పెంపుడు కుక్కలతో మనుషులకున్న సంబంధం వేల ఏళ్లనాటిది. 14,000 ఏళ్లకు ముందే, సమాధుల్లో మనుషుల పక్కన వారి పెంపుడు జంతువులను పూడ్చిపెట్టిన ఆధారాలు లభించాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతారు. కుక్కలతో మన బంధం ఎలా మొదలైందనే అంశంపై ఇప్పటికీ చర్చ నడుస్తుంటుంది. ఈ రోజు(ఆగస్ట్ 26) ఇంటర్నేషనల్ డాగ్ డేను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కుక్కలు మనషులకు ఎలా దగ్గరయ్యాయి.. వంటి విషయాలను తెలుసుకుందాం..
రెండు సిద్ధాంతాలు..
15,000 నుంచి 40,000 ఏళ్ల మధ్య ఆసియాలో లేదా యూరప్‌లో మనుషులు-కుక్కల మధ్య సంబంధం ఎలా మొదలైందనే విషయంపై రెండు సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో క్రాస్-స్పిసీస్ అడాప్షన్ థియరీ మొదటిది. దీని ప్రకారం.. పొరపాటున మనం మొదట బూడిద రంగు తోడేళ్లను మచ్చిక చేసుకున్నాం. ఇవి కుక్కలకు పూర్వీకుల్లాంటివి. వీటి పిల్లలను మనుషులు మొదట పెంచుకోవడం మొదలుపెట్టారు. రెండోది కమెన్సలిజమ్ థియరీ. దీని ప్రకారం మనుషులు తినగా మిగిలిన ఆహారం కోసం తోడేళ్లే మన ఆవాసాల పక్కన తిరుగుతూ మచ్చికగా ఉండేవి. రెండో సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవారిలో న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ వర్సిటీకి చెందిన కృష్ణ వీరమ ఒకరు.
మనం మచ్చిక చేసుకున్న తోడేళ్లు కాస్త తక్కువ దూకుడుతో ఉండేవి. మనుషులతో కలసిమెలసి ఉండేవి. మొదట్లో వాటి వల్ల మనకు పెద్దగా ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కాదు. కానీ, క్రమంగా అవి మనషులతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాయి. అలా నేటి కుక్కల స్థాయికి అవి వచ్చాయి. ఒకరి వల్ల మరొకరికి క్రమంగా ప్రయోజనాలు చేకూరడంతో రెండు జాతుల మధ్య గట్టి బంధం ఏర్పడిందని మనుషులు-జంతువుల సంబంధాల నిపుణురాలు పాట్ షిప్‌మ్యాన్ చెప్పారు. పనిని తేలిగ్గా చేసుకోవడానికి మనం ఆవిష్కరించిన వాటిలో అన్నింటి కంటే కుక్కలను మచ్చిక చేసుకోవడమే మనకు ఎక్కువ ప్రయోజనాలు తెచ్చిపెట్టిందిఅని షిప్‌మ్యాన్ వివరించారు.
తోడేళ్లను మచ్చిక చేసుకోవడం అంత తేలిక కాదు. అవి చాలా ప్రమాదకరమైనవి. అంతేకాదు, ఆహారం కోసం అవి మనుషులతో పోటీపడేవిఅని ఆమె అన్నారు. అయితే, కలసిమెలసి జీవించడంతో చేకూరే ప్రయోజనాలపై ఇద్దరికీ క్రమంగా అవగాహన ఏర్పడింది. శత్రువులపై దాడి చేయించేందుకు తోడేళ్లు మనుషులకు సాయపడేవి. వేటలోనూ సాయం చేసేవి. తోడేళ్లు/కుక్కలు మనుషుల కుటుంబంలో భాగంగా ఉండేవని అప్పటి సమాధులు, గుహల్లోని పెయింటింగ్‌లను చూస్తే తెలుస్తుంది. ఆ పెయింటింగ్‌లలో తోడేళ్లు లేదా కుక్కల్ని పెంచుకున్నట్లు బొమ్మలు కనిపించేవి.
ఈ విషయంపై అవర్ ఓల్డెస్ట్ కంపేనియన్స్ పేరుతో షిప్‌మ్యాన్ ఒక పుస్తకం కూడా రాశారు. నియాండెర్తాల్స్‌పై హోమోసెపియన్ జాతి పైచేయి సాధించడానికి కుక్కల్ని మచ్చిక చేసుకోవడం కూడా ఒక కారణమని ఆమె ఈ పుస్తకంలో రాశారు. మనుషులు-తోడేళ్ల బంధం ఆహారపు గొలుసుపై ఆధిపత్యం ప్రదర్శించిందిఅని ఆమె వివరించారు. కమెన్సల్ థియరీకి గత డిసెంబరులో ప్రచురితమైన ఓ అధ్యయనం మరింత బలం చేకూర్చింది. తాము తినగా మిగిలిన మాంసాన్ని మనుషులు తోడేళ్లతో పంచుకునేవారని చెప్పడానికి తమకు ఆధారాలు లభించాయని వీటిలో ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొదట్లో మనుషులతో బంధం ఏర్పరచుకున్న శునకాలు.. బాడీగార్డులుగా, వేటలో సహాయకులుగా మారాయిఅని పరిశోధకులు పేర్కొన్నారు.
వారి ప్రవర్తనలో మార్పు..
కుక్కలను పెంచుకోవడంతో మనుషులకు కలిగే ప్రయోజనాలపై ఎలాంటి సందేహాలను వ్యక్తం చేయాల్సిన అవసరంలేదని పెన్సిల్వేనియా యూనిర్సిటీలోని మనుషులు-జంతువుల సంబంధాల నిపుణుడు జేమ్స్ సెర్పెల్ వివరించారు. తోడేళ్లు క్రమంగా కుక్కలుగా ఎలా మారాయో వివరించడానికి క్రాస్ స్పిసీస్ అడాప్షన్ థియరీనే సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చని ఫ్రాంటియర్స్ మ్యాగజైన్‌లో గత ఏప్రిల్‌లో ప్రచురించిన ఓ పరిశోధన పత్రంలో వివరించారు.
మొదట్లో మనుషుల జనాభా చాలా తక్కువగా ఉండేది. చిన్నచిన్న సమూహాలుగా వేరుపడి మనుషులు జీవించేవారు. దీంతో పెద్దగా తినడానికి ఏమీ మిగేలేవి కాదు. మీరు ప్రస్తుతం వేటకు వెళ్లే మనుషులను గమనిస్తే, వారు ఎక్కువగా ఆహారాన్ని వృథాగా వదిలేయరనే సంగతి గమనించాలిఅని సెర్పెల్ వివరించారు. ఆదిమ జాతులు తమ ఆహారాన్ని జంతువులకు చిక్కకుండా దాచుకున్నట్లు చాలా ఆధారాలు కూడా చెబుతున్నాయి. వేరే జంతువులను తినే జంతువులను మన పూర్వీకులు తమ నివాసాల్లో తిరగడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం వేటాడే జాతులను చూడండి... వారు సింహాలు లాంటి జంతువులను భయపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. దీంతో క్రాస్-స్పిసీస్ అడాప్షన్ థియరీనే సరైనదని సెర్పెల్ ప్రతిపాదించారు. మన పూర్వీకులు కూడా మనలానే జంతువుల పిల్లలను ఇష్టపడేవారు. మొదట్లో జంతువుల పిల్లలను మచ్చిక చేసుకునేవారు. అవి పెద్దవి అయ్యాక మళ్లీ అడవిలోకి వెళ్లిపోయేవి. కానీ అలా పెంచిన పిల్లల్లో కొన్ని మనుషులతో ఉండటానికి ఇష్టపడేవి. అలా అవి మనుషులకు బాగా మచ్చిక అయ్యేవి. అలా వచ్చిన తోడేళ్లకు పుట్టే పిల్లలు సహజంగానే మనుషులతో స్నేహంతో మెలిగేవి. అవి అడవి తోడేళ్ల కంటే చాలా భిన్నంగా ఉండేవి. అయితే, మొదట్లో మచ్చిక చేసుకోవడం అనేది అనుకోకుండా జరిగిందే. ఒక ప్రణాళిక ప్రకారం వాటిని మచ్చిక చేసుకోని ఉండకపోవచ్చు.
అలా మొదలైంది..
మొదటి కుక్కలను మచ్చిక చేసుకోవడం అనేది చాలా వేల ఏళ్ల క్రితమే జరిగింది. అదిఎలా జరిగిందో మనకు ఏదో ఒక రోజు కచ్చితంగా తెలిపే ఆధారాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం అది మర్మమే. అయితే, ఇటు పెంపుడు జంతువుల సిద్ధాంతం అటు మిగిలినవి తిని బతికే సిద్ధంతాలను నమ్మే శాస్త్రవేత్తలు ఒక విషయంలో మాత్రం ఏకీభవిస్తారు. మనం మొదట మచ్చిక చేసుకున్నది తోడేళ్లనేనని వారు నమ్ముతున్నారు. ఎందుకంటే మన రెండు స్వభావాలు ఒకేలా ఉండేవి. వేటాడే విధానం కూడా ఒకేలా ఉంటుందిఅని షిప్‌మ్యాన్ అన్నారు. మనం మన జీవితంలో ఏం చేయాలని అనుకునేవారిమో.. అవి కూడా అలానే చేసేవి. మొదట్లో మనం మచ్చిక చేసుకున్న జంతువులను అయితే, తినడానికి లేదా మన వస్తువులు మోయడానికి ఉపయోగించే వాళ్లంఅని ఆమె వివరించారు. మరోవైపు షెర్పెల్ కూడా షిప్‌మ్యాన్ వాదనతో ఏకీభవించారు.
తోడేళ్లు.. క్రమంగా మనుషులతో కలిసి జీవించే విధానానికి అలవాటు పడ్డాయి. ఒకేరకమైన ఆహారం తీసుకునేవి. సమూహాల పరిమాణం, పిల్లల్ని చూసుకునే విధానం.. ఇలా అన్నింటిలోనూ తోడేళ్లు.. మనుషులను అనుసరించేవి. మనకు, తోడేళ్లకు చాలా విషయాల్లో సారూప్యత ఉండేది.అని అన్నారు.