కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారితో పాటు పలువురు కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని అహ్మదాబాద్ దవాఖాన వెల్లడించింది. ఐసీయూ రోగులతో పాటు దీర్ఘకాలంగా వ్యాధినిరోధక శక్తి లోపించిన వారికి బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గత 20 రోజులుగా ఈఎన్టీ వార్డులో 67 మంది రోగుల్లో బ్లాక్ ఫంగస్ ను గుర్తించినట్టు బీజే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ దవాఖానలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కల్పేష్ పటేల్ పేర్కొన్నారు. వీరిలో 45 మందిలో అవయవ మార్పిడి చేయాల్సి ఉందని చెప్పారు.
తాము రోజూ ఈతరహాలో ఐదు నుంచి ఏడు సర్జరీలు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ను గుర్తించిన కొద్దిరోజులకే అహ్మదాబాద్ లో ఇలాంటి కేసులు పెరుగుతున్నట్లు వెల్లడవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
గత ఏడాది ఈ ఇన్ఫెక్షన్ తో పలు మరణాలు చోటుచేసుకున్నాయని, పలువురు రోగులు కంటి చూపు కోల్పోవడం ముక్కు, దవడ ఎముకలను తొలిగించాల్సి వచ్చిందని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు డాక్టర్ అజయ్ స్వరూప్ పేర్కొన్నారు.
కోవిడ్ -19 చికిత్సలో స్టెరాయిడ్ల వాడకంతో పాటు మధుమేహ రోగులు అధికంగా ఉండటం బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా సైతం ఈ వాదనతో ఏకీభవించారు. అనవసరంగా స్టెరాయిడ్ డోసులు అధికంగా ఇవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.