మీద న‌డుస్తాయి. ఎవ‌డూ మ‌న చేతికి వాచీ క‌ట్ట‌డు. మ‌న గ‌డియారాన్ని మ‌న‌మే త‌యారు చేసుకోవాలి. హార్డ్ వ‌ర్క్‌తో సినిమాల్లో అంచెలంచెలుగా ఎదిగిన సూప‌ర్‌స్టార్‌, రాజ‌కీయాల్లో టైమింగ్ మిస్స‌య్యారు. వ‌చ్చిన టైమ్‌ని కూడా వాడుకోలేక‌పోయారు. సినిమాల్లో సాహ‌సి, కానీ, రాజకీయాల్లో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టు నిరంతర ఊగిసలాటలో ఉండిపోయిన మనిషి. ఇది చెరుపుకోడానికి వీల్లేని ముద్ర‌. జ‌య‌ల‌లిత‌ని వ్య‌తిరేకించారు. 1996లో డీఎంకేకి మ‌ద్ద‌తిచ్చారు. 'ఈసారి జ‌య‌ల‌లిత అధికారంలోకి వ‌స్తే త‌మిళ‌నాడుని దేవుడు కూడా కాపాడ‌లేడు' అన్నారు. డీఎంకే గెలిచింది.
 
98లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూడా స‌పోర్ట్ చేసారు. ప‌డ‌య‌ప్ప(తెలుగులో నరసింహ) సినిమాలో ‘అతిగా ఆశ‌ప‌డే ఆడ‌ది’ డైలాగ్ ఎవ‌రిని ఉద్దేశించిందో అంద‌రికీ తెలుసు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వస్తార‌ని అప్ప‌టి నుంచి అభిమానులు ఎదురు చూశారు. అయితే ర‌జినీకాంత్‌కి ఓ ఇబ్బంది ఉంది. మ‌రాఠీ మూలాలున్న ఆయన బేసిక్‌గా క‌న్న‌డిగ. ప్రాంతీయ‌త‌ని విప‌రీతంగా ఆరాధించే త‌మిళ రాజ‌కీయాల్లో ఇమ‌డ‌గ‌ల‌నా లేదా అనే భ‌యం ఉంది. గ‌తంలో ఎంజీఆర్ మ‌లయాళి అని, క‌రుణానిధికి తెలుగు మూలాలున్నాయ‌ని వారి ప్రత్యర్థులు అప్పుడప్పుడు విమర్శనాపూర్వకంగా అంటుండేవారు. ర‌జినీకాంత్‌ని సినిమాల్లో నెత్తిన పెట్టుకున్న త‌మిళులు, రాజ‌కీయంగా కూడా అలాగే ఉంటారా అనేది అనుమానం. ఎందుకంటే ఆయ‌న పార్టీ పెట్టి పోటీ చేస్తే ముఖ్య‌మంత్రి కావాలి. లేదంటే అవ‌మానం. కావేరీ మంట‌లు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా, గ‌ట్టిగా మాట్లాడాలి.
 
సినిమాలో ఆయ‌న ఒక‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టే. కానీ ఆయ‌న వ్య‌క్తిగ‌త శైలి వేరు. వంద‌సార్లు ఆలోచించి ఒక‌సారి చెబుతారు. ఎవ‌రినీ అన‌లేరు. మాట ప‌డ‌లేరు. రాజ‌కీయాలు అలా లేవు. దుమ్మెత్తి పోస్తే త‌ప్ప నిల‌బ‌డ‌లేం. అవ‌త‌ల ప‌క్షం పోసే దుమ్ముని కూడా భ‌రించాలి. 2002లో కావేరి వివాదంపై ఆయ‌న ఒక రోజు దీక్ష చేశారు. ర‌జినీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యంపై అప్ప‌ట్లో భార‌తీరాజా విమ‌ర్శించారు. 2008లో పొగెనిక‌ల్ వివాదంపై కూడా దీక్ష చేసి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు. ఫ‌లితంగా కుశేల‌న్ సినిమాని క‌ర్ణాట‌క‌లో బ్యాన్ చేశారు. త‌ర్వాత ర‌జినీ క్ష‌మాప‌ణ చెప్పాల్సి వ‌చ్చింది. 2020లో పెరియార్‌పై విమ‌ర్శ‌లు చేసి త‌ల‌నొప్పి తెచ్చుకున్నారు. ఇవి మిన‌హా పెద్ద‌గా వివాదాలు లేవు.
 
2004లో బీజేపీకి ఓటు వేయ‌డం వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం అన్నారు. దాంతో బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. ఏ మాత్రం ప‌ట్టులేని త‌మిళ‌నాడులో ర‌జినీని ముందుకు తోసి పాగా వేద్దామ‌నుకుంటే కుద‌ర‌లేదు. త‌మిళ‌నాడులో స‌మ‌స్య ఏమంటే డీఎంకే, అన్నాడీఎంకే బలంగా ఉన్నాయి. మూడోపార్టీకి జాగా క‌ష్టం. అయితే జ‌య‌ల‌లిత తర్వాత అన్నాడీఎంకే బ‌ల‌హీన‌ప‌డింది. క‌రుణానిధి లేక‌పోయినా స్టాలిన్ బ‌లంగానే వున్నారు. పొలిటిక‌ల్ స్పేస్‌ని క‌రెక్ట్‌గానే వూహించినా 2017 డిసెంబ‌ర్ 31న ర‌జినీ మ‌క్క‌ల్ మండ్రం (ఆర్ఎంఎం) పార్టీని ప్ర‌క‌టించారు. అన్ని స్థానాల‌కి పోటీ చేస్తాన‌ని చెప్పారు. కానీ వ‌య‌సు, అనారోగ్యం మీద ప‌డ్డాయి. మ‌ధ్య‌లో కోవిడ్. పార్టీని నిర్మించే ఓపిక‌, స‌మ‌యం రెండూ లేవు. 12 జూలై 2021 పార్టీని ర‌ద్దు చేశారు. ఒక్క ఎన్నిక‌లో కూడా పాల్గొన‌కుండా ఆయన పార్టీ కాలంలో క‌లిసిపోయింది. పార్టీని నిల‌బెట్టుకుని ఎన్నిక‌ల్లో దిగి వుంటే 2026లో ఏమో ఏమై ఉండేదో, కానీ ఆయన ఆ ధైర్యం చేయలేకపోయారు. సినిమాల్లో ర‌జినీకాంత్ సూప‌ర్‌స్టారే. రాజ‌కీయాల్లో మాత్రం ఆ తారాజువ్వ ఎగరలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి ఆశీర్వాదం తీసుకుని ఢిల్లీ లాండ్ అయిన అల్లు అర్జున్

Manoj lost his way: దారి తప్పిన మనోజ్ : త్రిపురనేని చిట్టి బాబు

Laksmi Prasanna opinion: మంచు లక్ష్మీ ప్రసన్న ఆంతర్యం ఏమిటి?

నిఖిల్ స్వయంభూ లో సుందర వల్లిగా నభా నటేష్

Google Search: గ్లోబల్ లీడర్‌గా పవన్ కళ్యాణ్.. రిజిస్టర్ అయిన సీజ్ ది షిఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

అంతర్జాతీయ ఫర్నిచర్, డెకర్ ఉత్పత్తులపై రాయల్ఓక్ ఫర్నిచర్ 70 శాతం వరకు తగ్గింపు

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట తాగకల 5 పానీయాలు

Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments