Webdunia - Bharat's app for daily news and videos

Install App

లద్దాఖ్‌: 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన గ్రామం కథ

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (18:24 IST)
తుర్‌తుక్.. భారతదేశపు ఉత్తర అంచున లద్దాఖ్‌లోని నుబ్రా లోయకు చిట్టచివరన ఉన్న చిన్న ఊరిది. కారకోరం పర్వత శ్రేణుల్లో షియాక్ నదిని ఆనుకుని ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు నెలవు. ఈ ఊరికి వెళ్లాలన్నా.. అక్కడ నుంచి తిరిగిరావాలన్నా ఎగుడుదిగుడుగా ఉండే ఒకే ఒక్క రోడ్డు ఆధారం. ఈ అందమైన గ్రామం 1971 వరకు పాకిస్తాన్‌లో ఉండేది. నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో భారత్ ఈ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది.

 
లద్దాఖ్‌ ఎక్కువగా బౌద్ధులుండే ప్రాంతమైనా అందుకుభిన్నంగా ఇక్కడ స్థానిక బాల్టిస్ తెగ ప్రజలు, సూఫీ వర్గానికి చెందిన నూర్ బక్షి ముస్లింలు ఉంటారు. బాల్టిస్ తెగ జనాభా ఎక్కువగా పాకిస్తాన్‌లోని స్కర్దు ప్రాంతంలో ఉంటారు. ఈ తెగ మూలాలు టిబెట్‌లో ఉన్నాయి. ఈ గ్రామస్థులు మాట్లాడే భాష బాల్టి. సరిహద్దు భద్రత దృష్ట్యా ఈ గ్రామాన్ని భారత్ పాకిస్తాన్‌కు తిరిగివ్వలేదు. గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాయి.

 
2010లో ఈ గ్రామాన్ని సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించడం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ఇల్లు, ప్రహరీలు అన్నీ కారకోరం పర్వతాల రాళ్లతోనే నిర్మితమై ఉంటాయి. పొలాలకు నీళ్లు మళ్లించే చిన్నచిన్న సాగునీటి కట్టలూ రాతితోనే నిర్మితమై కనిపిస్తాయి. లద్ధాఖ్‌లో సముద్రమట్టానికి ఎంతో ఎత్తున ఉండే ఇతర ప్రాంతాలతో పోల్చితే తుర్‌తుక్ సముద్ర మట్టం నుంచి కాస్త తక్కువ ఎత్తులోనే ఉంటుంది.

 
సముద్రమట్టం నుంచి 2,900 మీటర్ల ఎత్తున ఉంటుందీ ప్రాంతం. ఈ ఎత్తులో ఉండే ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఇక్కడి వారు తమ ఆహారాన్ని పాడవకుండా ఉంచేందుకు కొన్ని ప్రత్యేకమైన శీతలీకరణ పద్ధతులు పాటిస్తారు. రాళ్లతో చిన్నచిన్న బంకర్లలాంటివి నిర్మించి అందులో మాంసం, పెరుగు వంటివి నిల్వ చేస్తారు. ఈ బంకర్ల నిర్మాణంలో రాళ్ల మధ్య చిన్నచిన్న ఖాళీలు ఉంచడంతో దాని ద్వారా కొత్త గాలి లోపలికి ప్రవేశించి లోపలి వేడిగాలి బయటకు వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. ఇలాంటి బంకర్లను నాంగ్‌చంగ్ అంటారు.

 
ఆకుపచ్చని అందం
ఈ గ్రామస్థులు జొన్నలు, ఓ రకం గోధుమలు, ఆప్రికాట్లు, వాల్‌నట్స్ పండిస్తారు. కారకోరం పర్వత శ్రేణి గ్రామాల్లోని రాతి నేలలు, బంజరు భూములకు భిన్నంగా ఈ ఊరు పంటలతో పచ్చగా కనిపిస్తుంది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ విషయంలో వివాదం, ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ తుర్‌తుక్‌లో జీవనం ప్రశాంతంగా ఉంటుంది. 1971లో తుర్‌తుక్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత భారత్ ఆ గ్రామస్థులందరికీ భారత పౌరసత్వంతో పాటు గుర్తింపు కార్డులూ ఇచ్చింది. అంతేకాదు నుబ్రా లోయ ప్రాంత గ్రామాలన్నిటికీ మంచి రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తోంది భారత ప్రభుత్వం.

 
ఆహారం, అలవాట్లు అన్నిటా కనిపించే బాల్టి సంస్కృతి
ఇక్కడ అడుగడుగునా బాల్టి సంస్కృతి కనిపిస్తుంది. ఆప్రికాట్ తోటలు, నూర్ బక్షియా మసీదులు, రాతి ఇళ్లు, గలగల పారే సెలయేళ్లకు అడ్డంగా చిన్నచిన్న రాతి ఆనకట్టలు అన్నీ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. బక్‌వీట్‌తో తయారుచేసే కిసిర్ అనే రొట్టెలు.. అందులో నంజుకోవడానికి ఘుమఘుమలాడే మాంసం.. ఆప్రికాట్, వాల్‌నట్‌లతో చేసిన బలవర్థకమైన పాయసాలు తుర్‌తుక్‌‌ ప్రజల ఆహారం.

 
వసంత రుతువులో తుర్‌తుక్ అందం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు
మామూలుగానే ప్రకృతి సౌందర్యంతో తొణికసలాడే తుర్‌తుక్ వసంతం వచ్చిందంటే చాలు మరింత మనోహరంగా మారిపోతుంది. ఎటుచూసిన కనిపించే కారకోరం పర్వత శ్రేణుల రాతి సొబగులను కప్పేస్తూ ఆకుపచ్చ, పసుపు ఆకులు నిండిన చెట్లు.. వాటికి పూసిన రంగురంగుల పూలు చూపు తిప్పుకోనీకుండా చేస్తాయి. నుబ్రా లోయలో రాతి నిర్మాణాలూ అన్ని గ్రామాల్లో కనిపించినప్పటికీ తుర్‌తుక్‌లో మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో తరచూ వచ్చే భూకంపాలనూ ఇవి తట్టుకుంటాయి.
 
గిరి శిఖరాలు, లోయలు, కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య నివసిస్తున్నప్పటికీ వీరు సామరస్యతకు చిహ్నంగా కనిపిస్తారు. అంతేకాదు.. తమ సాంస్కృతిక మూలాలనూ కాపాడుకుంటూ వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments