Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా జోనస్: ‘‘తొలిసారి మగ నటులతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నా, బాలీవుడ్‌లో 10 శాతమే దక్కేది’’

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (16:26 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్న ప్రియాంకా చోప్రా, 22 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారిగా తన సహనటుడితో సమానంగా వేతనం పొందినట్లు బీబీసీతో చెప్పారు. త్వరలో విడుదల కానున్న అమెరికా స్పై వెబ్ సిరీస్ ‘సిటాడెల్’‌లో పోషించిన పాత్రకుగానూ తనకు, తన సహనటుడికి సమాన వేతనం ఇచ్చారని ఆమె వెల్లడించారు. భారత సినీ రంగంలో ఆమె స్టార్ నటి. 60కి పైగా బాలీవుడ్ సినిమాల్లో ప్రియాంక నటించారు. దశాబ్దం కిందట హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
 
అమెరికా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తోన్న కొంతమంది భారత నటుల్లో ప్రియాంక కూడా ఒకరు. ‘‘బాలీవుడ్‌లో నేనెప్పుడూ సమాన వేతనం అందుకోలేదు. నాతో నటించే నటుడికి ఇచ్చే వేతనంలో 10 శాతం మాత్రమే నాకు ఇచ్చేవారు. వేతనంలో ఈ వ్యత్యాసం నిజంగా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ అనేక మంది మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇప్పుడు బాలీవుడ్‌లో నటించినా నాక్కూడ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నా తరానికి చెందిన మహిళా నటులు సమాన వేతనాన్ని కోరారు. కానీ మాకు అది దక్కలేదు’’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.
 
బీబీసీ 100 మహిళలు-2022 జాబితాలో ప్రియాంకా చోప్రా కూడా చోటు దక్కించుకున్నారు. యువ నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అప్పటికే అక్కడ పాతుకుపోయిన ‘పితృస్వామ్య’ వ్యవస్థను అతి సాధారణంగా ఎలా పరిగణించారో ఆమె వివరించారు. ‘‘కెరీర్ తొలినాళ్లలో గంటల తరబడి సెట్‌లో అలా ఖాళీగా కూర్చోవడంలో తప్పేమీ లేదు అని నేను అనుకునేదాన్ని. కానీ, నా సహనటుడు మాత్రం తాను ఎప్పుడు సెట్‌లోకి రావాలి? ఎప్పుడు నటించాలి? అనే నిర్ణయాలు స్వయంగా తీసుకునేవారు’’ అని ఆమె చెప్పారు.
 
బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు శరీర రంగు ఆధారంగా బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘నన్ను ‘నల్ల పిల్లి’, ‘నలుపు శరీర ఛాయగల అమ్మాయి’’ అని పిలిచేవారు. మనుషులంతా గోధుమ రంగులో ఉండే దేశంలో నన్ను నలుపు అమ్మాయి అని పిలవడంలో అర్థం ఏంటి? నేను అందంగా లేనని అనుకున్నా. తెల్లగా ఉండే నా సహనటుల కంటే కూడా నాకు నైపుణ్యాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ... నేను ఇంకా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అనుకునేదాన్ని. ఎందుకంటే వ్యవస్థలో అలాంటి భావన అత్యంత సాధారణమైపోయింది.
 
కచ్చితంగా ఈ భావన మన వలస పాలకుల నుంచి వచ్చి ఉంటుంది. బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చి ఇంకా 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కాబట్టి అది ఇంకా మనలో అలాగే మిగిలి ఉందనుకుంటున్నా. ఇలాంటి అపోహలు తొలిగించడం, వాటిని మార్చడం మన తరం మీదే ఆధారపడి ఉంది. సమానత్వం అంశంలో తర్వాతి తరాలు శరీరం రంగును పరిగణలోకి తీసుకోకుండా చేయాల్సిన బాధ్యత మనదే’’ అని ఆమె వివరించారు. సమాన వేతనం అందించే విషయంలో హాలీవుడ్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయి ? అని చోప్రాను ప్రశ్నించగా ....
 
‘‘తొలిసారిగా నాకు సహ నటుడితో సమాన వేతనం లభించింది. హాలీవుడ్‌లో ఇది జరిగింది. తర్వాత ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. ఎందుకంటే, నేను కో-లీడ్‌గా నటించిన తొలి సిరీస్ ఇదే’’ అని యాక్షన్ ప్రధాన వెబ్ సిరీస్ అయిన సిటాడెల్‌లో తన పాత్ర గురించి ఆమె వివరించారు. దక్షిణాసియాలో లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి 10 ఏళ్లు కష్టపడాల్సి వచ్చింది. ‘‘నా అంతట నేనే మీటింగ్‌లకు వెళ్లాను. పరిచయాలు పెంచుకున్నా. యాక్టింగ్ కోచ్‌లు, మాండలికాన్ని మెరుగుపరిచే కోచ్‌లతో పని చేశాను. ఆడిషన్స్‌కు వెళ్తే తిరస్కరించారు. అప్పుడు ఏడ్చాను. తర్వాత మరో ఆడిషన్‌లో పాల్గొన్నా. కొత్త ఇండస్ట్రీలో స్థానం సంపాదించడం కోసం నేను చేయాల్సిందంతా చేశాను. ఇదొక రకమైన అనుభవం’’ అని ప్రియాంకా చోప్రా వివరించారు.
 
ప్రియాంకా చోప్రా 2015లో థ్రిల్లర్ సిరీస్ ‘క్వాంటికో’లో నటించడం ద్వారా అమెరికా టీవీ కార్యక్రమంలో లీడ్ క్యారెక్టర్ పోషించిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఆమె నిలిచారు. అనేక ప్రతిష్టాత్మక ఫ్యాషన్ మ్యాగజీన్‌ల కవర్ పేజీలో కనిపించిన తొలి భారతీయురాలు కూడా ఆమె. నటనలో వైవిధ్యం చూపించినప్పటికీ తనలాంటి వ్యక్తులకు హాలీవుడ్‌ మెయిన్‌స్ట్రీమ్‌లో చోటు దక్కించుకోవడం చాలా కష్టమని ఆమె చెప్పారు. ‘‘నేను ఇక్కడ కొంత నమ్మకాన్ని సాధించా. చాలామందికి నచ్చే ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నా. అది అందరి అభిమానాన్ని చూరగొంటుందో లేదో చూద్దాం. హాలీవుడ్‌లో దక్షిణాసియా లేదా భారతీయ నటిగా ఉంటూ పనిచేయడం చాలా కష్టం. ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది’’ అని ఆమె చెప్పారు.
 
ఒక అంతర్జాతీయ సెలెబ్రిటీగా ప్రపంచ సమస్యలపై తరచుగా గళం విప్పే ప్రియాంకా చోప్రా జోనస్‌, భారత్‌లోని అంశాల పట్ల మాట్లాడకపోవడంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విమర్శ గురించి ఆమె స్పందించకుండా ఈ సమయంలో ఆమె న్యాయ నిపుణుడు జోక్యం చేసుకున్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే అనుకూల, ప్రతికూల స్పందనల గురించి ఆమె స్పందించారు. ‘‘నువ్వు దాని గురించి స్పందించలేదు, దీని గురించి మాట్లాడలేదు, నువ్వు ఈ అంశం గురించి అలా మాట్లాడావు, ఇలా మాట్లాడావు అని వేలెత్తి చూపే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఉంటారు. మనం ప్రతీ ఒక్కరికీ నచ్చేలా ఉండలేం’’ అని అన్నారు.
 
గ్లోబల్ యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంకా చోప్రా జోనస్, లఖ్‌నవూలోని విద్యార్థినులను కలిసేందుకు స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను సందర్శించినప్పుడు బీబీసీతో మాట్లాడారు. ఆమె 15 ఏళ్లుగా యూనిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్నారు. సంక్షోభం, ప్రకృతి విపత్తులతో ప్రభావితమైన చిన్నారులను కలిసేందుకు ఆమె భారత్‌తో పాటు జింబాబ్వే, ఇథియోపియా, జోర్డాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాలకు ప్రయాణించారు. ‘‘నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఉన్నాను? అనే అంశాలను తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం నేను వేదికలను ఉపయోగించుకుంటా. ముఖ్యంగా చిన్నారుల గళాన్ని నేను వినిపిస్తా. ఇదే నా జీవితంలో అత్యంత ముఖ్యమైన పని’’ అని ఆమె వివరించారు. బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments