Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, కెనడాల మధ్య సయోధ్య అసాధ్యమా?

బిబిసి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (19:53 IST)
గత ఏడాది జూన్‌లో కెనడా పౌరుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో జస్టిన్‌ ట్రూడో భారత్‌ వైపు వేలెత్తి చూపారు. కెనడా ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఆ తర్వాత రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. అనంతరం భారత్, కెనడాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక సిక్కు దేశం లక్ష్యంతో కొంతమంది కెనడియన్ సిక్కులు ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని భారత్ భావిస్తోంది. ఇదే రెండు దేశాల మధ్య వివాదానికి కేంద్రం.
 
దాదాపు 40 ఏళ్ల కిందట పంజాబ్‌లో దారుణమైన హింసాకాండ జరుగుతున్న సమయంలో భారత సైన్యం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 1984లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన ఇద్దరు సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు. కొంతమంది ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అయితే కెనడా పట్టించుకోవడం లేదు. హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ను భారత్‌ 'ఖలిస్తాన్ ఉగ్రవాది'గా ప్రకటించింది. అయితే, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామని అంటున్న కెనడా, అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా ఎవరినీ ఆపలేమని అంటోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడ ‘సిక్కు ఓటు బ్యాంకు’ కోసమే ఖలిస్తానీ మద్దతుదారులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ను విస్మరిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. జనాభా శాతాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో కంటే కెనడాలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు.
 
‘ఏ పాశ్చాత్య దేశంతో భారత్ సంబంధాలు ఇంతగా క్షీణించలేదు’
భారత్, కెనడాల మధ్య నిరంతరం క్షీణిస్తున్న సంబంధాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, ఏ పాశ్చాత్య దేశంతోనూ భారత సంబంధాలు ఇంతగా చెడలేదు. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకున్న భారత్, మెల్లమెల్లగా పూర్తిస్థాయి మార్కెట్ ఎకానమీ సాధించే దిశగా పయనిస్తోంది. జీ7, నాటో దేశాలతో ఆర్థిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలను మెరుగుపరచుకునేందుకూ ప్రయత్నిస్తోంది. ఈ రెండు గ్రూపులలోనూ భాగంగా ఉన్న కెనడాకు అమెరికాతో చాలా సన్నిహిత సైనిక సంబంధాలున్నాయి. ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్‌ఓఆర్‌ఏడీ)లో ఇది ప్రతిబింబిస్తుంది. రెండు దేశాలలో ఆర్థిక వ్యవస్థ పరంగా దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
 
అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన కెనడాతో భారత్‌ సంబంధాలు అంతంత మాత్రంగా మారడం ఆసక్తికరం. గత మూడు దశాబ్దాలుగా ఆర్థిక, వ్యూహాత్మక దిశలో అమెరికాతో మెరుగైన సంబంధాలను నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో కెనడాలోని తమ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలను వెనక్కి రప్పిస్తున్నట్లు భారత్ సోమవారం తెలిపింది. అయితే సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులను బహిష్కరించినట్లు కెనడా ప్రకటించింది. భారత్ వారి దౌత్య, కాన్సులర్ ఇమ్యూనిటీని ఉపసంహరించుకోవడానికి.. దర్యాప్తులో సహకరించడానికి నిరాకరించిందని కెనడా పేర్కొంది. అదే క్రమంలో ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. వీరిలో యాక్టింగ్ హై కమిషనర్ స్టువర్ట్ రాస్ వీలర్ కూడా ఉన్నారు.
 
‘పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అంటే ఏమిటి?
నిజ్జర్ హత్య కేసులో భారతీయ దౌత్యవేత్తలు, ఇతర హైకమిషన్ అధికారులను 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా కెనడా చేసిన ప్రకటన, ఇరు దేశాల దౌత్యవేత్తల బహిష్కరణకు దారి తీశాయి. కెనడాలో 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్' అంటే నేరానికి సంబంధించిన కీలక సమాచారం ఉందని విచారణ అధికారులు భావిస్తారు. సెప్టెంబరు 2023లో నిజ్జర్ హత్య తర్వాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో భారత అధికారుల ప్రమేయానికి సంబంధించి 'బలమైన సాక్ష్యం' ఉందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది, కెనడా నుంచి ఆధారాలు కోరింది.
 
ట్రూడో ప్రభుత్వం తమ అధికారులపై చేసిన ఆరోపణలను రుజువు చేసే ఒక్క ఆధారం కూడా చూపించలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ఆరోపణలు ట్రూడో ‘రాజకీయ అజెండా’లో భాగమని విమర్శించింది. అయితే, బహిష్కరణకు గురైన కెనడియన్ హైకమిషనర్ దీనిపై స్పందించారు. భారత ప్రభుత్వం కోరిన అన్ని డిమాండ్లను కెనడా నెరవేర్చిందని, నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్లు, వారి ప్రమేయం ఉన్నట్లు భారత ప్రభుత్వానికి ఆధారాలు ఇచ్చామని అన్నారు. ఇకపై తదుపరి చర్య తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని హైకమిషనర్ అన్నారు. భారతదేశానికి కెనడా అందించినట్లు పేర్కొంటున్న సాక్ష్యాధారాల గురించి త్వరలో తెలుస్తుంది, అయితే కెనడా ఈ ఆధారాలను ఎప్పుడు అందించిందనేది స్పష్టంగా తెలియలేదు.
 
ఈ దశలో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు తక్కువే. జీ-7 సందర్భంగా ఇటలీలో ఈ ఏడాది జూన్‌లో మోదీ, ట్రూడోల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఏసియన్ శిఖరాగ్ర సదస్సు దృష్ట్యా ఇద్దరు నేతలు గత శుక్రవారం కూడా సమావేశమయ్యారు. లావోస్ సమావేశం అనధికారికంగా, క్లుప్తంగా జరిగిందని "దీని నుంచి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు" అని భారత అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. "భారత వ్యతిరేక అంశాలపై చర్యలకు హామీ లేకుండా సంబంధాలను మెరుగుపరచడం కష్టం" అని ఆ అధికారులు చెప్పినట్లు తెలిపింది. "మేం పని చేసుకోవాలి. కెనడియన్ల భద్రత, దేశంలోని శాంతిభద్రతలపై నా దృష్టి ఉంది" అని ట్రూడో అన్నట్లు సీబీసీ న్యూస్ చెప్పింది.
 
భారత్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా, చాలా కష్టతరంగా ఉన్నాయని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీని పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది. భవిష్యత్తులో కూడా కెనడా గడ్డపై 'నిజ్జర్ల తరహా హత్యలు' జరగవచ్చని ఆమె భయాన్ని వ్యక్తం చేశారనీ చెప్పింది. లావోస్‌లో రెండు దేశాల నేతల మధ్య సమావేశానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 
సంబంధాలు మెరుగుపడతాయా?
కెనడా ఈ సమస్యను వదలకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని పరిష్కరించడానికి భారత్ కూడా ఆసక్తి చూపనట్లే కనిపిస్తోంది. 2025లో కెనడాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని.. రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త ప్రారంభానికి అది అవకాశంగా మారుతుందని భారత్‌లో కొందరి అభిప్రాయం. అయితే కెనడా పార్లమెంట్‌లో ట్రుడో భారత్‌పై చేసిన ఆరోపణలను పక్కన పెట్టడం అంత సులభం కాదు. ఈ మొత్తం వివాదంలో అమెరికా కూడా భాగంగా ఉంది. సెప్టెంబర్ 2023లో కెనడా ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేశారు.
 
కొన్ని వారాల తర్వాత అమెరికా ఫెడరల్ కోర్టు అమెరికన్ పౌరుడు గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు జరిగిన కుట్రలో నిఖిల్ గుప్తా అనే భారతీయ పౌరుడిని నిందితుడిగా పేర్కొంది. పన్నూ ఖలిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అమెరికన్ న్యాయవాది. అయితే, నిఖిల్ గుప్తా కేసును ఎప్పుడు బయటపెట్టాలనే విషయాన్ని అమెరికా, కెనడాలు కలిసి నిర్ణయించాయా? పార్లమెంటులో ట్రూడో ప్రకటన అమెరికాను సంప్రదించి చేశారా? భారత్ నుంచి ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
 
భారత్ ముందున్న మార్గం ఏమిటి?
ఇటీవల కొంతమంది భారత అధికారులపై పన్నూ సివిల్ కేసులు పెట్టారు. వీటిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేరు కూడా ఉంది. ఐక్యరాజ్యసమితి వార్షిక సదస్సుకు భారత ప్రధానితో జాతీయ భద్రత సలహాదారు రాకపోవడానికి ఇదే కారణం. ఇది భారత్, అమెరికాల మధ్య సంబంధాలలో ఆసక్తికరమైన కోణాన్ని కూడా గుర్తుకు తెస్తుంది. అమెరికా నిస్సందేహంగా భారత్‌తో తన సంబంధాన్ని జాగ్రత్తగా పెంపొందించుకుంది. అయితే అప్పుడప్పుడు మిత్ర దేశాలను కూడా దూరంగా ఉంచడం అమెరికా స్వభావం, భవిష్యత్తులో మంచి ఒప్పందం కుదుర్చుకునే ఎత్తుగడలో భాగమది.
 
మరో కోణం ఏమిటంటే, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ సమస్యలపై సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. నిజ్జర్ కేసు విషయంలో కెనడాతో భారత్ వ్యవహరిస్తున్న దూకుడు తీరులో, ఒకటి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ దూకుడుకు విదేశీ గడ్డపై భారత్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణలూ కారణం కావొచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారత అధికారులను అమెరికా బెదిరించినప్పుడు, ఇండియా కొంత బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించింది, కానీ కెనడా విషయంలో అలా చేయడం లేదు. దౌత్య విధానంలో కొద్దిగా ఘర్షణ పడినా గౌరవానికి వచ్చే ఇబ్బంది ఉండదు. ఈ పాత భారతీయ పద్ధతి ఒకప్పుడు అంతర్జాతీయంగా గౌరవం పొందడానికి సహాయపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments