Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా లాక్‌డౌన్: దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (13:11 IST)
సీమా కుమారి ఝార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో హోటల్ నడుపుతున్నారు. కానీ, గత ఏడాది ఇదే సమయానికి గోవాలోని ఒక కేర్ హోమ్‌లో ఆమె నర్సుగా పనిచేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ‘‘మళ్లీ అలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కంటే చనిపోవడం మేలు. గతం గుర్తుచేసుకున్నప్పుడల్లా నా గుండె బరువెక్కుతుంది’’ అని సీమా అన్నారు.

 
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎలాంటి రక్షణ సూట్లు లేకుండా సీమాతో ఆ కేర్ హోమ్ బలవంతంగా పనిచేయించుకుంది. పైగా సగం జీతానికే పని చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఉద్యోగం వదిలేయడం మినహా ఆమెకు మరో దారి లేకపోయింది. ‘‘ఒక నెల పాటు నేను దుర్భర పరిస్థితులు అనుభవించా. అక్కడే చిక్కుకుపోయా. మాకు ఏ సాయమూ అందలేదు. పోలీసులు మమ్మల్ని పట్టుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాక, వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైలులో వెళ్లేందుకు అనుమతించారు’’ అని సీమా వివరించారు.

 
‘‘ఆ రైల్లోకి ఎక్కిన తర్వాత ఒక వ్యక్తి భౌతిక దూరం పాటించమంటూ మా మీద అరుస్తూ ఉన్నాడు. వాళ్లే మమ్మల్ని గొర్రెల్లా లోపలికి తోస్తూ ఉంటే దూరం ఎలా పాటిస్తాం. అసలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అధికారులు ఏమాత్రమూ సన్నద్ధతతో లేరు’’ అని ఆమె అన్నారు.

 
2020 మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన నరేంద్ర మోదీ
2020 మార్చి 24న భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్ కన్నా ముందే 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ తమ పరిధిలో లాక్‌డౌన్‌  విధించుకున్నాయి.

 
మరి, మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఏమొచ్చింది?
కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు చేపడుతున్న చర్యల్లో క్రమబద్ధత అవసరమైందంటూ ప్రధాని నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) ఈ విషయమై మార్చి 24న వివరణ ఇచ్చింది. మరి, లాక్‌డౌన్ విధించాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా సన్నద్ధమైంది? కరోనా సంక్షోభ సమయంలో నేరుగా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన కేంద్రంలోని కీలక ప్రభుత్వ శాఖలను, విభాగాలను, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను లాక్‌డౌన్ విషయమై సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని మేం కొన్ని ప్రశ్నలు అడిగాం.

 
దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్న విషయం ముందుగానే తెలుసా? అందుకు సన్నద్ధంగా చేపట్టాల్సిన చర్యలు, పాత్ర గురించి ఏమైనా సమాచారం అందిందా? అని ఆరా తీశాం. బీబీసీ చేపట్టిన ఈ విస్తృత విచారణలో అలా జరిగినట్లు పెద్దగా ఆధారాలు లభించలేదు. 2021 మార్చి 1న ప్రభుత్వ వాదనను తెలుసుకునేందుకు మేం కేంద్ర సమాచార, ప్రసార శాఖను సంప్రదించాం. కానీ, ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ గానీ, కార్యదర్శి అమిత్ ఖరే గానీ మాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ముందుకు రాలేదు.

 
ఇక కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవహారాలను చూసే విభాగాల సంగతి చూద్దాం. చాలా శాఖలు తమకు దేశవ్యాప్త లాక్‌డౌన్ గురించి ముందస్తు సమాచారమేమీ లేదని, ఈ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని అధికారికంగానే చెప్పాయి.

 
మరి భారత ప్రభుత్వం ఒక్కసారిగా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది?
అసలు దాని గురించి సమాచారమేమీ లేకుండా పౌరులకు కీలక ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఎలా సాయపడగలవు?

 
ఆరోగ్య రంగం
వుహాన్‌లో కేసులు రావడం మొదలైన కొన్ని రోజుల తర్వాత... 2020 జనవరి 8న భారత ప్రభుత్వం కరోనావైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. అప్పటికి, లాక్‌డౌన్ విధించడానికి మధ్యలో దాదాపు రెండున్నర నెలల సమయం ఉంది. సన్నద్ధ చర్యలను ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. సంబంధిత వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ ఉన్నా, ‘సన్నద్ధంగా ఉండండి. ఆందోళనకు గురికావొద్దు’ అని ప్రధాని చెబుతూ వచ్చారు.

 
ఆ తర్వాత ఫిబ్రవరి 22న అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనల్డ్ ట్రంప్ భారత్‌కు వచ్చారు. ఆయనకు ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. "సమర్థంగా పనిచేస్తున్న భారత ఆరోగ్య వ్యవస్థ కరోనావైరస్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకోగలిగింది" అని కేంద్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పారు. కానీ, ఆ తర్వాత కేసులు పెరుగుతూ పోయాయి.

 
‘‘కరోనా వ్యాప్తిని తట్టుకునేందుకు తగినన్ని ఐసోలేషన్ బెడ్‌లు ఏర్పాటు చేశాం. పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్‌లను కూడా సమకూర్చుకున్నాం’’ అని మార్చి 5న ఆయన పార్లమెంటులో చెప్పారు. మార్చి 12న ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించినప్పటికీ భారత్ ధైర్యంగానే కనిపించింది. సమయానికి తగ్గట్లు నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.

 
కానీ, ఆ తర్వాత 12 రోజులకు కేసులు 600 వరకూ చేరాయి. తొమ్మిది మంది చనిపోయారు. ఒక్కసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రణాళికల్లో వారు పోషించిన పాత్ర ఏంటో తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను మేం సమాచారం కోరాం. కానీ, ఆ అభ్యర్థనలను చాలావరకూ కేంద్ర హోంశాఖకు, ఇతర శాఖలకు ఆ శాఖ బదిలీ చేసింది.

 
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని కీలక విభాగాలు, సంస్థలను మేం సంప్రదించాం. వైద్య, ప్రజారోగ్య అంశాల్లో సాంకేతిక సలహాలు అందిస్తూ, వివిధ ఆరోగ్య సేవల అమలులో పాలుపంచుకునే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)ను మేం సంప్రదించాం. మార్చి 24కు ముందు వారితో ప్రభుత్వం సంప్రదింపులేవీ జరపలేదు. అసలు లాక్‌డౌన్‌కు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు.

 
లాక్‌డౌన్ ప్రణాళికలకు సంబంధించి తమకు సమాచారం ఇచ్చినట్లు కూడా ఎలాంటి పత్రాలూ లేవని డీజీహెచ్ఎస్ కింద పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ - ఈఎమ్ఆర్ విభాగం తెలిపింది. ఆరోగ్య రంగంలో విపత్తు నిర్వహణ ఈఎమ్ఆర్ ప్రధాన కార్యకలాపాల్లో ఒకటి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కిందే పనిచేసే నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వ్యాధుల పర్యవేక్షణ, అంటు వ్యాధుల నియంత్రణ, నివారణలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఉంది. లాక్‌డౌన్‌కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆ సంస్థ కూడా తెలిపింది.

 
కరోనా కట్టడి చర్యలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నేతృత్వం వహిస్తూ కనిపించింది. ఇది కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సంస్థే. పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిబంధనల రూపకల్పన, వైరస్‌పై అధ్యయనాలు, వ్యాక్సీన్ల అభివృద్ధి లాంటి అంశాల్లో ఐసీఎంఆర్ మార్గనిర్దేశం చేసింది. ఎవరినీ అడగకుండా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని అనడం పొరపాటే అవుతుందని ఐసీఎంఆర్‌లోని ఎపిడిమియాలజీ అండ్ కమ్యునికేబుల్ డిసీజెస్ విభాగం అధిపతి డాక్టర్ ఆర్ఆర్ గంగాఖేడ్కర్ అంటున్నారు.

 
‘‘ఆ సమావేశాల్లో అందరూ లేకపోవచ్చు. కానీ, ముఖ్యమైన కొందరు వ్యక్తులం ఆ సమావేశాల్లో పాల్గొన్నాం. వ్యూహాలపై చర్చించాం. అది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమే. కొంచెం సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ, అలా సమయం ఇచ్చినా, ముప్పు ఉంది’’ అని ఆయన అన్నారు. మేం సమాచారం కోసం చేసిన అభ్యర్థనను ఐసీఎంఆర్ కేంద్ర హోంశాఖకు బదిలీ చేసింది.

 
లాక్‌డౌన్‌ విధించే ముందు తమ సలహాలు, సూచనలు అడిగినట్లు ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధికార వర్గాలు కూడా చెప్పాయి. ఇక కరోనా సంక్షోభం ఆరంభం నుంచి వివిధ చర్యల్లో భారత సైనిక వైద్యులు భాగమయ్యారు. విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటీన్ చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఐసోలేషన్ కేంద్రాలు, తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసే విషయంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్)‌కు మంచి పరిజ్ఞానం ఉంది. చాలా నగరాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేశారు.

 
లాక్‌డౌన్‌కు ముందు ఏఎఫ్ఎంఎస్‌ను సంప్రదించిన దాఖలాలు కూడా లేవు. సామాన్య ప్రజానీకంతోపాటు వారు కూడా మీడియా ద్వారా ప్రధాని మోదీ ప్రకటన చేసినప్పుడే విషయం తెలుసుకున్నారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే క్షేత్ర స్థాయిలో దాని ప్రకంపనలు మొదలయ్యాయి. 2020 ఏప్రిల్‌లో తన తల్లికి, తండ్రికి కరోనావైరస్ సోకినట్లు దిల్లీకి చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ సమీద్ అహ్మద్ ఫరూఖీకు తెలిసింది. వాళ్లిద్దరూ వయసు మళ్లినవారు కావడంతో ముప్పు ఎక్కువగా ఉండే కేటగిరీలో ఉన్నారు.

 
‘‘ప్రభుత్వం హెల్ప్‌లైన్లలో చాలా వరకూ పనిచేయలేదు. ఒకవేళ సమాధానం లభించినా, పదే పదే పోలీసులను సంప్రదించమని వారు చెబుతూ వచ్చారు. నా తల్లిదండ్రులను తీసుకుని చాలా ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌లో గంటలపాటు వేచి ఉన్నాం. దిల్లీలోనే ఈ పరిస్థితి ఉంటే, మిగతా చోట్ల ఏం జరిగిందో ఆ అల్లాకే తెలియాలి’’ అని సమీద్ అన్నారు. అదృష్టవశాత్తు సమీద్ తల్లిదండ్రులు కోలుకుని, తిరిగి ఇంటికి వచ్చారు.

 
లాక్‌డౌన్‌తో దేశం ఎంత ఆర్థిక ‘మూల్యం’ చెల్లించుకుంది?
‘‘ఈ లాక్‌డౌన్‌కు దేశం ఆర్థిక మూల్యం చెల్లించుకోకతప్పదన్న విషయంలో సందేహం లేదు. కానీ, ఇప్పుడు నేను అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది భారతీయులందరీ ప్రాణాలకే’’ అని ప్రధాని మోదీ అన్నారు.

 
మరి దేశం ఎంత ఆర్థిక ‘మూల్యం’ చెల్లించుకుంది?
లాక్‌డౌన్ విధించిన త్రైమాసికంలో దేశ జీడీపీ 24 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఇప్పుడు కూడా వృద్ధి రేటు మైనస్ ఎనిమిది దగ్గరే ఉండొచ్చని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంది. చాలా మంది పని కోల్పోవడంతో 2020 మార్చిలో నిరుద్యోగ రేటు 8.7 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు సంస్థ అంచనా వేసింది. ఏప్రిల్‌లో అది 23.5 శాతానికి పెరిగి, జూన్ వరకూ 20 శాతంపైనే కొనసాగుతూ వచ్చింది. 2021 ఫిబ్రవరిలో 6.9 శాతంగా నమోదైంది.

 
‘‘లాక్‌డౌన్‌కు ముందు స్థాయికి నిరుద్యోగం రేటు తగ్గిపోయిందని సంబరపడిపోయేదేం లేదు. కార్మిక శక్తి తగ్గిపోతుండటానికి కూడా ఇది అద్దం పడుతోంది. కార్మిక మార్కెట్‌కు సంబంధించి మిగతా కొలమానాలు దిగజారాయి. దేశంలో పని చేసే వయసులో ఉన్న జనాభా శాతం పడిపోతూ వస్తుంది. 2016-17లో అది 42.7 శాతంగా ఉండేది. ఆ తర్వాత మూడేళ్లు 41.6, 40.1, 39.4గా నమోదైంది. 2021 ఫిబ్రవరికి వచ్చేసరికి 37.7కు పడిపోయింది’’ అని సీఎంఐఈ సీఈఓ మహేశ్ వ్యాస్ అన్నారు.

 
దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రభావం అంచనా వేసేందుకు సంప్రదింపులు జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆర్థిక వ్యవహారాలు, వ్యయం, రెవెన్యూ విభాగాల ద్వారా మేం కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించాం. మొదట చాలా వరకూ సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తులను ఆర్థిక శాఖ కేంద్ర హోంశాఖకు బదిలీ చేసింది. ఆ తర్వాత హోంశాఖ ఆయా శాఖలకు మళ్లీ లేఖ రాయాల్సి వచ్చింది. ఆయా విభాగాల పాత్రపై సమాచారం కోరుతున్నారని వివరించాల్సి వచ్చింది. అలాంటి సంప్రదింపులు జరిగినట్లు సమాచారమేదీ లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ఎక్స్‌పెండిచర్, ఫైనాల్సియల్ సర్వీసెస్, రెవెన్యూ విభాగాలు చెప్పాయి.

 
 రాజ్యాంగ సంస్థ జీఎస్‌టీ కౌన్సిల్ కూడా తమ పాత్ర లేదని చెప్పింది. మా అభ్యర్థనను తిరిగి కేంద్ర హోంశాఖకు పంపింది. అక్కడి నుంచి కూడా మాకు సమాచారమేదీ రాలేదు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ సంక్షోభ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థికమంత్రి నేతృత్వంలో కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. లాక్‌డౌన్‌కు ఐదు రోజుల ముందు ఈ ప్రకటన వచ్చింది. ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఆ టాస్క్‌ఫోర్స్ తీసుకున్న చర్యలు, అవి అమలైన తీరు, ఫలితాలను విశ్లేషించేందుకు మేం ప్రయత్నించాం.

 
ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఆర్థిక శాఖల నుంచి ఇంకా వాటి గురించి సమాచారం రావాల్సి ఉంది. లాక్‌డౌన్ నిర్ణయంలో తమ పాత్ర గురించి ఎలాంటి సమాచారమూ లేదని మాకు రెండుసార్లు బదులు ఇచ్చింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి కూడా దేశవ్యాప్త లాక్‌డౌన్ గురించి ముందస్తు సమాచారం లేదు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, టెలికాం శాఖ, ఐటీ శాఖ, పౌర విమానయాన శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహా కీలకమైన మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి కూడా ఇలాంటి సమాధానాలే వచ్చాయి. ‘‘భారత్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదు. ఏ ప్రణాళికలూ లేకుండా విధించడం ఇంకా పెద్ద తప్పు’’ అని రాజకీయ విశ్లేషకుడు ప్రియరంజన్ దాస్ అన్నారు. ప్రభుత్వం నడుస్తున్న తీరుకు ఈ నిర్ణయం తీసుకున్న విధానం అద్దం పడుతోందని ఆయన అన్నారు.

 
‘‘ఇంకా మెరుగైన ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన సహజ విపత్తులను ఎన్నింటినో భారత్ ఎదుర్కొంది. కానీ, ఇది మాత్రం దిగ్భ్రాంతి కలిగించిన విషయమే. మరే పెద్ద ఆర్థిక వ్యవస్థతోనూ పోల్చుకోలేని విధంగా ఇప్పుడు మన పరిస్థితి ఉంది’’ అని ఆయన అన్నారు.

 
లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు
లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు అనగానే వలస కార్మికులు పడిన కష్టాలు అందరికీ గుర్తుకువస్తాయి. లాక్‌డౌన్ సమయంలో కోటి మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగివెళ్లిపోయారని, వారిలో 63.07 లక్షల మందిని ప్రభుత్వం రైళ్లలో తరలించిందని గత సెప్టెంబర్ 14న పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. సొంత ప్రాంతాలకు తిరిగివెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారి గురించి ఎలాంటి సమాచారమూ లేదని తెలిపింది.

 
ఇలా తిరిగివెళ్తున్న క్రమంలో 300కు పైగా మంది వలస కార్మికులు అనారోగ్యానికి గురై గానీ, ప్రమాదాల బారినపడి గానీ మరణించినట్లు వివిధ మీడియా కథనాలను విశ్లేషించి బీబీసీ గుర్తించింది. భవన నిర్మాణ రంగ కూలీల ఖాతాలకు నగదు బదిలీ చేయాలని లాక్‌డౌన్ విధించిన రోజున కార్మిక, ఉపాధికల్పన శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి సూచనలేమైనా మరిన్ని ఆ శాఖ చేసిందా? అసలేం చర్యలు తీసుకుంది?

 
ఈ విషయంపై తమ దగ్గర సమాచారం లేదని ఆ శాఖ ప్రధాన కార్యాలయం సహా దాని కింద పని చేసే 45 ఇతర విభాగాలు కూడా చెప్పాయి. స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్‌వర్క్ అనే సంస్థ లాక్‌డౌన్ సమయంలో దాదాపు 40 వేల మంది వలస కార్మికులకు నగదు చెల్లింపుల ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు చెందిన కార్యకర్త ప్రీతి సింగ్ మాతో ఈ విషయమై మాట్లాడారు.
‘‘పరీక్ష ఉన్నా సన్నద్ధమవుతాం. కానీ లాక్‌డౌన్‌కు మాత్రం సన్నద్ధం కాలేదు. కార్మికులు డబ్బులు లేక, ఆదాయం లేక తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రజలను ప్రణాళికబద్ధంగా తరలించి ఉంటే, చాలా అకాల మరణాలు తప్పేవి’’ అని ఆమె అన్నారు.

 
ఇంకా ఎవరెవరు ఏమన్నారు?
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు సహా ఇతర ప్రభుత్వ విభాగాలను కూడా బీబీసీ సంప్రదించింది. లాక్‌డౌన్ ప్రకటన చేసేముందు, దాని ప్రభావం గురించి గానీ, మరే ఇతర అంశం గురించి గానీ పీఎంఓ నుంచి సమాచారం ఉందా? అని ఆరా తీశాం. అలాంటి సమాచారమేదీ లేదని రాష్ట్రపతి కార్యాలయం తెలియజేసింది. లాక్‌డౌన్ ప్రకటించిన రోజే తమకు కూడా ఆ సమాచారం అందిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.

 
రక్షణ శాఖలోని సైనిక వ్యవహారాల విభాగం (డీఎంఏ) అధిపతి అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కార్యాలయం కూడా తమకు లాక్‌డౌన్ గురించి ముందుగా తెలియజేసినట్లు సమాచారం ఏదీ అందుబాటులో లేదని పేర్కొంది. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ కూడా... ‘‘లాక్‌డౌన్ విధించే ముందు ఉన్నత విద్య విభాగంతో ప్రధాని కార్యాలయం సంప్రదింపులు జరిపినట్లు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని బదులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments