Webdunia - Bharat's app for daily news and videos

Install App

మియన్మార్‌‌‌లో మిలటరీ పాలన, ఆంగ్ సాన్ సూచీ అరెస్ట్

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (15:37 IST)
మియన్మార్ సైన్యం దేశాన్ని తమ అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. ఆంగ్ సాన్ సూచీతో పాటు ఇతర రాజకీయ నాయకులను సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న తరువాత సైన్యం ఈ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికలు వివాదాస్పదం కావడంతో ప్రజా ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ పర్యవసానంగా దేశంలో సైనిక తిరుబాటు జరిగింది.

 
అరెస్టులు జరిగిన కొన్ని గంటల తరువాత సైనికాధికురులు టెలివిజన్‌లో కనిపించి, వచ్చే ఏడాది వరకు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. బర్మా అని కూడా వ్యవహరించే మియన్మార్‌లో 2011 నుంచి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రారంభమయ్యేంత వరకు సైనిక పాలనే కొనసాగింది. సూచీ ఎన్నో ఏళ్లపాటు గృహనిర్బంధంలో ఉన్నారు.

 
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఆఫ్ డెమాక్రసీ (ఎన్ఎల్‌డీ)కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు లభించాయి. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు దిగువ సభ సభ్యులు తొలిసారిగా సోమవారం సమావేశం కావల్సి ఉంది. దీన్ని వాయిదా వేస్తున్నట్లు మిలటరీ ప్రకటించింది. కమాండర్-ఇన్-చీఫ్ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌కు అధికారం అప్పగిస్తున్నట్లు తెలిపింది.

 
రాజధాని నగర వీధుల్లో సైన్యం
రాజధాని నైపీవయైటా, యాంగాన్ నగరాల్లో సైనికులు వీధుల్లోకి వచ్చారు. ప్రధాన నగరాల్లో కొన్ని మొబైల్ ఇంటర్నేట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో తమ ప్రసారాలు ఆగిపోయినట్లు జాతీయ టీవీ చానల్ ఎంఆర్‌టీవీ చెప్పింది. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని సైన్యం గతవారం హామీ ఇచ్చినప్పటికీ, ఇది పూర్తి స్థాయి సైనిక తిరుగుబాటులాగే ఉందని బీబీసీ ఆగ్నేయాసియా ప్రతినిధి జోనాథన్ హెడ్ చెప్పారు.

 
"రాజ్యాంగం ప్రకారం సైన్యానికి అత్యవసర స్థితి ప్రకటించడానికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. కానీ ఆంగ్ సాన్ సూచీ లాంటి రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించడం లాంటివి రెచ్చగొట్టే, చాలా ప్రమాదకరమైన చర్యలు అవుతాయి. దానిపై తీవ్ర వ్యతిరేకత రావచ్చు" అన్నారు.

 
ఆంగ్ సాన్ సూచీని, అధ్యక్షుడు విన్ మ్యింట్, ఇతర నేతలను సైన్యం వేకువ జామున అదుపులోకి తీసుకున్నట్లు రాయిటర్స్‌తో ఫోన్లో మాట్లాడిన ఎన్ఎల్డీ ప్రతినిధి మ్యో న్యుంట్ చెప్పారు."దూకుడుగా స్పందించవద్దని నేను మా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్లు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నాను. నన్ను కూడా అదుపులోకి తీసుకోవచ్చు" అన్నారు. వివిధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రుల నివాసాలకు కూడా వెళ్లిన సైనికులు వారిని కూడా తీసుకువెళ్లారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు.

 
ఎన్నికల్లో ఏం జరిగింది?
నవంబర్ 8న జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ 83 శాతం స్థానాల్లో విజయం సాధించింది. చాలామంది ఈ ఎన్నికలను సూచీ ప్రభుత్వానికి రెఫరెండంగా చూశారు. ఇవి 2011లో దేశంలో సైనిక పాలన అంతమైన తర్వాత జరిగిన రెండో ఎన్నికలు. కానీ, ఎన్నికల ఫలితాలతో సైన్యం విభేదించింది. అధ్యక్షుడికి, ఎన్నికల సంఘం అధ్యక్షుడికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపించిన సైన్యం ఇటీవల చర్యలు చేపడతామని బెదిరించడంతో దేశంలో సైనిక తిరుగుబాటు జరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఎన్నికల సంఘం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.

 
దేశంలోని అతిపెద్ద నగరం యాంగాన్‌లో ఫోన్ లైన్లు, ఇంటర్నెట్ సరిగా పనిచేయడం లేదు. దేశంలోని చాలా మొబైల్ ప్రొవైడర్లు తమ సేవలు కట్ చేస్తున్నాయి. రాబోవు రోజుల్లో నగదు ఇబ్బందులు ఉండవచ్చనే అంచనాలతో యాంగాన్‌లో ప్రజలు ఏటీఎంలలో డబ్బులు తీసుకోడానికి పరుగులు తీస్తున్నారు. కొన్ని ఏటీఎంలు ఇప్పటికే పనిచేయడం లేదు. బ్యాంకులు తెరుస్తారో లేదో ఇంకా స్పష్టత రాలేదు.

 
మియన్మార్‌లో అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకునే చర్యలతో పాటు.. స్టేట్ కౌన్సెలర్‌ ఆంగ్ సాన్ సూచీ ఇతర ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయటం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. బర్మాలో తాజా పరిణామాలను జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారు. ''బర్మా ప్రజాస్వామ్య వ్యవస్థలకు మా బలమైన మద్దతు కొనసాగుతుంది. మిగతా భాగస్వాములు ప్రజాస్వామ్య విధానాలకు, చట్టాల అమలుకు కట్టుబడి ఉండాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం.

 
ఇటీవలి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయటానికి చేసే, ప్రజాస్వామ్యానికి బదిలీ అవటాన్ని నిరోధించే ఎటువంటి ప్రయత్నాలనైనా అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇటువంటి చర్యలను ఉపసంహరించకపోతే అందుకు బాధ్యులైన వారికి వ్యతిరేకంగా అమెరికా చర్యలు చేపడుతుంది. పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రజాస్వామ్యం కోసం, శాంతి కోసం పరితపిస్తూ ఇప్పటికే ఎన్నో కష్టాలను భరించిన బర్మా ప్రజలకు మద్దతునిస్తున్నాం'' అని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది.

 
అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలి: ఆమ్నెస్టీ
ఆంగ్ సాన్ సూచీ, ఇతర రాజకీయ ప్రముఖులను నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఆందోళనకరం. అంతర్జాతీయ చట్టం కింద గుర్తించగల క్రిమినల్ నేరాభియోగాలు మోపగలిగితే తప్ప వారిని తక్షణమే విడుదల చేయాలి'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది.

 
''వారి అరెస్టుకు గల చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటో మియన్మార్ సైన్యం వివరించి తీరాలి. అరెస్టయిన వారి హక్కులను పూర్తిగా గౌరవిస్తామని భరోసా ఇవ్వాలి. వారు, వారి కుటుంబం కోరుకున్న న్యాయవాదులను నియమించుకునే హక్కును కాపాడాలి. వారు ఎక్కడ ఉన్నారో నిర్ధారించాలి. వారికి వైద్య సదుపాయాలు కల్పించాలి'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ మింగ్ యూ హా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

 
''మియన్మార్‌ ప్రజలు తీవ్ర సైనిక అణచివేత ముప్పును ఎదుర్కొంటున్నారు. తాజా పరిణామాలు.. సైనిక అధికారులు ఎటువంటి అసమ్మతినీ సహించబోరనే భయానక సందేశాన్నిస్తున్నాయి. మియన్మార్‌లో గత సైనిక కుట్రలు, సాయుధ చర్యల వల్ల.. సాయుధ బలగాలు భారీ స్థాయి హింసకు, హత్యలకు పాల్పడ్డాయి. సాయుధ బలగాలు సంయమనం పాటించాలని, అంతర్జాతీయ మానవ హక్కులకు, మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని మేం కోరుతున్నాం'' అని పేర్కొన్నారు.

 
''టెలీకమ్యూనికేషన్లను నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు.. ప్రత్యేకించి మహమ్మారితో పోరాడుతున్న మియన్మార్‌ ప్రజానీకానికి మరో ముప్పుగా పొంచివుంది. ఇది.. సాయుధ బృందాలకు వ్యతిరేకంగా సాగుతున్న అంతర్గత సంఘర్షణ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను ప్రమాదంలోకి నెడుతోంది. ఫోన్, ఇంటర్నెట్ సేవలను తక్షణమే పూర్తి స్థాయిలో పునరుద్ధరించటం అత్యంత అవసరం'' అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments