Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఒకవైపు లాక్‌డౌన్, మరోవైపు కరోనావైరస్ భయం, ఇవి చాలవన్నట్లు బాయ్‌ఫ్రెండ్ గోల..’

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:59 IST)
27 ఏళ్ల మోనిక(గోప్యత కోసం పేరు మార్చాం)కు సరిగ్గా లాక్‌డౌన్ సమయంలోనే ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయ్యింది. దానికి తోడు ఆమెకు ఆటోఇమ్యూన్ సమస్యలు కూడా ఉన్నాయి. శారీరక అనారోగ్యం, మానసిక వేదన ఒకేసారి ఆమెను చుట్టుముట్టాయి. బీబీసీ తెలుగుతో మాట్లాడిన మోనిక.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమిళనాడులోని రాయవెల్లూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాని చెప్పారు.

 
"లాక్‌డౌన్ సమయంలోనే నేను డాక్టర్‌ను కలవాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో వైద్య పరీక్షలు ఎలా చేయించుకోవాలో నాకు అర్థం కాలేదు. వైరస్ సోకుతుందేమోననే భయం, వైరస్ సోకితే, నాకున్న అనారోగ్య సమస్యలతో అసలు బతకనేమో అనే ఆలోచన నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశాయి". ఒకవైపు ఆరోగ్య సమస్యల గురించి ఒత్తిడికి గురైన సమయంలోనే ఆమెకు బాయ్‌ఫ్రెండ్‌తో కూడా బ్రేకప్ అయ్యింది.

 
“బతుకుతావో లేదో తెలీని నీతో జీవితాన్ని పంచుకోలేనని చెప్పిన నా బాయ్‌ఫ్రెండ్ మాటలు నన్ను మరింత ఒత్తిడికి గురి చేశాయి. నాకు సినిమా డైరెక్షన్ రంగంలో పని చేయాలని, రచయిత కావాలని ఉండేది. ప్రేమించిన వ్యక్తి దూరమవడంతో జీవితమే వృథా అనిపించింది” అని మోనిక చెప్పారు.

 
ఆ పరిస్థితుల్లో ఏంచేయాలో తోచలేదు. తల్లిదండ్రులతో నా బాధను పంచుకుని వారిని మరింత బాధపెట్టాలని అనిపించలేదని ఆమె తెలిపారు. “జీవితం మీద ఆశ చచ్చిపోవడంతో గూగుల్‌లో "హౌ టూ కిల్ మైసెల్ఫ్" (నన్ను నేను చంపుకోవడం ఎలా) అని వెతకడం మొదలుపెట్టాను. కానీ, అలా వెతుకుంటే, నాకు గూగుల్‌లో 'సూసైడ్ హెల్ప్ లైన్' నంబర్లు దొరికాయి. వాటికి కాల్ చేస్తే ఒక్క నంబర్ కూడా పని చేయలేదు”.

 
“నేను స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చాలా ఒత్తిడి ఉంటుంది. మామూలుగా అయితే కాలేజీకి వెళ్తుంటాను కాబట్టి పనిలో తలమునకలై ఉంటాను. కానీ, లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటంతో ఆందోళనగా ఉండేది. ఏవేవో ఆలోచనలు నన్ను చుట్టు ముట్టేవి” అన్నారు మౌనిక. “జీవితంలో ఏమీ సాధించలేకపోయానే అనిపించింది. తీవ్రమైన నిరాశ ఆవరించింది”.

 
2016లో అనారోగ్య సమస్యల కారణంగా ఆమె 25 రోజులు వెంటిలేటర్‌పై కూడా ఉన్నానని చెప్పారు. కష్టపడి కాపాడిన తల్లిదండ్రులతో తన సమస్యను చర్చించాలని ఆమె నిర్ణయించుకున్నారు. తల్లి కౌన్సిలింగ్‌కి వెళితే బాగుంటుందని సూచించడంతో ఆమె ఆన్‌లైన్‌లోనే ఒక ప్రైవేట్ మానసిక నిపుణుడి దగ్గర కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కౌన్సిలింగ్ తర్వాత జీవితం మీద తనకు అప్పటి వరకూ ఉన్న దృక్పథం మెల్లగా మారిందని అంటున్నారు మౌనిక.

 
"సంతోషాన్ని వెతుక్కునే అతడి హక్కును నేనెలా కాదనగలను అనిపించింది. కానీ, వైరస్ భయం మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. వైరస్ వల్ల చనిపోవాల్సి వస్తే చనిపోతాం" అనే ఆలోచన వచ్చింది అని ఆమె చెప్పారు. మహావీర్ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం సెక్రటరీ జనరల్ జుగల్ కిషోర్ నేతృత్వంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , ఆయూష్ మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సంయుక్తంగా 'కోవిడ్-19 మానసిక ఒత్తిడి’పై ఏప్రిల్‌లో ఒక సర్వే నిర్వహించింది.

 
ఈ సర్వేలో దేశంలో 51 శాతం మంది లాక్‌డౌన్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. గూగుల్ ఆన్‌లైన్ డాక్యుమెంట్ల ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో దిల్లీలో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు జుగల్ కిషోర్ బీబీసీ న్యూస్ తెలుగుకి తెలిపారు. "ఈ సర్వేలో 78 శాతం మంది కరోనావైరస్ భయంతో ఒత్తిడికి గురయ్యారు. ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని లాక్ డౌన్ జనాలపై తీవ్ర ఒత్తిడికి కారణమయ్యింది" అని జుగల్ కిషోర్ తెలిపారు.

 
కుటుంబం గురించి ఆందోళన, భౌతిక దూరం, వైరస్‌కి చికిత్స లేకపోవడం, నిరుద్యోగం, నిస్సహాయత కారణంగా చాలామంది ఒత్తిడికి గురైనట్లు సర్వే ఫలితాల్లో తేలిందని ఆయన చెప్పారు. “లాక్‌డౌన్లో ప్రజల మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. మానసిక అనారోగ్యానికి గురైనవారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం జులైలో ఒక మోడ్యూల్ విడుదల చేసింది" అన్నారు జుగల్ కిషోర్. కోవిడ్-19 చికిత్సా కేంద్రాలలో కౌన్సిలర్లు తప్పనిసరిగా ఉండాలని ఆయన చెబుతున్నారు.

 
లాక్‌డౌన్ సమయంలో మోనిక ఇంటి పరిసరాల్లో 200 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంట్లో అందరికీ లాక్‌డౌన్ సమయంలో జ్వరం కూడా వచ్చింది. దాంతో వారి భయం ఇంకా పెరిగింది. వైరస్ పాజిటివ్ రాకపోవడంతో ఆన్‌లైన్‌లోనే వైద్యుల సలహా తీసుకుని మందులు వాడామని ఆమె చెప్పారు. “కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడానికి బయటకు వెళ్లాలన్నా మాకు భయం వేసింది” అన్నారు మౌనిక.

 
“లాక్‌డౌన్ సమయంలో నాకు బాగా కావల్సిన ఒక వ్యక్తి తన తండ్రిని కోల్పోయారు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. అదంతా కలిసి నాలో చాలా ఒత్తిడి పెరిగింది. అది తగ్గడానికి నేనింకా స్టెరాయిడ్స్, అప్పుడప్పుడూ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నా" అని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ఆరోగ్యంగా ఉన్న కొంతమంది వృద్ధులు కూడా తాము ఒత్తిడికి గురైనట్లు చెప్పారు.

 
లాక్‌డౌన్‌లో జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత మానసిక ఒత్తిడికి గురయ్యానని చెన్నైలో ఉంటున్న 78 ఏళ్ల రావ్(పేరు మార్చాం) చెప్పారు. భార్య, కూతురు కూడా చనిపోవడంతో అల్లుడు, మనవరాలితో కలిసి ఉంటున్నట్లు ఆయన తెలిపారు.

 
"నాకు బీపీ, షుగర్ లాంటివి ఏవీ లేవు, కానీ, లాక్‌డౌన్‌లో ఒంటరితనం కమ్మేసింది. మాట్లాడటానికి ఎవరూ ఉండేవారు కాదు. నా దినచర్య పూర్తిగా మారిపోయింది. ప్రతి రోజూ బీచ్‌లో వాకింగ్‌ కోసం వెళ్లే నేను ఇంటికే పరిమితం అయిపోయాను. నాలుగు గోడల మధ్యే ఉండిపోయాను. దానికి తోడు ప్రతి రోజు పేపర్లో చదివే వార్తలు నన్ను మరింత కలవర పెట్టాయి. దాంతో, తెలీకుండానే శారీరకంగా అలసట, బడలిక వచ్చేసింది" అని రావ్ చెప్పారు.

 
“బంధువులు ఎవరు ఫోన్ చేసినా.. నాకు తెలీకుండానే గట్టిగా ఏడ్చేసేవాడిని, మళ్ళీ సొంత ఊరు వెళ్లగలనా? బంధువులందరినీ చూడగలనా అనే దిగులు వచ్చేసింది” అన్నారు రావ్. "నాలో వచ్చిన ఆ మార్పును మా కుటుంబ సభ్యులకు చెప్పాను. దాంతో వాళ్లు మాతో, స్నేహితులతో తరచూ మాట్లాడుతూ ఉండాలని సలహా ఇచ్చారు. దాంతో, అందరితో ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాను. వృద్ధులను బయటకు రావద్దని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తుండటంతో ఇంటికే పరిమితమైపోయాను. అయినా యోగా, ప్రాణాయామం మాత్రం మానలేదు” అంటున్నారు రావ్.

 
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక 52 ఏళ్ల మహిళ తన భర్తకు వైరస్ సోకిందనగానే తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు. ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండి వైద్యం తీసుకుంటున్నా భౌతిక దూరం పాటించడం, కోవిడ్-19 రోగుల పట్ల ఉన్న సామాజిక రుగ్మత ఆమెని తీవ్రంగా కలచివేశాయని ఆమె కుమారుడు శరత్ చంద్ర తెలిపారు.

 
‘‘ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితి నుంచి, గదిలోకి భోజనం అందించడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. సరిగా తినడం, నిద్రకూడా లేకుండాపోయింది. తండ్రికి వైద్యం అందుతున్నా, హాస్పిటల్‌కి వెళ్లే స్తోమత ఉన్నా చుట్టు పక్కల వారు, బంధువులు ఏమనుకుంటారో అనే భయం మా అమ్మను మరింత వేధించింది’’.

 
“కరోనా ఉందని తెలిస్తే, ఇంటి చుట్టూ కంచె వేస్తారా? వైరస్ ఉందని ఇంటి ముందు స్టాంప్ వేస్తారా? పక్కింటి వారు ఎలా చూస్తారు లాంటి ఆలోచనలతో చాలా ఒత్తిడికి గురయ్యాం. ఆఖరికి ఒక దశలో మా ఇంటి ముందు నుంచి వెళ్ళడానికి కూడా జనం భయపడుతుంటే చాలా మానసిక వేదనకు గురయ్యాం” అన్నారు శరత్. తన తల్లికి ధైర్యం చెప్పడం కోసం తెలిసిన మానసిక వైద్యుల దగ్గర కౌన్సిలింగ్ కూడా ఇప్పించామని శరత్ వివరించారు.

 
ఇప్పుడు ఆయన తండ్రి కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కానీ, ఆ సమయంలో అనుభవించిన ఒత్తిడిని మాత్రం ఆ కుటుంబం మర్చిపోలేకపోతోంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఒక వ్యక్తి కరోనాతో మరణించినప్పుడు, అతడి అంత్యక్రియలకు ఎవరూ హాజరవ్వలేదనే బాధతో మృతుడి భార్య, కొడుకు, కూతురు కూడా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.

 
లాక్‌డౌన్‌ అమలు చేయడానికి ఒక్కోసారి పోలీసులు అవలంబించిన విధానాలు కూడా ప్రజలను భయాందోళనలకు గురి చేశాయని జుగల్ కిషోర్ చెప్పారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ మానవీయ విధానాలతో ఉండాలి. కానీ నిర్బంధ విధానాలతో కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "క్వారంటైన్‍‌లో ఎలా ఉండాలో వైద్య సిబ్బంది చెప్పాలి కానీ, పోలీసులు కాదు. ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపాయి" ఆయన అన్నారు.

 
డిప్రెషన్ అంటే ఏమిటి?
సాధారణంగా ఒత్తిడి చాలా సందర్భాల్లో ఉంటుంది. పరీక్షలు జరిగేటప్పుడు, ఆఫీసులో పనిలో, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, దాడి సమయంలో, ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు ఒత్తిడి ఉంటుంది. కానీ, ఆ ఒత్తిడి తీవ్రం అయినప్పుడు శారీరకంగా, లేదా మానసికంగా ఒత్తిడి ఏర్పడవచ్చు" అని కేజీహెచ్ సైకియాట్రీ విభాగం హెడ్ డాక్టర్ నడుకూరు రాజు బీబీసీకి చెప్పారు.

 
కరోనావైరస్ వ్యాపించిన సమయంలో చాలామంది ఇలాంటి ఒత్తిడికే గురయ్యారు. దీర్ఘకాలం ఆ ఒత్తిడిలో ఉండటం వల్ల, అది ఒక ఫోబియాగా మారే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. దాంతో శారీరక సమస్యలు కూడా మొదలవుతాయి” అని ఆయన చెప్పారు. 

 
డిప్రెషన్ లక్షణాలు
గుండె దడ, చెమటలు పట్టడం
పీడకలలు రావడం
ఆందోళనకరమైన ఆలోచనలు రావడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడిగా చెప్పవచ్చని ఆయన తెలిపారు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

 
కుటుంబం, స్నేహితులతో తమకు ఎదురవుతున్న సమస్యను చర్చించి వారి సహకారం తీసుకోవచ్చు. కౌన్సెలింగ్ కంటే కూడా ఒత్తిడి గురించి ఒక అవగాహన ఉండడం మంచిది. ఎలాంటి పరిస్థితికి అయినా మనం సంసిద్ధంగా ఉండాలి. ఒకవేళ వైరస్ మనకు సోకితే ఏం చేయాలో ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉండాలి. అలా ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

 
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక క్రమబద్ధమైన జీవితం, సరైన ఆహారం, వ్యాయామం, సామాజిక సంబంధాలు కొనసాగించడం, నిత్య జీవితంలో భాగంగా ఉంటే దేనినైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. మానసిక నిపుణులను కలవడం చివరి అస్త్రం. కానీ, ఒక స్నేహితుడు, లేదా బంధువుతోనో తమ సమస్యను చర్చించడం మేలు.
 
(కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments