Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు

Webdunia
సోమవారం, 10 మే 2021 (13:59 IST)
"ఒక్క నెలలోనే మేం చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడే కొత్తగా ఇంటర్న్‌లుగా చేరిన మాకు సంక్షోభ పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోంది." బాగా లోతుగా ఉన్నచోట దిగితేనే ఈత కొట్టడం వస్తుందని అంటారు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు కూడా కష్టమైన పనితో మొదలుపెడితే తొందరగా ఎదుగుతామని అంటారు. ప్రస్తుతం భారతదేశంలో జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఇదే. కోవిడ్ సంక్షోభంతో ఆరోగ్య వ్యవస్థ పీకల్లోతుల్లో మునిగిపోయింది. ఇప్పుడే యూనివర్సిటీ చదువులు ముగించుకుని స్టెతస్కోప్ మెడలో వేసుకున్న జూనియర్ డాక్టర్ల ఎదుట ఇప్పుడు రెండే మార్గాలు, అందులో దిగి ఈత కొట్టడం లేదా మునిగిపోవడం.

 
'మేము చాలా తొందరగా ముందుకు వెళ్తున్నాం'
గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల పంక్తి పాండ్యా మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఫిబ్రవరి 26న ఆమె చదువు ముగిసింది. ఆరోజుకు గుజరాత్‌లో 424 కోవిడ్ కేసులు ఉన్నాయి. తరువాత ఏదైనా ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తే ఆమె డాక్టర్ చదువు పూర్తవుతుంది. మార్చి 22న ఆనంద్ జిల్లాలోని శ్రీ కృష్ణ ఆస్పత్రిలో ఆమె ఇంటర్న్‌గా చేరారు. అప్పటికి గుజరాత్‌లో రోజువారీ కేసులు 1,580లకు పెరిగిపోయాయి.

 
పంక్తి మొదటి నెల ఇంటర్న్‌షిప్ ముగిసేసరికి గుజరాత్‌లో రోజువారీ కోవిడ్ కేసులు 12,500లకు చేరుకున్నాయి. "ఎంత పని ఉండేదంటే, ఒక క్షణం కూర్చోవడానికి కూడా సమయం ఉండేది కాదు" అని పంక్తి రేడియో 1 న్యూస్‌బీట్‌కు చెప్పారు. ఈ ఏడాది జూనియర్ డాక్టర్లకు చాయిస్ లేదు. వాళ్లంతా కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లుగా మారిపోయారు. పంక్తితో సహా జూనియర్ డాక్టర్లందరికీ కోవిడ్ వార్డ్‌లో షిఫ్ట్‌లు వేశారు. పగలు, రాత్రి కూడా పని చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి వరుసగా ఏడు రోజులూ 12 గంటలపాటూ పని చేయాల్సి వస్తోంది.

 
"మమ్మల్ని తీసుకెళ్లి యుద్ధభూమిలో పడేశారు."
ఒకసారి ఒక షిఫ్ట్‌లో తనతో పాటూ మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు మాత్రమే ఉన్నారని, వాళ్ల ముగ్గురూ కలిసి 60 మంది కోవిడ్ రోగులను చూసుకోవలసి వచ్చిందని ఆమె వివరించారు. అయితే, అది నాన్-క్రిటికల్ కోవిడ్ వార్డ్ కావడంతో తక్కువమంది డాక్టర్లను షిఫ్ట్‌లో వేశారు. "పనిభారం చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. క్రిటికల్ వార్డ్ అయితే ఇంకా భయంగా ఉంటుంది. అక్కడ తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు ఉంటారు. వాళ్లందరినీ ఒక్కరే చూసుకోవడం చాలా కష్టం" అని పంక్తి అన్నారు.

 
"ఏ రోగిని ముందు చూడాలో, ఎవరికి ఎక్కువ చికిత్స అవసరమో తెలుసుకోవడం, కళ్ల ముందే రోగులు చనిపోతుంటే నిబ్బరంగా ఉండగలగడం.. ఇవన్నీ డాక్టర్లు చాలా సంవత్సరాల అనుభంతో నేర్చుకుంటారు. కానీ, కోవిడ్ సంక్షోభంలో జూనియర్ డాక్టర్లంతా ఇవన్నీ చాలా కొద్దీ రోజుల్లోనే నేర్చుకుంటున్నారు. మేము వృత్తిలో తొందరగా ముందుకెళిపోతున్నాం అనిపిస్తోంది" అని పంక్తి అన్నారు.

 
'రోగులకు మా అవసరం ఉంది, వెనుకడుగు వేయలేం'
24 ఏళ్ల సిమ్రన్ అగర్వాల్ 2020 మార్చిలో ముంబయిలోని నాయర్ ఆస్పత్రిలో ఇంటర్న్‌గా చేరారు. "నా స్నేహితులు చాలామంది ఇంటర్న్‌షిప్‌లో చేరిన మొదటి రోజే చావులు చూశారు. ఇది జీర్ణించుకోవడం అంత సులభం కాదు. ట్రైనింగ్‌లో చేరిన మొదట్లోనే ఇలాంటివి ఎదురయితే చాలా కష్టంగా ఉంటుంది" అని ఆమె అన్నారు. "మేము చూస్తున్న రోగులకు నాలుగు మాటలు చెప్పి మానసిక ధైర్యం కలిగించడం, భరోసా ఇవ్వడం కష్టమైపోతోంది. ఎందుకంటే మేమే శారీరకంగా, మానసికంగా బాగా అలిసిపోయి ఉన్నాం" అని సిమ్రన్ న్యూస్‌బీట్‌తో చెప్పారు.

 
రోగుల్లోనూ, ఆస్పత్రి సిబ్బందిలోనూ కూడా భయాన్ని పోగొట్టడం తన ఇంటర్న్‌షిప్‌లో ఎదురైన అతి పెద్ద సవాలని సిమ్రన్ చెప్పారు. "తమ కుటుంబాల నుంచి దూరమై ఐసొలేషన్‌లో ఉన్న రోగులు భయంతో ఏడ్చి, పారిపోడానికి ప్రయత్నించేవారు." "వైద్య వృత్తి చాలా జటిలమైనదని తెలుసు. కానీ, ట్రైనింగ్ సమయంలోనే గుండెలను మెలిపెట్టే సంఘటనలు ఎదుర్కోవడం అతి పెద్ద సవాలు" అని సిమ్రన్ బీబీసీ ఓఎస్ ప్రోగ్రాంలో చెప్పారు.

 
కోవిడ్ వార్డ్‌లో షిఫ్ట్‌లకు మధ్యలో ఇంటర్న్‌లకు వేరే పనులు అప్పజెప్పేవారు. వివిధ ఆస్పత్రులో వైద్య సామాగ్రిని పర్యవేక్షించడం, కొరతలు ఉన్నాయేమో తెలుసుకోవడం మొదలైన పనులు చెప్పేవారు. అయితే, ఈ పనులు కూడా చాలా శ్రమతో కూడినవే. తన ఇంటర్న్‌షిప్‌లో భాగంగా కోవిడ్ హెల్ప్‌లైన్‌ను నిర్వహించడం కష్టతరమైన భాధ్యతగా అనిపించిందని సిమ్రన్ చెప్పారు. రోగుల కోసం ఆస్పత్రి పడకలు వెతకడం, అంబులెన్స్ పంపించడంలాంటివన్నీ కోవిడ్ హెల్ప్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది.

 
డిసెంబర్, జనవరికల్లా సిమ్రన్ పూర్తిగా అలిసిపోయారు. కొన్ని రోజులైనా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపించినప్పటికీ పని నుంచి పక్కకు తప్పుకునే అవకాశమే ఆమెకు దొరకలేదు. గుజరాత్‌లో పంక్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. "మేము కొత్తగా ఈ వృత్తిలో ట్రైనీలుగా చేరినందువల్లనేమో బాగా అలిసిపోతున్నాం. ఈ సమయంలో మా అవసరం ఉందని మాకు తెలుసు. రోగులకు మా సహాయం కావాలి. అయితే, డెస్క్ జాబ్ కన్నా వార్డ్‌లో ఉంటూ రోగులకు చికిత్స అందించడమే నాకు ఇష్టం" అని పంక్తి చెప్పారు.

 
'ఒకరిద్దరు రోగుల ప్రాణాలు కాపాడగలిగినా చాలు, తృప్తిగా ఉంటుంది'
మరొక జూనియర్ డాక్టర్ కామ్నా కక్కర్ కూడా కోవిడ్ వార్డ్‌లోనే ట్రైనీగా పని చేస్తున్నారు. 29 ఏళ్ల కామ్నా గత ఏడాది వేసవిలో అనస్థీస్ట్‌గా గ్రాడ్యుయేట్ అయ్యారు. హర్యానాలోని రోహతక్‌లో ఒక ఏడాదిపాటు తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించిన తరువాత కామ్నా తన సబ్జెక్ట్ మార్చుకుని ఐసీయూలో ఉండే విధంగా కెరీర్ మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు.

 
"మా చుట్టూ ఎంత దుఃఖం ఉన్నా, పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా కూడా ఒకరు లేదా ఇద్దరు రోగుల ప్రాణాలు కాపాడగలిగినా చాలు, ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ వృత్తిలో చేరడం కోసమే పుట్టానేమో అనిపిస్తుంటుంది" అని కామ్నా అన్నారు. అయితే, కరోనా రెండో దశ చాలా ప్రమాదకరంగా, వినాశనకారిగా ఉందని ఆమె అంగీకరించారు. కామ్నా చాలాసార్లు డబుల్ షిఫ్ట్ చేయాల్సి వస్తోంది. ఎందుకంటే తన సహచరుల్లో చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. సిబ్బంది కొరత ఏర్పడుతోంది. గత వారం ఐసీయూ బెడ్ కోసం పడిగాపులు కాస్తూ ఎమెర్జెన్సీలో కిక్కిరిసిపోయిన రోగులను చూసి కామ్నా చాలా కలత చెందారు. "అది చూసి గుండె పగిలిపోయింది" అని ఆమె చెప్పారు.

 
అప్పటి నుంచీ కుప్పలుగా చేరుతున్న మృతదేహాల గురించి ఆలోచించకూడదని, ఆ సంఖ్యను మనసుకు ఎక్కించుకోకూడదని కామ్నా ప్రయత్నిస్తున్నారు. అప్పుడే ప్రాణాలతో ఉన్న రోగులను కాపాడడంపై దృష్టి పెట్టగలుగుతానని ఆమె అంటున్నారు. "ఇంత అమానవీయంగా ఆలోచించాల్సి రావడం విచారకరం. కానీ, పరిస్థితులు అలా ఉన్నాయి. ఐసీయూలో పని చేయడం నాకు ఇప్పుడు అలవాటైపోయింది అనిపిస్తోంది. భావోద్వేగాలను కొంతవరకు నియంత్రించుకోగలుగుతున్నాను. రాబోయే రోజుల్లో మరింత దృఢపడగలననే అనుకుంటున్నాను" అని కామ్నా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments