Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం: ఇప్పటివరకు 17 మంది మృతి

బిబిసి
గురువారం, 22 ఆగస్టు 2024 (10:59 IST)
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌'లో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తొలుత ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించినా, సాల్వెంట్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవించినట్టు హోం మంత్రి అనిత తెలిపారు.
 
రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా పూర్తయ్యాయని ఆమె చెప్పారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని చెప్పారు. ఎస్ఈజెడ్ లోని చాలా కంపెనీలకి సేఫ్టీ ఆడిటింగ్ జరగడం లేదని, సేఫ్టీ ఆడిటింగ్ చేస్తే అసలు ఈ కంపెనీ యాజమాన్యాలు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు.
 
రియాక్టర్ పేలుడు కాదు..
ప్రమాదానికి కారణం ఏమిటో హోం మంత్రి మీడియాకు వివరించారు. ‘‘కంపెనీలో సాల్వెంట్స్ లీకేజీలు జరుగుతుంటాయి. వీటిని అరికట్టడానికి ప్రయత్నిస్తుండగా, టీబీఇ అనే గ్యాస్ ఫామ్ అయింది. ఈ గ్యాస్ పైపులైన్ల నుంచి ఏసీల్లోకి వెళ్ళి, అది పై అంతస్తు నుంచి కిందివరకూ వ్యాపించింది. ఈగ్యాస్‌కు , ఎలక్ట్రిక్ స్పార్క్‌ తగిలి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది’’ అని హోం మంత్రి మీడియాకు తెలిపారు.
 
‘‘చాలామంది రియాక్టర్ పేలుడు అన్నారు. ఇది కేవలం గ్యాస్ లీకేజీవల్ల జరిగిన సంఘటన. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా, లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనేది విచారణలో తేలుతుంది. పేలుడు ధాటికి భవనం మొత్తం కూలిపోలేదు. పై రూఫ్, గోడలు కూలిపోయాయి. నేను వెళ్ళి చూసొచ్చాను. ఇప్పుడు భవనం పిల్లర్స్ పై ఉంది. గ్యాస్ లీకేజీ కారణంగా కొందరు చనిపోతే గోడశిథిలాల కింద నలిగిపోయి కొందరు చనిపోయారు. శకలాలను తొలగించే పనిలో రెస్క్యూ బృందాలు ఉన్నాయి.’’ అని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారని హోం మంత్రి మీడియాకు చెప్పారు.
 
‘అన్నయ్యను చివరి చూపు చూడలేకపోయా’
ఎంతో దూరం నుంచి అన్నయ్యకు రాఖీ కట్టాలని వచ్చాను. కానీ ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయా. తరువాత రోజు నేను నిద్రలేచే సరికే అన్నయ్య ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఎంతో దూరం నుంచి వచ్చి కూడా అన్నయ్యను పొద్దున్నే చూడలేకపోయా అని ప్రమాదంలో మృతి చెందిన టెక్నిషియన్ వెంకటసాయి చెల్లెలు కిరణ్మయి ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ‘‘రాఖీ కట్టడానికి అంత దూరం నుంచి వచ్చాను. ఆ రోజురాత్రి 9.30గంటలైపోయింది. దీంతో రాఖీ కట్టాకా నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. నెక్ట్స్ డే ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
 
రాత్రి ఆఫీసు నుంచి వచ్చాక కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. తరువాత నిద్రపోయాడు. నేను ఉదయం 8గంటలకు నిద్రలేచే సరికే మా అన్నయ్య ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఒకసారి మొహం కూడా చూడలేదు. ఎవరి నుంచి ఎటువంటి అధికారిక సమాచారమూ లేదు. వీళ్ళు, వాళ్ళు చెప్పడమే తప్ప మా అన్నయ్య ఏమయ్యాడనే విషయం మాకు యాజమాన్యం నుంచి తెలియలేదు. ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా వారు స్పందించలేదు.’’ అని ఆమె చెప్పారు. నా కొడుకును చూడకుండా ఇంటికి వెళ్ళను అని వెంకటసాయి తల్లి చెప్పారు. దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు. నిన్నటి నుంచే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టాం ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది అని ఆమె భోరుమన్నారు.
 
భోజన విరామ సమయంలో ప్రమాదం
'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌' ఫ్యాక్టరీ రెండు షిఫ్టులలో 381 మంది ఉద్యోగులతో పనిచేస్తుంటుంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా కమ్ముకుంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని ఒక అంతస్తు కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని సూచించారు. హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీలో ఇంటర్మీడియట్ రసాయనాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను తయారు చేస్తారు. ఇది ఏప్రిల్ 2019 లో 200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది.
 
ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశాలు
అచ్యుతాపురం ప్రమాద ఘటనపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశించారు. ప్రమాద విషయం తెలియడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి, సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. భద్రత ప్రమాణాలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పవన్ సూచించారు.
 
అనకాపల్లి జిల్లాలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) దాదాపు 10 వేల ఎకరాల్లో ఏర్పాటైతే, అందులో 3 వేల ఎకరాలు ఫార్మా సెజ్‌కు కేటాయించారు. దీనినే అచ్యుతాపురం ఫార్మా సెజ్ అంటారు. రసాయనాల తయారీ, నిల్వ చేసే ఇక్కడి ఫ్యాక్టరీలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్
స్థానిక ఆసుపత్రిలో రెండు మృతదేహాలు ఉన్నాయని, ఘటన స్థలం నుంచి అంబులెన్స్‌లో రెండు మృతదేహాలను తీసుకెళ్లారని అక్కడి కార్మికులు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ సెజ్‌లో ఎక్కువగా ఫార్మా కంపెనీలే ఉన్నాయి. గత ఏడాది ఇక్కడి సాహితి సాల్వెంట్స్ కంపెనీలో నలుగురు మరణించారు. మొత్తంగా ఈ సెజ్‌లో 208 కంపెనీలున్నాయి. ఇన్ని కంపెనీలున్నప్పటికీ ఇక్కడ ఒక్క అగ్నిమాపక వాహనం మాత్రమే ఉంది. దీంతో చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటలను ఆర్పారు.
 
ఆగని ప్రమాదాలు
అనకాపల్లి జిల్లాలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లోని రసాయనాల తయారీ, నిల్వ చేసే ఈ ఫ్యాక్టరీలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
గత పదేళ్లలో జరిగిన ప్రమాదాలు:
2014 డిసెంబరు 27న మైలాన్ కంపెనీలో భారీ పేలుడు..ఇద్దరు మృతి
2019 ఏప్రిల్ 8న ఏషియన్ పెయింట్స్ కంపెనీ ప్రమాదం...ఒకరి మృతి
2020 జనవరి 14న సన్వీరా లిమిటెడ్ కంపెనీ చిమ్నీ కూలి ఒకరు మృతి
2021 జూలై 23న వశిష్ట ఫార్మాలో ప్రమాదం...ఒకరి మృతి
2022 జూన్, ఆగస్టులలో 'సీడ్స్' కంపెనీలో రెండు సార్లు విష వాయువు లీక్, 500 మందికి పైగా మహిళ కార్మికులకు అస్వస్థత
2022 అక్టోబరు 22న సెయింట్ గ్లోబైన్ కంపెనీలో గ్యాస్ లీక్, ఒకరి మృతి
2023 జనవరి 11న జీఎంఎఫ్సీ ల్యాబ్‌లో బాయిలర్ పేలుడు, ఒకరి మృతి
2023 ఫిబ్రవరిలో మిథాన్ ఫెర్రోస్ ఫార్మాలో ప్రమాదం, ఒకరి మృతి
2023 జూన్ రెండోవారం అభిజిత్ ఫెర్రో కంపెనీలో ప్రమాదం...ఒకరి మృతి
2023 జూన్ 30న సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు, 4గురు మృతి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా, మనసుకు నచ్చితే వస్తా, తగ్గేది లే : అల్లు అర్జున్

నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి " పవన్ కళ్యాణ్

నేను-కీర్తన ట్రైలర్ కు అనూహ్య స్పందన

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బిగ్ బాస్ ప్రారంభం.. వినోదం మస్తు

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా దేవ్‌గిల్ పాన్ ఇండియా చిత్రం అహో! విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తమలపాకు బరువును తగ్గిస్తుంది.. నోటి దుర్వాసన పరార్

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటున్నారా?

సబ్జా గింజలు మిల్క్ షేక్ తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్ల రసాలు తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

అలాంటి స్త్రీలు పుట్టగొడుగులు తినకూడదు

తర్వాతి కథనం
Show comments