నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డారు. పార్లమెంట్ సభ్యులందరికీ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించారు. తొలి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారినపడినట్లు నేపాల్ పార్లమెంట్ కార్యదర్శి గోపాల్‌నాథ్ యోగి తెలిపారు.
కరోనా సోకిన ఈ 26 మందిలో నలుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. దాంతో సోమవారం పార్లమెంట్లో జరుగాల్సిన ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాసపరీక్షపై ఉత్కంఠ నెలకొన్నది.
మరోవైపు, ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్లమెంట్‌లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు.
నేపాల్ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్-యుఎంఎల్‌కు ప్రస్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.