Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (18:56 IST)
ప్రతి వారాంతంలో మగవాళ్లు ఇంటికి వస్తారు ఆమెపై అత్యాచారం చేస్తారు. కొందరు ఆమె తండ్రికి తెలిసినవారు. మరికొందరు తెలియదు. ఇది రెండేళ్ళుగా సాగుతోంది. ఒక 12 ఏళ్ల బాలిక తన కౌన్సెలర్లతో చెప్పిన విషయం ఇది. (హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు కొందరు పాఠకులకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు.)

 
ఇదంతా తన తండ్రి మద్యం తాగటం కోసం ఆయన స్నేహితులను ఇంటికి పిలవటంతో మొదలైందని ఆ చిన్నారి చెప్పింది. మద్యం మత్తులో ఉన్న ఆ మగాళ్లు ఆ బాలికను ఆమె తల్లిదండ్రుల ముందే వెకిలిగా మాట్లాడుతూ అసభ్యంగా తడిమేవారు. కొన్నిసార్లు ఆ మగాళ్లు తన తల్లితో కలిసి ఇంట్లో ఉన్న ఒక్కటే పాత పడక గదిలోకి వెళ్లి కనిపించకుండా ఉండేవారని ఆ చిన్నారి చెప్పింది.

 
ఆ తర్వాత ఒక రోజు ఆయన స్నేహితుల్లోని ఒక పురుషుడితో పాటు తనను అదే పడక గదిలోకి నెట్టేసి బయటి నుంచి గడియ పెట్టేశాడని ఆ బాలిక గుర్తు చేసుకుంది. ఆ పురుషుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి పసిప్రాయం ఓ పీడకలగా మారిపోయింది. ఆమె తండ్రి మగాళ్లకు ఫోన్ చేసి.. తన కూతురుతో వాళ్లు గడపటానికి సమయం నిర్ధారిస్తాడు. వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. అప్పటి నుంచీ కనీసం 30 మంది మగాళ్లు ఆ బాలిక మీద అత్యాచారం చేసి ఉంటారని కౌన్సెలర్లు భావిస్తున్నారు.

 
టీచర్లు ఇచ్చిన సమాచారంపై స్పందించిన శిశు సంక్షేమ అధికారులు ఆ బాలికను స్కూలులోనే తమ ఆధీనంలోకి తీసుకుని సంక్షేమ గృహానికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలు నిర్థారించాయని అధికారులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఆమె తండ్రి సహా నలుగురు పురుషులను అరెస్ట్ చేశారు. వారి మీద అత్యాచారం, అశ్లీల చిత్రాల అవసరాలకు ఒక చిన్నారిని ఉపయోగించటం, లైంగిక దాడి నేరాలు నమోదు చేశారు. నలుగురికీ కోర్టు బెయిల్ నిరాకరించింది.

 
ఆ బాలిక మీద అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్న ఆ తండ్రికి తెలిసిన మరో ఐదుగురు పురుషుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి కుటుంబానికి తెలిసిన 25 మంది పురుషుల ఫొటోలను పోలీసులు ఆ బాలికకు చూపిస్తున్నారు. ''నాకు ఎవరి ముఖాలూ గుర్తులేవు. అంతా అస్పష్టంగా ఉంది'' అని ఆమె వారికి చెప్పింది.

 
దక్షిణ భారతదేశంలో పచ్చని కొండలు, పరిశుభ్రమైన గాలి, తాజా నీటి ప్రవాహాలకు పేరుపడ్డ ఓ సంపన్న పట్టణంలో ఆ కుటుంబం నివసించేది. కానీ తమ సొంత పట్టణంలో సంపద ఆ కుటుంబాన్ని విస్మరించినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఆ రోజు ఆ బాలిక ఇంటి సమీపంలో నివసించే ఓ ఇద్దరు టీచర్ల నుంచి స్కూలుకు సమాచారం అందింది.

 
''ఆ చిన్నారి కుటుంబంలో ఏదో తేడా ఉంది. ఆమె ఇంట్లో ఏదో జరుగుతోంది. ఆ బాలికతో మాట్లాడి చూడండి'' అని వాళ్లు చెప్పారు. స్కూలు యాజమాన్యం తక్షణమే ఒక మహిళా సహాయ బృందం నుంచి ఒక కౌన్సెలర్‌ను పిలిపించింది. మరుసటి రోజు ఉదయం ఆ కౌన్సిలర్ వచ్చారు.

 
ఆ కౌన్సిలర్, ఈ బాలిక, సిబ్బంది గదిలో ఎదురెదురుగా కూర్చున్నారు. అక్కడ ఏం జరుగుతోందో తెలియని ఆ బాలిక తల్లి మామూలుగా పేరెంట్ - టీచర్ సమావేశంలో పాల్గొంది. ''నీ కుటుంబం గురించి,నీ జివితం గురించి చెప్పు'' అని ఆ బాలికను అడిగారు కౌన్సెలర్. వాళ్లు నాలుగు గంటల పాటు మాట్లాడారు.

 
తన తండ్రి నిరుద్యోగి కావటం వల్ల ఇంట్లో తన పరిస్థితి కష్టంగా ఉందని ఆ బాలిక చెప్పింది. అద్దె కట్టకపోవటం వల్ల ఆ ఇంటి నుంచి తమ కుటుంబాన్ని ఎప్పుడైనా ఖాళీ చేయించవచ్చని చెబుతూ, కన్నీళ్లు పెట్టుకుంది. కొంతసేపటికి మౌనం దాల్చింది. ఆమె స్కూలులో లైంగిక విజ్ఞాన తరగతుల గురించి ఆ కౌన్సెలర్ ఆ బాలికకు చెప్పారు. చిన్నారుల మీద, మహిళల మీద అకృత్యాలు ఎంత సాధారణంగా జరుగుతున్నాయో వివరించారు.

 
''మా ఇంట్లో కూడా ఏదో జరుగుతోంది. నా తండ్రి మా అమ్మ మీద అకృత్యానికి పాల్పడుతున్నాడు'' అని ఆ చిన్నారి మధ్యలో జోక్యం చేసుకుని చెప్పింది. కొంత వివరంగా చెప్పగలవా అని ఆ కౌన్సెలర్ అడిగారు. ఒకసారి తన తల్లి కోసం వచ్చిన ఒక పురుషుడు తన మీద దాడి చేశాడని ఆ చిన్నారి చెప్పింది. తన తల్లి ఆ పురుషుడిని తిట్టి పంపించిందని తెలిపింది. కానీ, ఆ తర్వాత తాను స్కూలులో ఉన్నపుడు తన తల్లి కోసం చాలా మంది మగవాళ్లు వచ్చారని వివరించింది.

 
ఇంకా ఎక్కువ మంది మగవాళ్లు తన ఇంటికి రావటం మొదలైంది. వాళ్లు రాత్రి పొద్దుపోయే వరకూ మద్యం తాగిన తర్వాత ఆమె మీద లైంగిక అకృత్యాలకు పాల్పడేవారని చెప్పింది. గర్భధారణను, వ్యాధులను నిరోధించే గర్భనిరోధకాల గురించి తెలుసా అని కౌన్సిలర్ ఆ బాలికను అడిగారు.

 
''లేదు.. లేదు.. మేం కండోమ్‌లు వాడతాం'' అని బాలిక బదులిచ్చింది. సంభాషణ మొదలైన చాలా సేపటికి ఆ బాలిక తను కూడా లైంగిక దాడికి గురవుతున్న విషయాన్ని అంగీకరించటం అదే మొదటిసారి. ఆ తర్వాత తన పసిప్రాయం బుగ్గి అయిన భయానక కథను ఆ చిన్నారి వివరించింది.

 
''మగాళ్లు వచ్చి మా అమ్మను పడక గదిలోకి తీసుకెళతారు. అది మామూలు విషయమేనని నేను అనుకున్నా. ఆ తర్వాత నా తండ్రి నన్ను కూడా అపరిచితులతో పాటు గదిలోకి నెట్టాడు'' అని చెప్పింది. కొన్నిసార్లు తన నగ్న చిత్రాలను తానే ఫొటో తీసి తన దగ్గరికి వచ్చిన మగాళ్లకు పంపించేలా ఆమె తండ్రే ఒత్తిడి చేసేవాడు.

 
ఈ ఏడాది మొదట్లో తనకు మూడు నెలల పాటు నెలసరి రాకపోవటంతో తన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఆ బాలిక చెప్పింది. వాళ్లు ఆమెని ఒక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ అల్ట్రాసౌండ్ పరీక్షతో పాటు కొన్ని మందులు సిఫారసు చేశారు. ఆ బాలిక వరుస అత్యాచారాల బాధితురాలని కౌన్సెలర్ నిర్ధారించుకున్నారు. ఆమె శిశు సంక్షేమ అధికారులను పిలిపించారు. వాళ్లు ఆ బాలికను ఒక సంక్షేమ గృహానికి తీసుకెళతారని బాలికతో చెప్పారు. ఆ చిన్నారి నిశ్చలంగా కనిపించింది.

 
టీచర్లతో సమావేశం నుంచి బయటకు వచ్చిన ఆ బాలిక తల్లి, తన కుమార్తెను ఒక కారులో తీసుకెళుతుండటం చూసి పెద్దగా కేకలు వేసింది. ''నా కూతురును ఎలా తీసుకెళ్లిపోతారు?'' అని ప్రశ్నించింది. ఆ చిన్నారికి ''కొన్ని భావోద్వేగ సమస్యలు'' ఉన్నాయని.. ఆమెకు కౌన్సెలింగ్ అవసరమని, కాబట్టి ఆమెను తీసుకెళుతున్నారని ఆ కౌన్సెలర్ బాలిక తల్లికి చెప్పారు.

 
''నా అనుమతి లేకుండా నా కూతురుకు కౌన్సెలింగ్ చేయటానికి మీరెవరు?'' అని ఆమె ప్రశ్నించింది. అప్పటికే ఆ బాలిక సంక్షేమ గృహానికి వెళ్లిపోతోంది. ఆ చిన్నారి గత రెండు నెలలుగా అక్కడ ఇతర బాలికలతో కలిసి నివసిస్తోంది. ఆ బాలికలందరూ కూడా లైంగిక అకృత్యాల బాధితులే. చిన్నారుల మీద లైంగిక అకృత్యాలలో భారతదేశానికి సిగ్గుచేటయిన రికార్డు ఉంది. అధికారిక పత్రాల ప్రకారం, ఈ అకృత్యాలకు అత్యధికంగా బంధువులు, పొరుగువారు, పనుల్లో పెట్టుకున్న యజమానులు, ఆ చిన్నారులకు బాగా తెలిసిన వారే పాల్పడుతున్నారు.

 
ఈ నేరాలకు సంబంధించి తాజా గణాంకాల ప్రకారం, 2017లో భారతదేశంలో చిన్నారులపై అత్యాచారాల కేసులు 10,221 నమోదయ్యాయి. దేశంలో చిన్నారులపై నేరాలు ఇటీవలి సంవత్సరాల్లో స్థిరంగా పెరుగుతున్నాయి. ఇటువంటి భయంకరమైన ఉదంతాలు సాధారణంగా మారిపోయాయని కౌన్సెలర్లు చెప్తున్నారు. ఈ చిన్నారి ఉన్న సంక్షేమ గృహంలో ఉన్న ఇతర బాలికల్లో ముగ్గురు బాలికల మీద వారి తండ్రే లైంగిక అకృత్యాలకు పాల్పడ్డాడు. ఆ ముగ్గురు చిన్నారుల వయసు 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపే ఉంది.

 
తండ్రి చేతుల్లో అత్యాచారానికి గురైన ఒక 15 ఏళ్ల నిండు గర్భిణిని పరీక్ష హాలుకు పంపించటానికి తాను సాయం చేశానని ఒక కౌన్సెలర్ చెప్పారు. ''ఆ బాలికను, ఆమెకు పుట్టిన బిడ్డను అప్పగించాలని మేం అడిగాం. దానికి వారు, 'నా బిడ్డను నేను ఎందుకు ఇచ్చేయాలి? ఇది నా తండ్రి బిడ్డ. ఈ బిడ్డను నేను పెంచుతా'' అని చెప్పింది'' అని ఆ కౌన్సిలర్ తెలిపారు.

 
ఈ కథనంలో వివరించిన బాలిక ఆ సంక్షేమ గృహంలో మొదట కొన్ని రోజులు రాత్రీ పగలూ నిద్రపోయింది. ఆ తర్వాత తన అమ్మను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో కాగితాలపై రాసింది. కానీ, తమ కూతురు ''ఈ కట్టు కథను (లైంగిక అకృత్యాల గురించి) అల్లింది.. ఎందుకంటే ఆమె మా మీద పోట్లాడుతూ ఉంది. మాకు గుణపాఠం చెప్పాలనుకుంది'' అని ఆ బాలిక తల్లి వాదిస్తోంది.

 
పరిస్థితులు ఇంతగా దిగజారకముందు.. తన భర్త ఉద్యోగం చేస్తూ రోజుకు రూ. 1,000 వరకూ సంపాదించిన రోజులు ఉన్నాయని ఆమె చెప్పింది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటోంది. ఆమె భర్త విచారణ కోసం నిరీక్షిస్తూ జైలులో ఉంటే, ఆమె కూతురు సంక్షేమ గృహంలో ఉంది. ''నేను నా కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకునే తల్లిని. ఆమెకు నా అవసరం ఉంది'' అని ఆ బాలిక తల్లి బీబీసీతో పేర్కొంది.

 
ఇంటి మురికి గోడల మీద నుంచి పెయింటింగ్ పొర ఊడిపోతోంది. ఆ బాలిక ఈ ఇంట్లో లేకున్నా ఆమె జ్ఞాపకాలు ఈ గోడల మీద సజీవంగా ఉన్నాయి. ''ఈ గోడల మీద బొమ్మలు వేస్తుంది. రాస్తుంది. ఆ బాలిక చేసింది అంతే'' అని ఆ తల్లి చెప్పింది. ''ఫ్రెండ్స్, నా మనసులోని భావాలను నేను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగితే, దానికదే ఒక విజయం.'' ఇది ఆ ఇంట్లో ఒక తలుపుపై అంటించిన కాగితం మీద ఆ బాలిక రాసిన వాక్యం.

 
ఈ తల్లీకూతుళ్ల మధ్య కొన్ని నెలల కిందట ఒక గొడవ జరిగింది. ఈ బాలిక స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక నీలి రంగు పేస్టల్ తీసుకుని ముందు తలుపు మీద ఒక తాటి చెట్టు, ఒక ఇల్లు, ఆ ఇంటి మీద ఒక చిమ్నీ, దాని లోనుంచి పొగ వస్తున్నట్లు.. ఒక బొమ్మ గీసింది. అది, ఆ బాలిక వయసు చిన్నారులు చాలా మంది తాము ఊహించి గీసే బొమ్మ. ఆ బొమ్మతో పాటు అదే తలుపు మీద హడావుడిగా ఒక నోట్ రాసి బయటకు వెళ్లింది ఆ చిన్నారి.
''సారీ అమ్మా!''

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం